పార్టీకి గుంపుతో వచ్చిన ప్రేయసి... బిల్లు చూసి గోవిందా అంటూ ప్రియుడు పరార్!

ABN , First Publish Date - 2020-10-22T12:33:17+05:30 IST

ప్రేమికులు సరదాగా డేటింగ్‌కు వెళ్లడం సాధారణమే. అయితే చైనాకు చెందిన ఒక యువకుడు తన ప్రియురాలిని పార్టీకి పిలిచిన...

పార్టీకి గుంపుతో వచ్చిన ప్రేయసి... బిల్లు చూసి గోవిందా అంటూ ప్రియుడు పరార్!

బీజింగ్: ప్రేమికులు సరదాగా డేటింగ్‌కు వెళ్లడం సాధారణమే. అయితే చైనాకు చెందిన ఒక యువకుడు తన ప్రియురాలిని పార్టీకి పిలిచిన పాపానికి అతనికి నెత్తిన పిడుగు పడినంత పనయ్యింది. ఆ యువతి ఏకంగా తన ఇరవైముగ్గురు స్నేహితులు, బంధువులతో పాటు తన ప్రియుడు పిలిచిన రెస్టారెంట్‌కు వచ్చింది. వారంతా డిన్నర్ కానిచ్చాక వచ్చిన బిల్లు చూసి ఠారెత్తిపోయిన ఆ ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. చైనాలోని జోజియాంగ్  ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకున్నారు. 


వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడ్డాక బ్లయిండ్ డేట్ కోసం ప్లాన్ చేసుకున్నారు. ఇందుకోసం ఒక రెస్టారెంట్ ఎన్నుకున్నారు. అక్కడే వారిద్దరూ తొలిసారిగా ముఖాముఖీగా చూసుకోవాలనుకున్నారు. ఆ యువకుడు అనుకున్న సమయానికే రెస్టారెంట్‌కు చేరుకుని, ఆమె రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూడసాగాడు. ఇంతలో అతని ప్రేయసి తన ఇరవైముగ్గురు స్నేహితులు, బంధువులను వెంటేసుకుని రెస్టారెంట్‌కు వచ్చింది. అందరూ అనందంగా కలుసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భారీగా విందు లాగించారు. ఇంతలో వెయిటర్ బిల్లు తీసుకువచ్చి, ఆ యువకునికి అందజేశాడు. ఆ యువతితో పాటు ఆమె బ్యాచ్ అంతా అంతా తిన్న ఆహారానికి సుమారు 19800 యునాన్లు (మన కరెన్సీలో రూ.2 లక్షల 17 వేలు)  బిల్లు వచ్చింది. 


దానిని చూసిన ఆ యువకునికి కళ్లు తిరగినంత పనయ్యింది. అంతే చుట్టుపక్కల ఉన్న ఎవరినీ పట్టించుకోకుండా చెంగున దూకుతూ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సందర్భంగా ఆ యువతి మాట్లాడుతూ తాను... తన ప్రియుడు తొలిసారిగా కలుసుకునేందుకు బ్లయిండ్ డేట్‌కు ప్లాన్ చేసుకున్నామని, తాను ఇరవైముగ్గురిని వెంటేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లానని, అయితే తామంతా తిన్న ఆహారానికి ఆ యువకుడు బిల్లు కట్టలేక అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపింది. ఫలితంగా తామే ఆ బిల్లును చెల్లించి, రెస్టారెంట్ నుంచి ఎలాగోలా బయటపడ్డామని పేర్కొంది. ఈ ఘటన జరిగిన తరువాత ఆ యువతి... ఆ యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువకుడు చేసేదేమీ లేక తన స్థాయికి తగినట్టు కేవలం రెండు టేబుళ్ల బిల్లు చెల్లించేందుకు ముందుకువచ్చాడు.  


Updated Date - 2020-10-22T12:33:17+05:30 IST