‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన దర్శకేంద్రుడు

ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై  సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఝాన్సీ కూనం  సమర్పణలో, రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు  ఆవిష్కరించారు. యండమూరితో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన నెమరువేసుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ... సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్న ‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి వీరేంద్రనాధ్ సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. నా దర్శకత్వంలో రూపొంది అసాధారణ విజయాలందుకున్న "ఆఖరి పోరాటం, జగదేకవీరుడు-అతిలోక సుందరి" చిత్రాల రచయిత అయిన యండమూరి... దర్శకుడిగాను ఇప్పటికే తన ప్రత్యేకతను ప్రకటించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న "అతడు ఆమె ప్రియుడు" ఘన విజయం సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలి" అన్నారు.యండమూరి మాట్లాడుతూ... "రాఘవేంద్రరావు  నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గురువులాంటివారు కూడా. భారతదేశం గర్వించదగ్గ మహా దర్శకుడాయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, మా చిత్ర ప్రచారానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది" అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో  నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి , ప్రముఖ నిర్మాత-వ్యాపారవేత్త అంబికా రాజా, హీరోయిన్ మహేశ్వరి, అమర్, నటుడు భూషణ్ తదితరులు పాల్గొన్నారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. 


Advertisement