ఇంకా పెంచండి

ABN , First Publish Date - 2022-05-27T07:14:32+05:30 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణగా ఉండాలని దిశ యాప్‌ ప్రవేశపెట్టారు. ప్రజలకు ఈ యాప్‌పై పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రజల్లో మాత్రం స్పందన లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు జిల్లాలవారీగా టార్గెట్‌లు ఇచ్చి తీవ్ర ఒత్తిడి మేరకు దిశ యాప్‌ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసేందుకు పోలీసులు పరుగులు పెడుతున్నారు.

ఇంకా పెంచండి

  • పోలీసులపై దిశ యాప్‌ టార్గెట్‌ల ఒత్తిడి
  • యాప్‌ డౌన్లోడ్‌ కోసం ఖాకీల పరుగులు

తుని, మే 26: రాష్ట్రంలో మహిళలకు రక్షణగా ఉండాలని దిశ యాప్‌ ప్రవేశపెట్టారు. ప్రజలకు ఈ యాప్‌పై పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రజల్లో మాత్రం స్పందన లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు జిల్లాలవారీగా టార్గెట్‌లు ఇచ్చి తీవ్ర ఒత్తిడి మేరకు దిశ యాప్‌ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసేందుకు పోలీసులు పరుగులు పెడుతున్నారు. అందులో భాగంగా మహిళలు మొబైల్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలని పోలీసులకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించినా ఇచ్చిన టార్గెట్‌ను చేరుకోలేకపోతున్నారు. ప్రతిరోజూ కానిస్టేబుల్‌ స్థాయినుంచి ఎస్‌ఐ స్థాయి అధికారుల వరకూ టార్గెట్‌ నిర్ధేశించడంతో పోలీసులకు తీరిక లేకుండా రోడ్డుపై వాహనాలను తనిఖీలు చేయడంతోపాటు వారి ఫోన్‌ల్లో, పాఠశాలల ప్రాంగణంల్లో ఆడ, మగ తేడా లేకుండా వారి మొబైల్‌ తీసుకుని దిశ యాప్‌ను డౌన్లోడ్‌ చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలు ఆపి యాప్‌కోసం ఫోన్‌ తీసుకున్నప్పుడు కొంతమంది కానిస్టేబుల్‌పై తిరగబడుతున్నారు. ఎందుకంటే తాము ఏదో అర్జెంట్‌ పనిలో వెళ్తున్నప్పుడు ఆపి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అదనపు విధులవల్ల..

దిశయాప్‌ కోసం ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదనపు విధులవల్ల రోజువారీగా చేయాల్సిన విధులను నిర్వర్తించడం కష్టమవుతోందని వాపోతున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులకు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించండి అంటూ ఇబ్బందులు పెట్టడాన్ని కొంతమంది పోలీసులు తప్పుబడుతున్నారు. గత ప్రభుత్వంలో డ్యూటీలు నిర్వహించడానికి సిబ్బంది సరిపోవడం లేదని గగ్గోలు పెట్టిన పోలీసులు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదనపు సిబ్బంది కావాలని అడగడం కూడా మర్చిపోయారు. కొన్నిస్టేషన్లలో అబ్బే మాకు సిబ్బంది కొరతలేదని వైసీపీ నాయకులు మెప్పుకోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

100కి కాల్‌ చేస్తే...

గత ప్రభుత్వంలో అత్యవసర సమయంలో పోలీసులు సహాయం కోసం 100 నెంబరుకు కాల్‌ చేస్తే వెంటనే హాజరయ్యేవారు. దీన్ని ప్రస్తుతం ప్రభుత్వం దిశ పోలీస్‌స్టేషన్లు పెట్టి యాప్‌ను సృష్టించారు. దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే పది నిమిషాల్లో పోలీసులు మీకు సహాయం అందిచడానికి వచ్చేస్తారని వైసీపీ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు ఊదరకొడుతున్నారు. ఈ యాప్‌ అమలుకోసం ప్రభుత్వం కోట్ల నిధులు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నా ప్రజలకు మాత్రం ముందుకు రావడం లేదు. పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సిబ్బందిని పెంచుకుంటే సరిపోయేదానికి ఎందుకింత ఆర్భాటమని కొందరు బహిరంగంగానే అంటున్నారు.

Updated Date - 2022-05-27T07:14:32+05:30 IST