Abn logo
Jul 9 2020 @ 23:37PM

సరుకుల దుకాణం పెట్టిన దర్శకుడు

కరోనా మహమ్మారి కలిగిస్తున్న నష్టాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యుడి దగ్గర నుంచి ధనికుడు వరకూ ఎవరినీ వదలడం లేదు. ఊహించని దెబ్బలు తగులుతుండడంతో ప్రతి ఒక్కరూ బెంబెలెత్తుతున్నారు. తమిళనాడులో కరోనా దెబ్బకు ఓ దర్శకుడు సినిమాలు మానేసి సరుకుల దుకాణం పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఆ దర్శకుడి పేరు ఆనంద్‌. పదేళ్ల నుంచీ చిత్రపరిశ్రమలో ఉంటున్నారు. నాలుగు నెలల నుంచీ కొవిడ్‌ -19 కారణంగా సినిమా పరిశ్రమ స్థంభించిపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి వేరే మార్గం లేక సరుకుల దుకాణం పెట్టారు ఆనంద్‌.


తన మిత్రుడి దగ్గర బిల్డింగ్‌ అద్దెకు తీసుకొని గ్రాసరీ స్టోర్స్‌ స్టార్ట్‌ చేశారు. సరుకుల దుకాణమే పెట్టడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే ‘ప్రస్తుతం ఎక్కడ చూసినా లాక్‌డౌనే. సరుకుల దుకాణాలు మాత్రమే తెరవడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. అందుకే గ్రాసరీ స్టోర్స్‌ పెట్టా’ అని ఆ దర్శకుడు సమాధానం ఇచ్చారు. చిత్రపరిశ్రమకు తిరిగి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం ఉందనీ, అప్పటివరకూ సరుకుల దుకాణం నడుపుతాననీ ఆనంద్‌ చెప్పారు. తక్కువ బడ్జెట్‌లో సినిమాలు తీసే దర్శకుడిగా ఆనంద్‌కు పేరుంది. ఆయన తాజా చిత్రం ‘తున్నింతు సెయ్‌’ టాకీ పార్ట్‌ పూర్తయింది. ఇంకో రెండు పాటలు మాత్రం చిత్రీకరించాలి. మధ్యలో ఈ ఉపద్రవం వచ్చిందని వాపోతున్నారు ఆనంద్‌. 

Advertisement
Advertisement
Advertisement