8వ తరగతి వరకు ఇంటి దగ్గరే విద్య

ABN , First Publish Date - 2020-09-12T08:51:38+05:30 IST

ఒకటి నుంచి 8వ తరగతి పిల్లలను పాఠశాలలకు పిలవకూడదని, ఏదైనా మార్గదర్శకత్వం వారికి ఇవ్వాలంటే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను మాత్రమే పాఠశాలలకు

8వ తరగతి వరకు ఇంటి దగ్గరే విద్య

  • వారి తల్లిదండ్రులు, సంరక్షకులనే స్కూల్‌కు పిలవాలి
  • 21న హైస్కూల్‌ టీచర్లందరూ హాజరు కావాలి
  • 22 నుంచి అక్టోబరు 4 వరకూ 50% మంది రావాలి
  • మార్గదర్శకాలు జారీచేసిన పాఠశాల విద్యా కమిషనర్‌


అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ఒకటి నుంచి 8వ తరగతి పిల్లలను పాఠశాలలకు పిలవకూడదని, ఏదైనా మార్గదర్శకత్వం వారికి ఇవ్వాలంటే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను మాత్రమే పాఠశాలలకు పిలవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21న హైస్కూల్‌ టీచర్లు అందరూ హాజరు కావాలని, 22 నుంచి అక్టోబరు 4 వరకు 50 శాతం మంది హాజరు కావాలని ఆదేశించారు. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులు మాత్రం ఇంటిదగ్గరే విద్యనభ్యసించాలని, 9వ తరగతి విద్యార్థులకు 8వ తరగతి పాఠా లు, 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి పాఠాలు ఆన్‌లైన్‌ ద్వారా రివిజన్‌ చేయించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఇంతకుముందు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించి జారీచేసిన సూచనలు కొనసాగించాలన్నారు. గతంలో ఇచ్చిన ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ షెడ్యూల్‌ ఈ నెల 9 నాటికి ముగిసిందన్నారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు ఈ నెల 5న పాఠశాలలు తెరవనందున వల్ల అక్టోబరు 5 వరకు ప్రత్యామ్నాయ కేలండర్‌ షెడ్యూల్‌, విద్యావారధి, విద్యామృతం కొనసాగుతాయని పేర్కొన్నారు.


1 నుంచి 8 తరగతుల కోసం తయారు చేసిన షీట్లను అభ్యాస యాప్‌లో ఉంచినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు వాటిని డౌన్‌లోడ్‌ చేసి, విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వాలని పేర్కొన్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు మార్గదర్శకత్వం తీసుకోవడానికి స్వచ్ఛంధ ప్రాతిపదికన మాత్రమే కట్టడి జోన్లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను సందర్శించడానికి అనుమతించాలన్నారు. తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి ఉపాధ్యాయులు రాతపూర్వక సమ్మతి తీసుకుని 21 నుంచి అనుమతించాలని స్పష్టం చేశారు. విద్యార్థులందరినీ హైటెక్‌, లోటెక్‌, నోటెక్‌ వర్గాలుగా వర్గీకరించి వారికి 2020-21 విద్యా సంవత్సరానికి విద్యా కార్యకలాపాలు  ప్రారంభించాలన్నారు.

Updated Date - 2020-09-12T08:51:38+05:30 IST