‘భలే మంచిరోజు’, ‘శమంతకమణి’, ‘దేవదాస్’ సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో.. గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ..
‘‘ఫిమేల్ కేరెక్టర్ల నుంచి వచ్చే ఎమోషన్ ఈ కథకి బలమైన పాయింట్. ముఖ్యంగా హీరోకు హీరోయిన్ నుండే సమస్య వస్తుంది. అది ఏమిటి? అనేదే ‘హీరో’ కథ. ఈ కథకు కొత్తవారైతేనే పూర్తిగా న్యాయం చేయగలరని అనుకున్నాను. అశోక్ ఈ కథకి కరెక్ట్‌గా సరిపోతాడని భావించి ఆయనతో ఈ సినిమా చేయడం జరిగింది. అశోక్ వాళ్ల అమ్మగారైన పద్మగారిని పరిచయం చేయడంతో ఆమెకు కూడా కథ వినిపించాను. కథ నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కింది. అశోక్‌కు సినిమాలంటే చాలా ఇష్టం ఉంది.
చాలామంది ఏదో ఒక సందర్భంలో హీరో అవ్వాలనుకుంటారు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలని ఫీలింగ్ ఉంటుంది. ఇది కామన్ పాయింట్ ఇది నా అనుభవంతో తీసిన కథ కాదు. చుట్టూ స్టడీచేసి రాసుకున్న కథ. ఎటువంటి విసుగు కలిగించకుండా కమర్షియల్ అంశాలతో తీశాం. చూసిన ప్రేక్షకుడు రెండు గంటలు నవ్వుకుంటూనే ఉంటారు. అశోక్‌ను చూసి కొత్త హీరోని చూశామనే ఫీలింగ్ కూడా రాదు. జోనర్ పరంగా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఇంతవరకు ఎవరూ చెప్పని ఓ అంశం ఇందులో చెప్పాం. విడుదలైన టీజర్లో అశోక్‌ను కౌబాయ్‌గా, జోకర్‌గా ఇలా చూసుంటారు. కథలో అటువంటి వైవిధ్యాలు కుదిరాయి. కౌబాయ్ సినిమా చేయాలనేది ఎప్పటినుండో నా డ్రీమ్. అటువంటి సినిమా అంటేనే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్‌బాబు గుర్తుకు వస్తారు. సినిమాలో మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ కావద్దు.
సినిమాకు గ్యాప్ రావడం అనేది కోవిడ్ వల్ల అని చెప్పవచ్చు. నా దగ్గర పది కథలున్నాయి. నాకు కొత్తగా అనిపిస్తేనే, ఎవ్వరూ ఈ పాయింట్‌ను చెప్పలేదని అనుకుంటేనే సినిమా చేస్తాను. హీరో సినిమాలో అటువంటిదే చూస్తారు. అశోక్‌ను చూస్తే కొత్తవాడనే ఫీలింగ్ రాకూడదని మెగాస్టార్ చిరంజీవి, మహేష్‌బాబు సినిమాలు చూడమని చెప్పాను. వారిలో కామెడీ టైమింగ్ నాకు బాగా నచ్చుతుంది. యాక్టింగ్ కోర్సు చేయడంకంటే చాలామంది స్టార్స్‌ను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. వారిని పరిశీలించి మనకు నచ్చింది మనకు అప్లయ్ చేసుకోవాలి. అందుకే అశోక్‌ను సినిమాలు చూడమని చెప్పాను. అతను యు.ఎస్.లో చదివినా తనకు తెలుగు రాయడం, మాట్లాడడం బాగా తెలుసు. నాకే సరిగ్గా తెలీదు. డబ్బింగ్ కూడా తనే చెప్పుకున్నాడు.
ఈ సినిమాలో ఛాలెంజింగ్ ఏంటంటే, ప్రయోగంతో పాటు వాణిజ్యాంశాలు కూడా ఉండేలా చేయడమే. కరోనా గ్యాప్ వల్ల షూటింగ్ చేసింది చూసుకుని ఇంకా ఏమైనా బెటర్ చేయవచ్చనేది ఆలోచించేలా తోడ్పడింది. అందరిని ఒప్పించేలా సినిమా చేయాలి అనేది నా రూల్. హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్రొఫెషనల్‌గా నటించింది. ఇంతకుముందు గ్లామర్ పాత్రలు చేసినా హీరో సినిమాలో సహజంగా ఉండే పాత్ర పోషించింది.
కృష్ణగారు నేను చేసిన ‘భలేమంచి రోజు’ చూశారు. మెచ్చుకున్నారు. ఇప్పుడు ‘హీరో’ సినిమా చూశారు. చాలా బాగా తీశావ్ అన్నారు. ఆయన మాట మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. రాజమౌళిగారు చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. నా ఫేవరేట్ దర్శకుడు ఆయన. ఆయన చేసిన బాహుబలి ఒకటికి వందసార్లు చూశాను. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ ఆయన నుండి నేర్చుకోవాలి. అంత బాగా చెబుతారు.
అసలు ఈ చిత్రాన్ని నవంబర్లోనే విడుదల చేద్దామనుకున్నాం. అప్పటికీ ఇంకా థియేటర్లకు జనాలు వస్తారో రారో అనే సందిగ్థంలో వున్నాం. ఆ తర్వాత సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో పండుగ రోజు ఎంటర్టైన్మెంట్ సినిమా ఉండాలని వస్తున్నాం. ఈ సినిమా థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది. సంక్రాంతికి మంచి వినోదం కలిగించే సినిమా అవుతుందని చెప్పగలను. ఓటీటీ వైపు వెళ్లాలని లేదు. ముందు ముందు నిర్మాణంలోకి వెళతానేమో చెప్పలేను. ప్రస్తుతానికి కొత్త సినిమాలు ఇంకా ఏమీ అనుకోలేదు..’’ అని తెలిపారు.