Advertisement

తన సోదరికి జరిగిన అన్యాయమే నయీంని అలా మార్చింది: దర్శకుడు దాము బాలాజీ

గ్యాంగ్‌‌స్టర్‌ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘నయీం డైరీస్‌’. వశిష్ట సింహా నయీం క్యారెక్టర్‌లో నటించారు. దాము బాలాజీ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందించిన ఈ చిత్రాన్ని సీఏ వరదరాజు నిర్మించారు. డిసెంబర్ 10న ఈ చిత్రం విడుదలకాబోతోంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు దాము బాలాజీ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘నయీం జీవిత కథతో రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని అనుకుని కథ రాసే బాధ్యత నాకు అప్పగించారు. ఆ తర్వాత వర్మ ఆ సినిమా చేయలేదు. చాలా రీసెర్చ్ చేసిన ఈ కథ తయారు చేసినప్పుడు ఎగ్జైట్ అయ్యి, ఈ సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుంది అనిపించింది. నా మిత్రుడైన వరదరాజుకి కథ వినిపించి అతని నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. నయీం క్యారెక్టర్‌లో నటించే వ్యక్తి అతని వ్యక్తిత్వాన్ని చూపించాలి గానీ ఇమిటేట్ చేయకూడదు అని అలోచించి వశిష్ట సింహాను సెలెక్ట్ చేసుకున్నాం. వశిష్ట లీడ్ రోల్‌లో చక్కగా నటించాడు. నయీం మంచి వాడని ఈ సినిమాలో ఎక్కడా చూపించడం లేదు. పోలీసులు, నక్సలైట్‌లు, రాజకీయ నాయకులు చేసిన తప్పులతో నయీం నేరస్తుడిగా మారాల్సి వచ్చింది. ఈ మూడు వ్యవస్థల మధ్య నయీం పొరపాట్లు చేసి దుర్మార్గుడిలా తయారయ్యాడు. 

నయీం డైరీస్‌ను మూడు పార్టులుగా చేద్దామని కొందరు సూచించారు. అలా అయితే ఎప్పటికీ తేలే వ్యవహారం కాదని ఒకే చిత్రంగా చేశాం. ఎందుకంటే నయీం జీవితాన్ని కరెక్ట్‌గా తీస్తే వెయ్యి సీన్స్ చేయవచ్చు. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య భీకరమైన పోరు జరుగుతున్న టైమ్‌లో పోలీసులు నయీంను ఇన్‌ఫార్మర్‌గా వాడుకున్నారు. అసలు నయీం అలా మారడానికి కారణం తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న తన సోదరికి జరిగిన అన్యాయంతోనే నయీం రాక్షసుడిగా మారాడు. నయీం ఎన్‌కౌంటర్‌లో పోలీసులు చెప్పిన వెర్షన్ మాత్రమే ప్రజలకు మీడియా చూపించింది. కానీ అసలు జరిగింది వేరు. నేను నయీం డైరీస్ ద్వారా ఆ తెలియని చాలా విషయాలు చూపించబోతున్నాను. ఇప్పటికే నాకు ఈ సినిమా విషయంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నయీం డైరీస్ తర్వాత మరికొన్ని నక్సలైట్ కథలు తెరకెక్కించాలని అనుకుంటున్నాను..’’ అని అన్నారు.

Advertisement