దిశ యాప్‌ వజ్రాయుధం వంటిది

ABN , First Publish Date - 2021-07-31T05:28:17+05:30 IST

మహిళల చేతిలో దిశ యాప్‌ వజ్రాయుధం వంటిదని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు.

దిశ యాప్‌ వజ్రాయుధం వంటిది
ఎస్పీ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీని ప్రారంభిస్తున్న మంత్రి వనిత

కొవ్వూరులో పోస్టర్‌ ఆవిష్కరణ.. మోటారు సైకిళ్ల ర్యాలీ

కొవ్వూరు, జూలై 30 : మహిళల చేతిలో దిశ యాప్‌ వజ్రాయుధం వంటిదని   స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరు యువరాజ్‌ కల్యాణ మండపంలో సబ్‌ డివిజన్‌ స్థాయి దిశ మహిళా రక్షణ అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మతో కలిసి దిశ యాప్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టం, యాప్‌లు రూపొందించిం దన్నారు. రాష్ట్రంలో 18 మహిళా పోలీస్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మహిళ యాప్‌పై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మాట్లాడుతూ నేరాలు జరగక ముందే నియంత్రించే అస్త్రమే దిశ యాప్‌ అని, ఒక వెపన్‌లా పనిచేస్తుందన్నారు. గత నెలలో 6.50 లక్షల మంది యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోగా 3,292 కాల్స్‌ వచ్చాయన్నారు. వాటిలో 3,200 టెస్టు కాల్స్‌, 92 సహాయం కోసం చేశారన్నారు. యాప్‌ను ఏవిధంగా డౌన్‌ లోడ్‌ చేసుకోవాలి. దిశ చట్టం, నిర్భయ చట్టానికి మధ్య తారతమ్యాలు ఏమిటి అనే అంశాలను వివరించారు. అనంతరం ఎస్సీ రాహుల్‌దేవ్‌ శర్మ, మంత్రి వనితలను సత్కరించారు. కల్యాణ మండపం నుంచి బస్టాండ్‌ సెంటర్‌, విజయవిహార్‌, ఎల్‌ఐసీ సెంటర్‌ మీదుగా మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీలు బి.శ్రీనాథ్‌, కె.లతాకుమారి, ఐసీడీఎస్‌ పీడీ విజయకుమారి, డాక్టర్‌ కోటేశ్వరమ్మ, సబ్‌డివిజన్‌ పరిధిలో సీఐలు, ఎస్‌లు, మహిళా పోలీసులు, గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులు, వలంటీర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T05:28:17+05:30 IST