Oct 28 2021 @ 18:32PM

అవసరమైన వారికే రిజర్వేషన్లు కేటాయించండి: దర్శకుడు

సమాజంలో ఆర్థిక పరంగా రిజర్వేషన్లు కేటాయించాలని తమ చిత్రంలో చెప్పలేదని, సమాజంలో అవసరమైన వారికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలన్న పాయింట్‌ను ఈ సినిమాలో చెప్పినట్టు దర్శకుడు ప్రభు జయరాం తెలిపారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎన్నంగ సర్‌ ఉంగ చట్టం’. ఈ చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్రాన్ని సినీ పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ తర్వాత చిత్రం బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 

ఇందులో దర్శకుడు ప్రభు జయరాం మాట్లాడుతూ.. ‘‘కమర్షియల్‌గా కథను నరేట్‌ చేసే ఒక దర్శకుడు సీరియస్‌గా కథ చెప్పేందుకు ప్రయత్నిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో ఈ చిత్ర స్ర్కీన్‌‌ప్లే ఉంటుంది. ఆర్థికపరంగా రిజర్వేషన్లు కేటాయించాలని చెప్పలేదు. ఈ రిజర్వేషన్లు అవసరమైన వారికి మాత్రమే కేటాయించాలని చెప్పాను. అన్ని కులాల వారిని అర్చకులుగా నియమించడాన్ని స్వాగతిస్తున్నాం. తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అన్ని కులాల వారిని అర్చకులుగా నియమించింది. మా చిత్ర  కథ కూడా ఇదే’ అని ప్రభు జయరాం వివరించారు. కాగా, పాషన్‌ స్టూడియోస్‌ పతాకంపై సుధన్‌ సుందరం, జి. జయారం కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ఆర్‌ఎస్. కార్తీక్‌, ఐరా, భువతి పెరుమాళ్‌, రోహిని, జూనియర్‌ బాలయ్య, సౌందర్య బాలా నందకుమార్‌, తాన్య, కయల్‌ విన్సెంట్‌, మీరా మిథున్ తదితరులు నటించగా.. గుణా బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చారు.