Abn logo
Sep 19 2020 @ 00:15AM

పిడికిలి బిగిస్తున్న దర్శకులు

Kaakateeya

మన చేతిలో ఐదు వేళ్లు ఒకేలా ఉండవు. దేని ప్రత్యేకత దానిదే! దేని బలం దానిదే! అదే ఐదు వేళ్లు కలిపి పిడికిలిగా బిగిస్తే? ఒక్కో వేలికి ఐదింతల బలం వస్తుంది. దర్శకుల్లోనూ అంతే! అందరూ ఒకేలా ఉండరు! ఎవరి ప్రత్యేకత వాళ్లదే! ఎవరి బలం వాళ్లదే!! అదే ఓ నలుగురైదుగురు కలిసి ప్రాజెక్ట్‌ చేస్తే? ప్రేక్షకులలో ఆ ప్రాజెక్ట్‌కి మరింత క్రేజ్‌ వస్తుంది. బహుశా... దర్శకులు ఇది గమనించారేమో!? నలుగురైదుగురు కలిసి పిడికిలి బిగిస్తున్నారు!


సాధారణంగా సినిమాలో ఒకే కథ ఉంటుంది! దర్శకుడు ఒక్కరే ఉంటారు! నాలుగైదు కథలను కలిపి ఒక్క సినిమాగా తీయడం మన భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అరుదుగా జరుగుతుంటుంది. యాంథాలజీలు... ఒకటి కంటే ఎక్కువ కథలను సంకలనంగా తీయడం తక్కువే. ఉదాహరణకు... ‘వేదం’, ‘చందమామ కథలు’, ‘మనమంతా’ చిత్రాలను యాంథాలజీలుగా చెప్పుకోవచ్చు. వెండితెరపై ఈ తరహా చిత్రాలు తక్కువే కానీ డిజిటల్‌ తెరపై ఎక్కువగా  వస్తున్నాయి. వెండితెరపై వచ్చిన యాంథాలజీలను గమనిస్తే... దర్శకుడు ఒక్కరే ఉంటున్నారు. తెలుగు ఓటీటీలో వచ్చిన ‘మెట్రో కథలు’ యాంథాలజీకి కూడా కరుణకుమార్‌ ఒక్కరే దర్శకత్వం వహించారు. అయితే  హిందీలో వస్తున్న యాంథాలజీలకు ఒక్కరి కంటే ఎక్కువ దర్శకులు ఉంటున్నారు. ఓటీటీ వేదికల కోసం ఇలా దర్శకులు కలసి పిడికిలి బిగిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో కథకు దర్శకత్వం వహిస్తున్నారు. అలా తీసిన నాలుగైదు లఘు చిత్రాలను కలిపి ఓటీటీలో ఒక్కటిగా వెబ్‌ సిరీస్‌ రూపంలో విడుదల చేస్తున్నారు. హిందీలో ఈ ట్రెండ్‌ ఊపందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో  కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.

సుక్కు మార్క్‌ప్రేమకథలు!

ప్రేమకథలు తెరకెక్కించడంలో దర్శకుడు సుకుమార్‌ది ప్రత్యేక శైలి. ‘ఆర్య’, ‘ఆర్య 2’, ‘100ు లవ్‌’ చిత్రాలే ఆ సంగతి చెబుతాయి. ఓ ఓటీటీ కోసం ఆయన తొమ్మిది వైవిధ్యమైన ప్రేమకథలను సిద్ధం చేయిస్తున్నారని తెలిసింది. అందులో కొన్ని కథలకు ఆయనే దర్శకత్వం వహించనున్నారనీ, మరికొన్ని కథలను  శిష్యులు, సన్నిహిత దర్శకుల చేతిలో పెడతారని సమాచారం. పల్నాటి సూర్యప్రతాప్‌, సానా బుచ్చిబాబు తదితరుల పేర్లు ఈ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించే దర్శకుల జాబితాలో ఉన్నాయట. అయితే, అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

మణిరత్నం ‘నవరస’

దర్శకుడిగా, నిర్మాతగా ‘నవరస’ సిరీస్‌తో మణిరత్నం డిజిటల్‌ తెరపై అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఆయనో సిరీస్‌ చేయనున్నారు. తొమ్మిది కథలు, తొమ్మిది దర్శకులతో ‘నవరస’ థీమ్‌తో రూపొందిస్తున్నారని సమాచారం. ఇందులో ఓ కథకు మణిరత్నం దర్శకత్వం వహిస్తారట. దర్శకులు గౌతమ్‌ మీనన్‌, కార్తీక్‌ నరేన్‌, బిజోయ్‌ నంబియార్‌, కేవీ ఆనంద్‌, జయేంద్ర ఒక్కో కథకు దర్శకత్వం వహిస్తారని టాక్‌. . ‘నవరస’తో అరవింద్‌ స్వామి, సిద్ధార్థ దర్శకులుగా పరిచయమవుతుండడం ఆసక్తికరం. 

తెలుగులోనూ శృంగార చిత్రమ్‌!

హిందీలో వచ్చిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ యాంథాలజీ ఓ సంచలనం! శృంగార చిత్రమ్‌గా వీక్షకులను ఉర్రూతలూగించింది.  ఇప్పుడు తెలుగులోనూ ‘లస్ట్‌ స్టోరీస్‌’ తెరకెక్కుతోంది. హిందీలో వచ్చిన కథలతో కాకుండా... కొత్త కథలతో తెరకెక్కిస్తున్నారు. ఇందులోనూ నాలుగు కథలు ఉంటాయి. ఓ కథకు తరుణ్‌ భాస్కర్‌, మరో కథకు సంకల్ప్‌రెడ్డి, ఇంకో కథకు నందినీరెడ్డి దర్శకత్వం వహించారు. మరో కథ రెడీ అయ్యాక ‘లస్ట్‌ స్టోరీస్‌’  విడుదలవుతుంది. దానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించడం ఖాయమని అంటున్నారు.  కరోనా వల్ల ఆ చిత్రానికి బ్రేకులు పడ్డాయని సమాచారం. నందినీ కథలో అమలా పాల్‌, సంకల్ప్‌రెడ్డి తీసిన కథలో ఈషా రెబ్బా నటించారు.

కుట్టి చిట్టి తమిళ్‌ లవ్‌స్టోరీ

తమిళ దర్శకులు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌, వెంకట్‌ ప్రభు, విజయ్‌, నలన్‌ కుమారస్వామి కలిసి ఓటీటీ కోసం ఒక యాంథాలజీ తీస్తున్నారు. ఆ వెబ్‌ సిరీస్‌ టైటిల్‌ ‘కుట్టి లవ్‌ స్టోరీ’. నలుగురి దర్శకుల వాయి్‌సతో కూడిన టీజర్‌ కూడా విడుదల చేశారు. నలన్‌ తెరకెక్కించబోయే కథలో విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మీనన్‌ కథలో అమలా పాల్‌ నటించనున్నారు. తెలుగు ప్రేక్షకులకు తెలిసిన దర్శకులు, నటీనటులు చేస్తున్న సిరీస్‌ కావడంతో తెలుగులోనూ అనువదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందనున్న మరో యాంథాలజీకీ గౌతమ్‌ మీనన్‌ పని చేయనున్నట్టు చెన్నై టాక్‌. అందులో నాలుగు కథలు ఉంటాయనీ... గౌతమ్‌ మీనన్‌, ‘గురు’ ఫేమ్‌ సుధా కొంగర, వెట్రిమారన్‌, విఘ్నేశ్‌ శివన్‌  ఒక్కో కథకు దర్శకత్వం వహిస్తారని వినికిడి.

దర్శకులు సేమ్‌... సిరీస్‌లు వేర్వేరు!

కరణ్‌ జోహార్‌, అనురాగ్‌ కశ్యప్‌, జోయా అక్తర్‌, దిబాకర్‌ బెనర్జీ... ‘లస్ట్‌ స్టోరీస్‌’ సృష్టించినదీ నలుగురే! ఒక్కొక్కరూ ఒక్కో కథకు దర్శకత్వం వహించారు. ఇండియాలో ఓటీటీ రంగంలో యాంథాలజీలకు క్రేజ్‌ తీసుకొచ్చిందీ సిరీసే అని చెప్పుకోవాలి. ‘లస్ట్‌ స్టోరీస్‌’ విజయం తర్వాత ఈ నలుగురు కలిసి ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’ అని మరో యాంథాలజీ చేశారు. ఈ రెండూ వీక్షకులను ఆకర్షించాయి. యాంథాలజీ అని కాదు గానీ... ‘మేడిన్‌ హెవెన్‌’కి నిత్యా మెహ్రా, జోయా అక్తర్‌, ప్రశాంత్‌ నాయర్‌, అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు.

Advertisement
Advertisement