Jul 26 2021 @ 21:19PM

పవన్ కల్యాణ్ నచ్చలేదన్న కథతో వడ్డే నవీన్‌తో సినిమా చేశాం: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 43)

పవన్‌కల్యాణ్‌గారికి మా శీనయ్యతో అడ్వాన్స్‌ ఇప్పించానని చెప్పాను కదా. ‘పవిత్ర ప్రేమ’ పూర్తయిన తర్వాత కథాచర్చలు ప్రారంభించాం. నేను, మా శీనయ్య కథలు వినేవాళ్లం. చాలా విన్న తర్వాత ఓ కథ మా ఇద్దరికీ బాగా నచ్చింది. ఆ కథ పవన్‌కల్యాణ్‌కు కూడా నచ్చుతుందని భావించాం. కానీ ఆయన నచ్చలేదనేశారు. మరో కథ చూడండని చెప్పారు. దాంతో కొంత నిరాశకు గురయిన మాట వాస్తవం. ‘ఫరవాలేదు సార్‌.. మరో కథ చూద్దాం’ అని చెప్పి బయటకు వచ్చేశాం. మా శీనయ్య మాత్రం బాగా ఫీలయ్యాడు. ఎందుకంటే ఆ కథ అతనికంత నచ్చేసింది. ఆ కథతోనే సినిమా తీయాలని ఫిక్స్‌ అయ్యాడు.


‘ఎలాగైనా సరే.. ఈ కథతోనే మనం సినిమా తియ్యాలి. నువ్వు మళ్లీ బిజీ అయితే మాకు దొరకవు’ అని పట్టుపట్డాడు. ‘మన దగ్గర కథ ఉంది కానీ హీరో లేడు. ఎలారా?’ అన్నాను. ‘అదంతా నాకు తెలీదు.. నువ్వు ఏ హీరోనైనా పెట్టు. సినిమా తీయాల్సిందే’ అన్నాడు గట్టిగా. పెద్ద హీరోలు ఖాళీగా లేరు. ఇంకా ఎవరున్నారని వెదికితే వడ్డే నవీన్‌ ఖాళీగా ఉన్నాడని తెలిసింది. అదే విషయం మా శీనయ్యకు చెప్పాను. సరేనన్నాడు. పెద్ద హీరోలతో నేను వరుసగా సినిమాలు చేస్తున్నాను. కానీ నా స్నేహితుడు కథను నమ్మాడు. హీరో ఎవరైనా పరవాలేదంటున్నాడు కనుక నేను కూడా ముందడుగు వేశాను. నవీన్‌తో మాట్లాడాం.

పారితోషికం ప్రస్తావన వచ్చినప్పుడు ‘ఇరవై లక్షలు తీసుకుంటున్నాను’ అని నవీన్‌ చెప్పారు. కానీ అది నిజం కాదని ఆ తర్వాత మాకు తెలిసింది. అతని రేటు రూ. 15 లక్షలే. ఆ విషయం తెలియక పదిహేడున్నర లక్షలకు ఫైనలైజ్‌ చేసి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేశాం. ఈ విషయంలో మా శీనయ్య ఎప్పుడూ ఎగతాళి చేస్తుండేవాడు ‘నీకు.. డైరెక్షన్‌ గోల తప్పితే.. బిజినెస్‌ తెలీదురా’ అని. రాశి, సాక్షి శివానంద్‌ ఆ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ‘స్నేహితులు’ అనే టైటిల్‌ పెట్టి చక్కని ప్లానింగ్‌తో సినిమా పూర్తి చేశాం. చిత్రం వంద రోజులు ఆడింది. తనకు నచ్చిన కథతో తీసిన సినిమా హిట్‌ అయినందుకు మా శీనయ్య కూడా హ్యాపీగా ఫీలయ్యాడు. ఎవరికీ డబ్బు ఎగ్గొట్టకుండా అందరికీ పేమెంట్స్‌ చేశాడు.


కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్‌ మాత్రం అతనికి తప్పుడు లెక్కలు చూపించి మోసం చేశారు.. ఇక నా పారితోషికం విషయానికి వస్తే ‘నీకు ఎంత ఇమ్మంటావురా ’ అని అడిగాడు. అప్పట్లో నేను రూ. 25 లక్షలు తీసుకునేవాడిని. ‘రూ. 20 లక్షలు ఇవ్వరా’ అన్నాను. సరే నీ అకౌంట్‌లో వేస్తా’ అన్నాడు. అయితే వడ్డే నవీన్‌కు రెండున్నర లక్షలు ఎక్కువగా ఇచ్చాం. దానికి కారణం నేనే కనుక ఆ మొత్తం తగ్గించుకుని మిగిలిన మొత్తం వెయ్యమన్నా. మా శీనయ్య నవ్వాడు. ‘అవునురా.. నా వల్ల నీకు రెండున్నర లక్షలు ఎక్కువ పెట్టావు. ’ అన్నాడు. మొదట వాడు ఒప్పుకోలేదు కానీ నేనే బలవంత పెట్టాను. ఎందుకంటే డబ్బుకు మించిన అనుబంధం మా ఇద్దరిది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...