అసంతృప్త వాదులే టార్గెట్‌

ABN , First Publish Date - 2022-07-31T06:12:18+05:30 IST

అసంతృప్త వాదులే టార్గెట్‌

అసంతృప్త వాదులే టార్గెట్‌

టీఆర్‌ఎస్‌ కీలక నేతలను ఆకర్షించేందుకు బీజేపీ వ్యూహరచన

ఈటల రాజేందర్‌కు ‘ఆపరేషన్‌’ బాధ్యతలు

తాజాగా రాజయ్య యాదవ్‌ నిర్ణయంతో కలకలం

‘కమలం’ వైపు ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు చూపు

అదేదారిలో మరో నలుగురు సీనియర్‌ నేతలు?

అప్రమత్తమైన టీఆర్‌ఎస్‌ అగ్రనేతలు 


ఓరుగల్లు, జూలై 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఆపరేషన్‌ అన్‌రెస్ట్‌ (అసంతృప్తి) లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించలేదన్న అసంతృప్తితో నాయకులు రగిలిపోతున్నారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ప్రతినిధులుగా ఉన్న వారే నేడు అధికార దర్పంతో ఊరేగుతున్నారని అంతర్గతంగా ఆవేదన చెందుతున్నారు. ఉద్యమ కాలంలో ఏ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశామో.. ఇపుడు అదే నాయకులకు జేజేలు కొట్టాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం, మంత్రి కేటీఆర్‌లు జిల్లాకు వచ్చినపుడు మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం దక్కడం లేదని అవమాన భారంతో కుమిలిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి నాయకులే లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. పార్టీలో సరైన గుర్తింపు వచ్చే విధంగా తాము కృషిచేస్తామని హామీ ఇస్తున్నారు. ఈసారి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని నచ్చచెబుతున్నారు. వారు చెప్పిన మాటలను విశ్వసించడం కంటే, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎదుర్కొంటున్న అవమానాలకు ఉపశమనమైనా దొరుకుతుందని ఆశపడుతున్నామంటున్నారు.


టీఆర్‌ఎ్‌సలో రాజయ్య యాదవ్‌ కలకలం

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర గొర్రెలు, మేకలు పెంపకందారుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ 22 ఏళ్ల తన టీఆర్‌ఎస్‌ ప్రస్థానాన్ని వీడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ  ముఖ్యమైన సీనియర్‌ నేతల్లో రాజయ్య యాదవ్‌ ఒకరు. తెలంగాణ యాసలో రాజయ్య యాదవ్‌ మాట్లాడే తీరు ప్రజలను ఆకర్షించేది. సీఎం కేసీఆర్‌ సైతం ఉద్యమకాలంలో రాజయ్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. తన సొంత జిల్లా, నియోజకవర్గాలకు బాధ్యులుగా నియమించేవారు. అవకాశం వచ్చినప్పుడు ఎమ్మెల్యే లేదా ఎంపీ, ఎమ్మెల్సీ చేస్తానని చాలాసార్లు కేసీఆర్‌ తనకు వాగ్దానం చేశాడని రాజయ్య చెబుతున్నాడు.  

అలాంటి అవకాశాలేమీ రాకపోగా రాష్ట్రస్థాయి చైర్మన్‌ పదవి మాత్రం రాజయ్యకు దక్కింది. నాలుగేళ్ల నుంచి మాత్రం ఆ పదవి సైతం రెన్యువల్‌ కాలేదు. దీంతో కొంతకాలంగా రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇదే అదనుగా చూస్తున్న మాజీ టీఆర్‌ఎస్‌ నేత, నేటి బీజేపీ నేత ఈటల రాజేందర్‌ రంగంలోకి దిగి రాజయ్యను బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. రాజయ్యయాదవ్‌ మాత్రం తాను ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని చెబుతున్నారు. ఉద్యమకారులను టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు పంపేందుకే   కుట్రలు జరుగుతున్నాయంటున్నారు. తనలాగా టీఆర్‌ఎస్‌ పార్టీనీ వీడే వాళ్ళు  చాలామంది టీఆర్‌ఎ్‌సలో ఉన్నారని రాజయ్య యాదవ్‌ అంటున్నారు. 


కమలం వైపు ప్రదీ్‌పరావు 

టీఆర్‌ఎస్‌ మరో నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు సైతం టీఆర్‌ఎస్‌ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రదీ్‌పరావుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రదీ్‌పరావుతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలు తనకు అనేకసార్లు పదవులు ఇస్తామని మోసం చేశారన్న భావనలో ప్రదీ్‌పరావు ఉన్నట్లుగా తెలుస్తోంది. 

ఎన్నికల సమయంలో నమ్మబలకడం.. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఎవరూ పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిందన్న ఆవేదనలో ఉన్నారు. బీజేపీలో సముచితస్థానం ఇచ్చేందుకు అగ్రనేతలు సుముఖత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. టీఆర్‌ఎ్‌సలో ఎంతకాలం ఎదురుచూసినా తనకు ఎలాంటి పదవులు దక్కే అవకాశం లేదన్న భావనలో ప్రదీ్‌పరావు ఉన్నారు. దీంతో వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజలతో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. బీజేపీలో తనతో పాటే పెద్ద ఎత్తున నాయకులు, యువకులు, మహిళలు చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


గుడ్‌బై  చెప్పేందుకు...

టీఆర్‌ఎస్‌ పార్టీని వీడేందుకు మరికొందరు నేతలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నెక్కొండ మండలానికి చెందిన సీనియర్‌ నేత గటిక అజయ్‌కుమార్‌ బీజేపీ కండువా కప్పుకున్నారు.  హనుమకొండ జిల్లాకు చెందిన ముగ్గురు సీనియర్‌ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పూర్వాశ్రమంలో వీరికి బీజేపీ నేపథ్యం ఉండడం వల్ల బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పరకాలకు చెందిన మరో సీనియర్‌ నేత సైతం బీజేపీ బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు నెలలో బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్ర ఉన్నందున ఆ సమయంలో పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ నుంచి చేరికలు ఉండే విదంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. 


ఇదిలా ఉండగా  భీమదేవరపల్లి మండలం  ముల్కనూర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌ అసంతృప్త  నేతలు అదనుకోసం వేచి చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అవకాశం దొరికితే చాలు.. గులాబీ పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎ్‌సపార్టీ మాత్రం ఈ పరిణామాల పట్ల మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటిస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలే విమర్శిస్తున్నారు.


Updated Date - 2022-07-31T06:12:18+05:30 IST