Abn logo
Feb 24 2021 @ 17:58PM

బెదిరింపులకు భయపడనంటోన్న దర్శకనిర్మాత

కోలీవుడ్‌: ఇటీవలికాలంలో ఆడియో ఆవిష్కరణలు జరిగిన చిత్రాల్లో ‘వా పకండయ్య’ ఒకటి. ఈ ఆడియోతో పాటు టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఇది ఇపుడు పెద్ద చర్చనే రేపింది. ఈ చిత్ర టీజర్‌లోని డైలాగులు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కొందరు సినీ సెలెబ్రిటీలు సైతం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ చిత్ర దర్శకనిర్మాత పి. జయకుమార్‌కు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ కూడా వస్తున్నాయి. తన చిత్ర కథపై వస్తున్న విమర్శలు, తనకు వస్తున్న బెదిరింపులపై ఆయన తాజాగా స్పందించారు. ఈ చిత్రంలోని పలు సంభాషణల కారణంగా తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని హీరోగా అభివర్ణించడాన్ని జీర్ణించుకోలేని కొందరు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని, అయితే, ఇలాంటి వాటికి భయపడే వ్యక్తిని కాదన్నారు. 


ఈ సినిమా పూర్తిగా చూసిన తర్వాత ఎవరైనా స్పందించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో తన చిత్రం ద్వారా బీజేపీకి ప్రచారం చేసి తద్వారా లబ్ధి పొందాలన్న ఆశ తనకు ఏమాత్రం లేదని  ఆయన స్పష్టం చేశారు. సమాజంలోని ఒక అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని దేశభక్తి కలిగిన ఒక తమిళుడుగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. కేవలం టీజర్‌లోని కొన్ని సంభాషణలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. పైగా ఈ చిత్రాన్ని సెన్సార్‌ సభ్యులు చూసి, సర్టిఫికెట్‌ను కూడా మంజూరు చేశారన్నారు. అలాంటపుడు తాను నిర్మించిన చిత్రం చెడు చిత్రమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇది ప్రజల కోసం, తన సొంత డబ్బుతో తీసిన చిత్రమని, ఈ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్‌ చేస్తానని ఆయన వివరించారు.

Advertisement
Advertisement
Advertisement