DK Dropped the Simple Catch: సింపుల్ క్యాచ్‌ను జారవిడిచిన దినేష్ కార్తీక్.. ఆ తర్వాత ఎంత పని జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-29T00:43:20+05:30 IST

'Catches win matches' అని క్రికెట్‌లో నానుడి ఉంది. ఒక్క క్యాచ్‌ను జారవిడిచినా ఆ లైఫ్ వచ్చిన బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌ తలరాతనే మార్చే..

DK Dropped the Simple Catch: సింపుల్ క్యాచ్‌ను జారవిడిచిన దినేష్ కార్తీక్.. ఆ తర్వాత ఎంత పని జరిగిందంటే..

'Catches win matches' అని క్రికెట్‌లో నానుడి ఉంది. ఒక్క క్యాచ్‌ను జారవిడిచినా ఆ లైఫ్ వచ్చిన బ్యాట్స్‌మెన్ మ్యాచ్‌ తలరాతనే మార్చే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో అదే జరిగింది. బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడిన రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ బట్లర్ 11వ ఓవర్‌లో తొలి బంతికే ఔట్ అయి పెవిలియన్‌కు వెళ్లేవాడు. ఆ సమయానికి అతని వ్యక్తిగత స్కోర్ 66 పరుగులు. హర్షల్ పటేల్ బౌలింగ్ చేసిన 11వ ఓవర్ తొలి బంతికి బట్లర్ కీపర్ క్యాచ్‌గా చిక్కే పరిస్థితి వచ్చింది. కానీ.. ఎంతో అనుభవం ఉన్న వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ క్యాచ్‌గా చిక్కిన ఆ బంతిని జారవిడిచాడు. చాలా సింపుల్‌గా చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ను డీకే వదిలేయడంతో ఆ తర్వాత బట్లర్ రెచ్చిపోయి ఆడాడు. 60 బంతుల్లో 106 పరుగులు చేయడమే కాకుండా నాటౌట్‌గా నిలిచి రాజస్తాన్ రాయల్స్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. డీకే ఆ క్యాచ్ పట్టుకోలేకపోవడం బెంగళూరు ఫ్యాన్స్‌ను విస్మయానికి గురిచేసింది. బౌలర్ హర్షల్ పటేల్ కూడా డీకే వంక నివ్వెరపోయి చూశాడు. బట్లర్ క్యాచ్‌ను దినేష్ కార్తీక్ మిస్ చేసిన సమయానికి RR స్కోర్ 10 ఓవర్లకు గానూ ఒక వికెట్ నష్టానికి 103 పరుగులుగా ఉంది.



బట్లర్ వికెట్ పడితే ఏదో అద్భుతం జరుగుతుందని కాదు గానీ ఐపీఎల్‌లో ఏదైనా జరగొచ్చనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. దినేష్ కార్తీక్ క్యాచ్ మిస్ చేయకుండా బట్లర్ వికెట్ పడి ఉంటే ఆ తర్వాత ఆర్‌ఆర్ బ్యాట్స్‌మెన్స్ తక్కువ స్కోర్‌కే వికెట్లు కోల్పోయే వారేమో. ఎవరికి తెలుసు. ఎవరు ఔనన్నా, కాదన్నా RR జట్టుకు కొండంత అండ బట్లరే. ఈ సీజన్‌లో RR గెలిచిన చాలా మ్యాచుల్లో అది రుజువైంది. బట్లర్ ఔట్ అయి ఉంటే ఆశలు సన్నగిల్లిన బెంగళూరు జట్టులో గెలవగలమేమోనన్న నమ్మకం చిగురించేది. ఇదిలా ఉండగా.. 2008లో ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నైతో ఫైనల్ ఆడి గెలిచి కప్పు కొట్టిన రాజస్తాన్ రాయల్స్ మళ్లీ ఇన్నేళ్లకు ఫైనల్‌కు వెళ్లింది. మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడి సంజూ సేన కప్పు కొడుతుందో లేదో చూడాలి.

Updated Date - 2022-05-29T00:43:20+05:30 IST