Abn logo
Jul 2 2020 @ 00:36AM

నేపాల్‌లో అసమ్మతి

నేపాల్‌ ప్రధాని కె.పి. శర్మ ఓలీ రాజీనామాకు సొంతపార్టీ నేతలు పట్టుబడుతున్నారు. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో చిన్నా పెద్దా నేతలంతా శర్మగారిని తప్పుకోమని గట్టిగా డిమాండ్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశాల తరువాత ఆయన తనకు సన్నిహితులనుకుంటున్న కొందరు మంత్రులతో మంతనాలు జరిపి, ఇంతలో ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరి పరీక్షలు కూడా చేయించుకున్నారు. తనను పదవినుంచి దించేయడానికి ఒక భయంకరమైన కుట్ర ఇంటా బయటా జరుగుతున్నదనీ, ఈ విదేశీ కుట్రకు తన పార్టీ నేతలే సహకరిస్తున్నారని నిర్భయంగా, నిస్సిగ్గుగా వ్యాఖ్యానించిన ఓలీ ఈ పరిణామాలను ఊహించలేదని అనుకోలేం. 


భారత భూభాగంలోని లిపులేఖ్‌, కాలాపాని, లింపియాథురా ప్రాంతాలను నేపాల్‌ మ్యాప్‌లో చేర్చి, రాజ్యాంగ సవరణ కూడా చేసిన ఓలి, ఈ కారణంగా భారత్‌ తనమీద కక్ష కట్టి, కూల్చేందుకు కుట్రలు పన్నుతోందని అంటున్నారు. తనను గద్దెదించడం ఎవరితరమూ కాదంటూనే స్వపక్ష నాయకులనూ, పొరుగుదేశ పాలకులను సంఘటిత కుట్రదారులుగా చూపుతున్నారు. తన వ్యాఖ్యలు భారత పాలకుల కంటే ఎక్కువగా స్వపక్షంలోని నాయకులకు ఆగ్రహం తెప్పిస్తాయని ఆయనకు తెలుసు. చిరకాల మిత్రదేశం మీద ఇలా విషం చిమ్ముతూ శత్రుత్వాన్ని పెంచుతున్నది కాక, మమ్మల్ని కూడా కుట్రదారులంటావా? అని వారు విరుచుకుపడతారనీ తెలుసు. ఆయన ప్రధాన ప్రత్యర్థి, అధికార కమ్యూనిస్టు పార్టీ చైర్మన్‌ పుష్పకుమార్‌ దహల్‌ అలియాస్ ప్రచండ సహా పెద్దతలకాయలన్నీ తన రాజీనామాకోసం పట్టుబడతారనీ ఊహించే ఉంటారు. కుట్రకు పాల్పడ్డామన్న ఆధారాలుంటే చూపండి, లేదా తక్షణం రాజీనామా చేయండని వారంతా సమావేశంలో వరుసబెట్టి నిలదీస్తుంటే ఆయన నోరుమెదపలేదట.


ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఒక విదేశీ ప్రభుత్వం కుట్రపన్నడం, అందులో స్థానిక నేతలు చేతులు కలపడం చిన్న విషయమేమీ కాదు. కేవలం ఒక రాజకీయ విమర్శగానో, తేలికపాటి వ్యాఖ్యగానో ప్రయోగించే అంశం కాదు. నిజంగానే కుట్ర జరిగినపక్షంలో కుట్రదారులు ఎవరో, సహకరిస్తున్నదెవరో నిగ్గుతేల్చి, ప్రజలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రధానిగా ఆయనమీద ఉన్నది. కానీ, ఓలీకి అదంతా అక్కరలేదు. నేపాలీ జాతీయవాదాన్నీ, భారత వ్యతిరేకతనూ నమ్ముకొని అధికారం నెరపుతున్న ఓలీకి తన మాటలు ప్రజలు నమ్మితే చాలు. పార్టీలోని మిగతావారంతా పొరుగుదేశం తొత్తులనీ, తానొక్కడే నేపాలీ జాతి రక్షకుడనని ఓలీ ప్రజలకు నిరూపించదల్చుకున్నారు. తనకు అధికారంమీద వీసమెత్తు వ్యామోహం లేదని అంటూనే, నేపాల్‌ ప్రయోజనాలను పరిరక్షించే జాతీయవాద నాయకుడిని తానొక్కడినేనని నమ్మించదల్చుకున్నారు. ఓలీ ఏకపక్ష వైఖరి వల్ల పార్టీ అధ్యక్షుడు ప్రచండ మాత్రమే కాక, అనేకమంది నాయకులు ఆయనకు శత్రువులయ్యారు. చైనాతో రాసుకుపూసుకోవడం సహా అనేక కీలకమైన, విధానపరమైన నిర్ణయాలను పార్టీలో చర్చించకుండానే ఓలీ తీసుకుంటున్నారు. రెండేళ్ళుగా పార్టీలో రగులుతున్న అసమ్మతి పోగుబడి, తనకు పదవీ గండం ముంచుకొస్తున్నదని గ్రహించగానే మ్యాపు రాజకీయానికి తెరదీశారు. భారత్‌ (కరోనా) వైరస్‌ మరింత ప్రమాదకరమన్న కఠినమైన వ్యాఖ్యలతో మాధేశీలపై నేపాలీల్లో వ్యతిరేకత రెచ్చగొడుతూ, భారత్‌తో చర్చలకు వీల్లేని వాతావరణాన్ని సృష్టించారు. స్వపక్షంతో సహా అన్ని పక్షాలనూ నోరుమెదపలేని ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టి రాజ్యాంగ సవరణ కానిచ్చారు. కరోనా నియంత్రణలో విఫలమై, అవినీతి ఆరోపణలు చుట్టుముడుతున్న తరుణంలో జాతీయతను బ్రహ్మాస్త్రంగా మలుచుకుంటున్నారు. ఒక విదేశీ ప్రభుత్వం కంటే, పార్టీలోని అసమ్మతే తనను కూల్చబోతున్నదని ఆయనకు తెలుసు. ఇప్పుడు పార్టీ పెద్దల ఒత్తిడికి తలవంచి ఆయన తప్పుకుంటారా లేదా, ఆయన స్థానంలో ఎవరు ప్రధాని అవుతారన్నవి పక్కనబెడితే, ప్రజల దృష్టిలో తాను ఓ స్వదేశీ విదేశీ ఉమ్మడి కుట్రకు బలైపోయిన జాతీయవాద నాయకుడిగా మిగిలిపోతే ఆయనకు చాలు. చైనాతో సాన్నిహిత్యం కారణంగా ఈ రెండేళ్ళకాలంలో నేపాల్‌ కోల్పోయింది ఎంతో, ప్రధానిగా తన వైఫల్యం ఏమిటో ప్రజలకు పట్టదనీ, కేవలం భారత్‌ వ్యతిరేక, మాధేశీ వ్యతిరేక వైఖరితో నేపాలీలను మాయచేయవచ్చునని ఆయన విశ్వాసం. ఇప్పుడు విధిలేక తప్పుకోవాల్సి వచ్చినా, సమీపకాలంలో చేయగలిగేదీ లేకున్నా, ఇలా కూడగట్టుకున్నదంతా భవిష్యత్తులోనైనా ఉపకరిస్తుందని ఆయన నమ్మకం. 

Advertisement
Advertisement
Advertisement