దిశ.. కవచం

ABN , First Publish Date - 2021-07-22T05:18:59+05:30 IST

దిశ.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట. మహిళల రక్షణే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మొబైల్‌ యాప్‌.

దిశ.. కవచం

మహిళలకు పోలీసు రక్షణ

సాంకేతికతతో తక్షణ చర్యలు

యాప్‌తో ఎన్నో ప్రయోజనాలు

ఇప్పటికి 3 లక్షల మంది డౌన్‌లోడ్‌..


‘కోడూరు బీచ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న మహాలక్ష్మీపురంలో ఓ మహిళ కూల్‌డ్రింక్‌ దుకాణం నిర్వహిస్తోంది. కొందరు మద్యం సేవించిన వ్యక్తులు నాలుగు రోజుల క్రితం ఆ దుకాణానికి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. అక్కడే ఉన్న భర్త వారిని ప్రశ్నించగా ఆయన్ను నెట్టేశారు. ఆ మహిళ అప్రమత్తమై తన మొబైల్‌లో ఉన్న దిశ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కడంతో కొద్ది సమయానికే టీపీగూడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు’. 



నెల్లూరు (క్రైం), జూలై 21 :  దిశ.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట. మహిళల రక్షణే ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మొబైల్‌ యాప్‌. ఎక్కడున్నా సరే క్షణాల్లో పోలీసులకు సమాచారాన్నిచ్చి తక్షణ సాయం పొందేందుకు అక్కరకు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం. పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాల్సిన పని లేకుండా ఆపదలో ఉన్న ఆడవారికి అండగా నిలుస్తున్న సాధనం. జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీని ద్వారా వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు అప్పటికప్పుడే స్పందించి బాధితులను రక్షించడంతోపాటు పలువురిపై కేసులు చేశారు. అందరూ ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిశా యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, దాని ప్రయోజనాలు ఏమిటనే దానిపై ప్రత్యేక కథనం...


డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఇలా...

దిశ యాప్‌ను మహిళలు సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఫోన్లలో ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ ద్వారా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

డౌన్‌లోడ్‌ పూర్తైన తర్వాత మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే ఓటీపీ  వస్తుంది.

ఓటీపీ ఎంటర్‌ చేసిన వెంటనే పేరు, మొబైల్‌ నెంబర్‌, అడ్రస్‌, ప్రత్యామ్నాయ ఫోన్‌ నెంబరు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన నెంబరు... ఇలా వివరాలను నమోదు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 


ప్రయోజనాలు

ఇంటర్నెట్‌ ఉన్నా లేకపోయినా ఈ యాప్‌ పనిచేస్తుంది. 

ఆపదలో ఉన్న మహిళలు మొబైల్‌లో యాప్‌ ఓపెన్‌ చేసి ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే ఆ ఫోన్‌ లొకేషన్‌, ఆ ఫోన్‌ నెంబరు ఎవరి పేరు మీద ఉంది, చిరునామా... ఇలా వివరాలన్నీ నేరుగా పోలీస్‌ కంట్రోల్‌ రూముకి చేరుతాయి. 

బాధితురాలు ఎక్కడున్నారు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు 10 సెకన్ల నిడివిగల వీడియో, ఆడియోను పంపే అవకాశం ఈ యాప్‌లో ఉంది. దీంతో మహిళలు ప్రమాదంలో ఉన్న సమయంలో యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే కొద్ది సేపటికే కంట్రోల్‌ రూము నుంచి సమీపంలోని పోలీసు స్టేషన్‌కి,  దగ్గర్లో ఉన్న పోలీసు రక్షక వాహనాలకు సమాచారాన్ని అటోమేటిక్‌ కాల్‌ డిస్పాచ్‌ విధానంలో పంపుతారు. 

జీపీఎస్‌ అమర్చిన పోలీసు రక్షణ వాహనాల్లో మొబైల్‌ డేటా టెర్మినల్‌ ఉంటుంది. వాహనం ఉన్న ప్రాంతం నుంచి ఆ సందేశం వచ్చిన ప్రాంతం వరకు రూట్‌ మ్యాప్‌ కనిపిస్తుంది. దీన్ని అనుసరించి ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకుంటారు. 

దిశ యాప్‌ ద్వారా 100, 112 నెంబర్లకు కూడా సహాయం కోసం ఫోన్‌ చేసుకునే అవకాశం ఉంది. 

యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నెంబర్లు, సమీపంలోని పోలీసు స్టేషన్ల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయి. 

దగ్గర్లోని మెటర్నిటీ, ట్రామా కేర్‌ సెంటర్లు, ఇతర ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీలు... వంటి వివరాలను కూడా ‘దిశ’ ద్వారా తెలుసుకోవచ్చు. 

బాధితులు ఉన్న ప్రదేశానికి సమీప పోలీసుస్టేషన్‌తోపాటు సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు నావిగేషన్‌, పోలీసు డైరెక్టరీ, అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేయాల్సిన నెంబర్లు, సామాజిక మాధ్యమాలు, రోడ్డు భద్రత వంటి ఆప్షన్లు యాప్‌లో పొందుపరిచి ఉన్నారు.


ట్రాక్‌మై ట్రావెల్‌.....

దిశ యాప్‌లో ట్రాక్‌ మై ట్రావెల్‌ అనే ప్రత్యేక ఆప్షన్‌ ఉంది. మహిళలు ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించేప్పుడు సేఫ్టీ కోసం వారి దీనిని ఎంపిక చేసుకుని వివరాలు నమోదు చేస్తే వారు వెళుతున్న మార్గాన్ని పోలీసులు కంట్రోల్‌ రూము నుంచి గమనిస్తారు. నిర్దేశిత మార్గంలో కాకుండా మరో మార్గంలోకి వాహనం వెళితే వెంటనే పోలీసు కంట్రోల్‌ రూముతోపాటు లోకల్‌ పోలీసులను అప్రమత్తం చేస్తూ ఓ మెసేజ్‌ వెళుతుంది.


ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

ప్రతి మహిళ వారి ఫోన్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఇది వారి దగ్గర ఉంటే పోలీసు రక్షణ వారికి ఉన్నట్లే. జిల్లాలో దిశ యాప్‌ ద్వారా ఫిర్యాదులు అందడం, వెంటనే పోలీసులు వారిని రక్షించడం, కేసులు నమోదు చేయడం జరిగింది. దిశ యాప్‌పై మహిళలు మరింతగా అవగాహన పెంచుకోవాలి.

- నాగరాజు, దిశ పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ

 

Updated Date - 2021-07-22T05:18:59+05:30 IST