సాన్నిహిత్యానికీ ఓ దర్శకురాలు!

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

కపుల్స్‌ మధ్య చొరవ, సఖ్యతలను సన్నిహిత సన్నివేశాలతో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దర్శకులు. అయితే ఆ సన్నివేశాలు అనుబంధం గాఢతను ప్రతిబింబించేలా ఉండాలంటే నటీనటుల భావవ్యక్తీకరణ, చేతలు హృద్యంగా సాగాలి....

సాన్నిహిత్యానికీ  ఓ దర్శకురాలు!

కపుల్స్‌ మధ్య చొరవ, సఖ్యతలను సన్నిహిత సన్నివేశాలతో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దర్శకులు. అయితే ఆ సన్నివేశాలు అనుబంధం గాఢతను ప్రతిబింబించేలా ఉండాలంటే నటీనటుల భావవ్యక్తీకరణ, చేతలు హృద్యంగా సాగాలి. త్వరలో విడుదల కాబోతున్న బాలీవుడ్‌ సినిమా గెహరాయియాలో ఇలాంటి సన్నివేశాలను సమర్థవంతంగా చిత్రీకరించింది ఇంటిమసీ డైరెక్టర్‌ డార్‌ గాయి. సోషల్‌ మీడియాలో సంచలనంగా మారిన దీపికా పడుకొనె, సిద్ధాంత్‌ చతుర్వేదీల సన్నిహిత సన్నివేశాల వెనకున్న కథ ఇది.


దీపికా పడుకొనె, సిద్ధాంత్‌ చతుర్వేదీలు నటించిన గెహరాయియా... సన్నివేశ చిత్రీకరణలో ఇంటిమసీ డైరెక్టర్‌కు ప్రాధాన్యం కల్పించిన తొలి భారతీయ సినిమా అనే కథనాలు వినిపిస్తున్నాయి. మీ టూ మూవ్‌మెంట్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత, సినీ ఇండస్ట్రీలో ఈ తరహా వృత్తికి ప్రాముఖ్యం పెరిగింది. సన్నివేశాన్ని చిత్రీకరించే తీరు, అమల్లో పెట్టే విధానాలు గాడి తప్పితే,పాత్రల మధ్య ఉండే ఎంతటి గాఢమైన సాన్నిహిత్యమైనా ఎబ్బెట్టుగా, రోతగా కనిపించే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు పండాలంటే నటీనటులు, దర్శకులు ఒకర్నొకరు అర్థం చేసుకోగలగాలి. నటీనటుల మధ్య చక్కని అవగాహన, పరస్పర అంగీకారం ఉండాలి. ఇంటిమసీ డైరెక్టర్‌ అవసరం ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణలో కీలకంగా మారుతుంది. విదేశీ సినీ పరిశ్రమలో ఎంతో కాలంగా కొనసాగుతూ వస్తున్న ఈ తరహా దర్శకత్వం భారతీయ సినిమాకు కొత్త. గెహరాయియా సినిమా కోసం దర్శకుడు శకున్‌ భాత్రా, ఉక్రెయిన్‌కు చెందిన ఇంటిమసీ డైరెక్టర్‌ డార్‌ గాయికి బృందంలో చోటు కల్పించారు. 


ఎవరీ దార్‌ గాయి?

ఉక్రెయిన్‌లోని క్వివ్‌లో పుట్టి పెరిగిన డార్‌ గాయి పదేళ్ల వయసు నుంచే ఉక్రేనియన్‌ థియేటర్‌ గ్రూప్‌ ఇంకునాబులాలో సభ్యురాలు. భారతదేశంలో అడుగు పెట్టక ముందు డార్‌ గాయి, ఆసియాలో పదేళ్లు గడిపింది. గ్వాలియర్‌లోని సిండియా స్కూల్‌ ఫర్‌ బాయి్‌సలో జర్మన్‌ అండ్‌ థియేటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఈవిడ, 2018లో తన తొలి హిందీ సినిమా ‘తీన్‌ ఔర్‌ ఆధా’కూ, తర్వాత నామ్‌దేమ్‌ భావూ: ఇన్‌ సెర్చ్‌ ఆఫ్‌ సైలెన్స్‌ అనే మరాఠీ హిందీ సినిమాకు దర్శకత్వం వహించింది. తీన్‌ ఔర్‌ ఆధా చిత్రం 32 అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శనకు నోచుకోవడమే కాకుండా, 12 అవార్డులనూ గెలుచుకుంది. తర్వాత డార్‌ గాయి కొన్నేళ్లపాటు ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌గా పలు ప్రాజెక్టులకు పని చేసింది. మ్యూజిక్‌ వీడియో డైరెక్టర్‌గా కూడా ప్రతిభ కనబరిచింది.  


పని మాట్లాడాలి, పేరు కాదు

‘‘నా పూర్తి పేరు డారియా గైకలోవా. నేను జెండర్‌ న్యూట్రాలిటీకి మద్దతిస్తాను. భారతదేశంలో మహిళా దర్శకురాలిగా నాకు నేను ప్రత్యేకతను ఆపాదించుకోను. నేను కొనసాగుతున్న వృత్తిలోని ఏ దశలోనూ లింగ భేదానికి తావుండదు. సెట్‌లోకి అడుగు పెట్టిన నన్ను చూసినప్పుడు, నా బృందం ఆడా, మగా భేదాన్ని మర్చిపోతుంది. ప్రేక్షకులు సైతం ఆ తేడాకు ప్రాముఖ్యం ఇవ్వకూడదనే నేను కోరుకుంటాను. చిత్రానికి ఆడా/మగా, భారతీయులు/విదేశీయులు... ఎవరు దర్శకత్వం వహించారో తెలియవలసిన అవసరం లేదు. అందుకే నేను డారియా గైకలోవా అనే నా పేరును జెండర్‌/నేషనాలిటీలతో సంబంధం లేని తటస్థ పేరు డార్‌ గాయిగా మార్చుకున్నాను. అయితే దర్శకత్వంలో నాదైన స్త్రీముద్ర, సున్నితత్వం తప్పకుండా ఉండేలా చూసుకుంటాను. ఇక నా సినీ ప్రయాణం గురించి చెప్పాలంటే... నాటకాల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ పెరిగాను. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక, చైనా, జపాన్‌, కొరియా, ఇండియాలలోని వేర్వేరు కళా సంస్థలకు నా రెజ్యూమ్‌ పంపించాను. అయితే బోలెడన్ని చోట్ల అవకాశాలు వచ్చినా, అంతిమంగా గ్వాలియర్‌లోని సిండియా స్కూల్‌ ఆఫ్‌ గ్వాలియర్‌ నన్ను ఆకర్షించింది. అక్కడ థియేటర్‌ నాటకాలకు ఆరు నెలల పాటు దర్శకత్వం చేశాను. ఆ సమయంలో పరిచయమైన ఆనంద్‌ మహీంద్రా ఆహ్వానం మేరకు ముంబయి వచ్చి, విజ్లింగ్‌ ఉడ్స్‌లో మూడున్నరేళ్ల పాటు ఫిల్మ్‌ మేకింగ్‌ నేర్పించాను. ఇప్పుడు నా దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్లు అందరూ విజ్లింగ్‌ ఉడ్స్‌ విద్యార్థులే! తాజాగా దర్శకత్వం వహించిన గెహరాయియాలో నేను దర్శకత్వం వహించిన సన్నిహిత సన్నివేశాలు ప్రేక్షకులను నిరుత్సాహపరచవనే నమ్మకం నాకుంది.’’

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST