అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి

ABN , First Publish Date - 2022-05-17T05:07:07+05:30 IST

అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో టీటీడీ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.

అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో అపశ్రుతి
మృతి చెందిన కత్తి యల్లయ్య

కుప్పకూలిన 20 అడుగుల ఊయల సామగ్రి 

కూలీలపై పడటంతో ఒకరి మృతి... ముగ్గురికి గాయాలు 

గోప్యంగా ఉంచిన టీటీడీ అధికారులు 

బాధితుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన 


రాజంపేట, మే 16 : అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో టీటీడీ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఊంజల సేవ కోసం ఊయలను ఏర్పాటు చేస్తుండగా అది కింద పడి ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జయంతి ఉత్సవాలంటే కల్యాణ ఏర్పాట్లు, ఊంజల సేవ ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల నిర్వహణ అంతా టీటీడీ అధికారులే చేయాలి. టీటీడీలో ప్రతిరోజూ ఇటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వల్ల ఈ ఉత్సవ ఏర్పాట్లలో అక్కడ టెక్నికల్‌గా అన్ని విషయాలు తెలిసిన కూలీలు ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తారు. అటువంటిది తాళ్లపాకలో ఉడతాభక్తిగా సేవలో ఒకరోజు మాత్రమే ఆగమేఘాల మీద నిర్వహించిన తూతూమంత్రపు ఉత్సవ ఏర్పాట్లు ఒక కూలీ ప్రాణాన్ని బలిగొన్నాయి. అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం టీటీడీ ఆధ్వర్యంలో తాళ్లపాకలో శ్రీవారి కల్యాణం నిర్వహించారు. సాయంత్రం తాళ్లపాక ముఖద్వారం 108 అడుగుల విగ్రహం వద్ద ఊంజల సేవ ఏర్పాట్లు చేశారు. టీటీడీ సాంకేతిక సిబ్బంది అక్కడికి రాకుండా తిరుమల నుంచి 20 అడుగుల ఊయలకు సంబంధించిన పనిముట్లు అక్కడికి తీసుకొచ్చారు. అక్కడున్న సభావేదిక కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉంది. అటువంటి వేదికపై ఊంజల సేవకు సంబంధించిన 20 అడుగుల ఊయల పనిముట్లను నిలబెట్టాల్సి ఉంది. ఈ పని కోసం తాళ్లపాక సమీపంలోని బోయనపల్లె అరుందతివాడ నుంచి ముగ్గురు కూలీలను పిలిపించి ఊయలకు సంబంధించిన పనులు చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలి కింద ఉన్న కూలీలపై పడింది. గాయపడ్డ వారిని టీటీడీ సిబ్బంది 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కత్తి యల్లయ్య (55) అనే కూలీ మృతి చెందాడు. ఇదే పనికి వచ్చిన మృతుడు యల్లయ్య కుమారుడు రామయ్య, మరో వ్యక్తి చంటయ్య స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరితో పాటు అక్కడ ఉన్న టీటీడీ ఉద్యోగికి కూడా గాయాలు కావడంతో అతడి విషయం టీటీడీ సిబ్బంది బయటపెట్టలేదు. కడప రిమ్స్‌ ఆసుపత్రిలో యల్లయ్య మృతి చెందడంతో వారి కుమారులు, బంధువులు కడప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఏదిఏమైనా ఉదయం సంఘటన జరిగితే గోప్యంగా ఈ విషయాన్ని దాచడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై మన్నూరు ఎస్‌ఐ భక్తవత్సలంను వివరణ కోరగా మృతుడు యల్లయ్య బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడప రిమ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారని ఈ విషయం తమకు తెలియజేశారని దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-05-17T05:07:07+05:30 IST