May 17 2021 @ 16:03PM

షాక్: ఐసీయూలో బెడ్ దొరకక.. మెగా దర్శకుడికి మాతృవియోగం

కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో ఎంత తీవ్రంగా ఉందో తెలియంది కాదు. అయినవారిని పోగొట్టుకుని ఎందరో విలవిలలాడిపోతున్నారు. సీరియస్ కేసుల విషయంలో ఆక్సిజన్, వెంటలేటర్ బెడ్స్ దొరక్క ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు.. ఐసీయూ బెడ్ దొరకక.. తన తల్లి మంగమ్మను కోల్పోయారు. ఆమె కరోనాతో ఆదివారం మృతి చెందినట్లుగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా ట్వీట్ చేశారు. ఎంతగా ట్రై చేసినా.. సుబ్బు మదర్‌ని కాపాడుకోలేకపోయాం.. అని సాయి ధరమ్ తెలిపారు. మెగా హీరోతో సినిమా తీసిన డైరెక్టర్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.  


కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లలోకి మొట్టమొదటిగా తన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’ని విడుదల చేసి టాలీవుడ్‌కి ధైర్యాన్నిచ్చిన సుబ్బుకి.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. సుబ్బు తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సమయంలో సుబ్బు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సాయితేజ్, థమన్ వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు. ఒక్క సుబ్బు అనే కాదు.. సెలబ్రిటీలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈ మహమ్మారితో.. తమకి అత్యంత ఆప్తులైన వారిని పోగొట్టుకుని తీవ్ర దిగ్ర్భాంతికి లోనవుతున్నారు. మరి ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడతాయో..? ఈ దినదిన గండపు బతుకుల నుంచి.. మళ్లీ మాములు రోజులు మానవాళి ఎప్పుడు వస్తాయో..?.