Aug 3 2021 @ 22:06PM

రెమ్యూనరేషన్‌ని సగం వైట్‌, సగం బ్లాక్‌లో ఇమ్మంది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 50)

ఉషాకిరణ్‌ మూవీస్‌ పతాకంపై రామోజీరావుగారు నిర్మించిన చిత్రాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. మా గురువు టి.కృష్ణగారు రూపొందించిన ‘ప్రతిఘటన’ చిత్రానికి కో–డైరెక్టర్‌గా పనిచేశాను. నేను దర్శకుడైన తర్వాత ఆ సంస్థలో పనిచేసే అవకాశం కలగలేదు. ప్రముఖ సంస్థలన్నింటిలోనూ పనిచేశాను. ఉషాకిరణ్‌ మూవీస్‌లో కూడా పని చేసే అవకాశం వస్తే బాగుంటుందనిపించింది. ఎందుకంటే నేను అభిమానించే వ్యక్తుల్లో రామోజీరావుగారు ఒకరు. అటువంటి తరుణంలో ఆ సంస్థనుండి నాకు పిలుపు వచ్చింది.


మా గురువుగారిలా ఓ పవర్‌ఫుల్‌ పాయింట్‌తో సినిమా తీసే అవకాశం వచ్చిందని ఆనందిస్తూ వెళ్లాను. కథాచర్చలు మొదలయ్యాయి. సాయినాథ్‌గారు ఓ లైన్‌ చెప్పారు. అది రామోజీరావుగారికి నచ్చలేదు. ఆ తర్వాత తోటపల్లి మధు మరో కథ చెప్పారు. అదీ నచ్చలేదు. చివరకు ఘటికాచలం చెప్పిన కథ ఓ.కే. అయింది. అయితే నేను ఆశించినట్లు పవర్‌ఫుల్‌ పాయింట్‌ ఉన్న కథ కాదు. ఫ్యామిలీ సెంటిమెంట్‌ స్టోరీ. సినిమా పేరు ‘దీవించండి’. శ్రీకాంత్‌ హీరో. రాశి, మాళవిక హీరోయిన్లు. మాళవిక బదులు మొదట సిమ్రాన్‌ను ట్రై చేశాం. ఆమెకు కథ నచ్చింది. తప్పకుండా చేస్తానంది. అయితే పారితోషికం దగ్గర సమస్య వచ్చింది. ఉషాకిరణ్‌ మూవీస్‌వారు పేమెంట్స్‌ అన్నీ చెక్‌ రూపంలో చేస్తారు. బ్లాక్‌మనీ ప్రస్తావన అక్కడ ఉండదు. మొత్తం డబ్బు చెక్‌ రూపంలో తీసుకుంటే సమస్యలు వస్తాయి కనుక సగం వైట్‌, సగం బ్లాక్‌లో ఇమ్మంది సిమ్రాన్‌. వీళ్లు కుదరదన్నారు. చివరకు సిమ్రాన్‌కు బదులు మాళవికను ఎంపిక చేశారు..‘దీవించండి’ ఏబౌ ఏవరేజ్‌ సినిమా అయినా పబ్లిసిటీ కుమ్మేశారు. 125 రోజులు ఏకధాటిగా పబ్లిసిటీ చేశారు. బీ, సీ సెంటర్స్‌లో బాగా ఆడింది.

గోపీచంద్‌ హీరోగా పరిచయం

మద్రాసులోని రంగరాజపురంలో ఒక ఫ్లాట్‌ కొన్నానని చెప్పాకదా! వలసరవాక్కంలోని ఇల్లు పూర్తయిన తర్వాత ఫ్యామిలీని అందులోకి షిఫ్ట్‌ చేసి, రంగరాజపురం ఫ్లాట్‌ను ఆఫీసుగా మార్చేశాను. ఒక రోజు టి.కృష్ణ మెమోరియల్‌ పిక్చర్స్‌ అధినేత నాగేశ్వరరావుగారు టి.కృష్ణగారి రెండో అబ్బాయి గోపీచంద్‌ను వెంటబెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడిన తర్వాత అసలు విషయానికి వచ్చేసి, ‘‘ఏం చేస్తున్నావు గోపీ’’ అని అడిగాను. ‘‘రష్యా నుంచి వచ్చేశాను సార్‌. ఇక్కడే సెటిల్‌ అవుదామనుకుంటున్నాను’’ అని వినయంగా సమాధానం చెప్పాడు గోపీచంద్‌.అతని చదువంతా రష్యాలో సాగింది. సెలవలు దొరక్కపోవడంతో టి.కృష్ణగారు చనిపోయినప్పుడుగానీ, వాళ్ల అన్న ప్రేమ్‌చంద్‌ పోయినప్పుడు కానీ గోపీచంద్‌ రాలేదు.‘‘మరైతే ఏం చేద్దామనుకుంటున్నావు’’ అని అడిగాను.‘‘నేను సినిమాల్లోకి వద్దామనుకుంటున్నాను సార్‌’’ అని చెప్పాడు.వాళ్ల అన్నయ్య నా దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు కనుక ఇతను కూడా అలా చేరాలనుకుంటున్నాడేమో అనుకున్నాను. అయినా సందేహనివృత్తి కోసం ‘‘డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోనే?’’ అని అడిగాను.‘‘కాదు...’’ అని గోపీచంద్‌ ఏదో చెప్పబోయేంతలో నాగేశ్వరరావు కల్పించుకుని, ‘‘లేదు.. ఆర్టిస్ట్‌గా పరిచయం చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...