పానీపూరీ తింటే టైఫాయిడ్‌.. ఈ సీజన్‌లో తినకపోవడం మంచిదని సూచన

ABN , First Publish Date - 2022-07-13T16:22:10+05:30 IST

రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు

పానీపూరీ తింటే టైఫాయిడ్‌.. ఈ సీజన్‌లో తినకపోవడం మంచిదని సూచన

ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హెచ్చరిక 

ఈ సీజన్‌లో తినకపోవడం మంచిదని సూచన

రాష్ట్రంలో పెరుగుతున్న టైఫాయిడ్‌, డెంగీ కేసులు

ప్రైవేటు దోపిడీపై 91541 70960కు ఫిర్యాదు

కొవిడ్‌ ముగిసినట్టే.. ఐనా అలసత్వం వద్దన్న డీహెచ్‌


హైదరాబాద్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టైఫాయిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కలుషితాహారం తినడం, పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్లే వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో పానీపూరీ తిని అనేక మంది టైఫాయిడ్‌ బారిన పడుతున్నారని హెచ్చరించారు. పానీపూరీ బండ్ల దగ్గర శుభ్రత లేకపోవడం, వాటిలో వాడే నీళ్లు సురక్షితమైనవి కాకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఈ సీజన్‌లో పానీపూరీ జోలికి వెళ్లవద్దని సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పానీపూరీ, తోపుడు బండ్ల వాళ్లు ఆహార పదార్థాల తయారీ, అమ్మకం విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని కోరారు. కాచి, చల్లార్చి వడపోసిన నీళ్లనే పానీపూరీలో వినియోగించాలని పేర్కొన్నారు. తోపుడు బండ్లపై ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ‘పది రూపాయల పానీపూరీ తినడం వల్ల రేపు పదివేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావచ్చు’ అని ప్రజలను హెచ్చరించారు. ప్రజలు కూడా ఇళ్లల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మిషన్‌ భగీరథ వల్ల కలుషిత నీటి సమస్య తగ్గిందని ఫలితంగా వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉందని పేర్కొన్నారు. 2023 కల్లా తెలంగాణ మలేరియా రహిత రాష్ట్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


కొవిడ్‌ కథ  ముగిసినట్టే.. కానీ..

కొత్త వేరియంట్లు వస్తే తప్ప కొవిడ్‌ కథ ఇక ముగిసినట్లేనని శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సీజనల్‌ వ్యాధుల తీవ్రత పెరిగిందని, ఇప్పుడు పోరాడాల్సింది వాటితోనే అని పేర్కొన్నారు. టైఫాయిడ్‌తో పాటు మలేరియా, డెంగీ తదితర కేసులు పెరుగుతున్నాయన్నారు. సీజనల్‌ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని చెప్పారు. డెంగీ టెస్టు కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులన్నింటిలో బ్లడ్‌ కాంపొనెంట్‌ యంత్రాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఐవీప్లూయిడ్స్‌తో పాటు ఇతర అత్యవసర మందులు, బెడ్లను అందుబాటులో ఉంచామన్నారు.


కాంటాక్టు ట్రేసింగ్‌ అవసరం లేదు

కొవిడ్‌ ఎండెమిక్‌ దశకు వచ్చిందని శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదువేల యాక్టివ్‌ కేసులుంటే ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. ఇది సాధారణ జ్వరంలా మారిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో కూడా ఐసోలేషన్‌ మార్గదర్శకాలను సవరించిందని చెప్పారు. కాంటాక్టు ట్రేసింగ్‌ అవసరం లేదని పేర్కొందని, రాష్ట్రం కూడా అదే దారిలో నడుస్తుందని అన్నారు. అయితే, కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, సీజనల్‌ వ్యాధులు, కొవిడ్‌ లక్షణాలు ఒకేలా ఉంటాయని తెలిపారు. ఎవరిలోనైనా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేట్‌ కావాలని కోరారు. 3-5 రోజుల్లో వ్యాధి లక్షణాలు తగ్గకపోతే టెస్టులు చేయించుకోవాలన్నారు. 


అనవసరంగా ప్రైవేటుకు వద్దు

ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని శ్రీనివాసరావు కోరారు. ప్రజల బలహీనతను ఆసరాగా  చేసుకొని వ్యాపారం చేయవద్దని దవాఖానలను హెచ్చరించారు. ప్లేట్‌లెట్ల పేరుతో దోపీడీ చేయవద్దన్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై ఫిర్యాదు చేయాలనుకుంటే 91541 70960 నంబర్‌ను వాట్సాప్‌లో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2022-07-13T16:22:10+05:30 IST