Abn logo
Dec 27 2020 @ 13:20PM

ఆహ్లాదానికి..‘దిండి యాత్ర’

ఎటు చూస్తే అటు ప్రకృతి మాత్రమే ఉండాలి. కనుచూపు మేరా పచ్చదనమే పరుచుకోవాలి. బయటి ప్రపంచాన్ని మరిచిపోవాలి. నది ఒడ్డున కూర్చుని... సూర్యోదయాన్నో, సూర్యాస్త మయాన్నో చూస్తూ మైమరిచి పోవాలి! అలాంటి ప్రదేశం ఎక్కడైనా ఉంటే చెప్పండి ప్లీజ్‌?


బహుశా ఈ ప్రశ్నకు మీరు చెప్పే మొదటి సమాధానం... కేరళ! ఇంకాస్త ముందుకెళితే శ్రీలంక. ఇంకా దూరంగా వెళ్లగిలిగితే... మాల్దీవ్స్‌, మారిషస్‌, మలేషియా! ఇవన్నీ పక్కన పెట్టండి. అంతంత దూరం వెళ్లకుండానే, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న దిండి యాత్ర చేయండి. ప్రకృతిలో పరవశం, ఆధ్యాత్మిక పరిమళం రెండూ సొంతమవుతాయి.

తూర్పు గోదావరి జిల్లాకు కట్టిన ఆకుపచ్చ కోక... కోనసీమ! ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది నింగిలోకి తొంగి చూసే కొబ్బరి చెట్లు! నేలంతా పరుచుకునే పచ్చని వరి చేలు! ‘తడిపించే’ వానాకాలంలో, జడిపించే ఎండాకాలంలో కాకుండా... కోనసీమను ఆస్వాదించేందుకు సరైన సమయం చల్లగా వణికించే శీతాకాలమే! ఈ కాలపు ఉదయాల్లో కొబ్బరి చెట్లను కౌగిలించుకున్న మంచును చూసే ప్రతి హృదయం... ‘మంచు కురిసే వేళలో మల్లె విరిసేనెందుకో’ అనే కూనిరాగం తీయడం ఖాయం. కరోనా భయంతో అటూఇటూ కదల్లేక... ఎటూ వెళ్లలేక పోతున్నామే అని వగచే వారికి కోనసీమలోని ‘దిండి’ సరైన గమ్యస్థానం.

‘సరోవర’ తీరాన...

దిండి... విజయవాడ నుంచి కారులో నాలుగు గంటల ప్రయాణం. రాజమండ్రి నుంచి 90 కిలోమీటర్లు. వెళ్లడానికి ఇబ్బంది లేదు! మరి... బస ఎక్కడ? దిండిలో రెండు మూడు రిసార్టులున్నాయి. అయితే... సౌకర్యం, ఆహ్లాదంతోపాటు కాస్త విలాసం కూడా కలిసినదే ఇక్కడి ఆర్వీఆర్‌ సరోవర్‌ పోర్టికో రిసార్ట్‌. వశిష్ట గోదావరి ఒడ్డున ఉందీ రిసార్ట్‌. పేరుకు తగినట్లే ఈ రిసార్ట్‌లో రెండు కృత్రిమ సరస్సులున్నాయి. అందులో ఒకటి రిసెప్షన్‌లో అడుగు పెట్టక ముందే కనిపిస్తుంది. అందులో... వెడల్పాటి ‘విక్టోరియా అమెజానికా’ ఆకులు విస్తరించిన కొలను మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అమెజాన్‌ జలాల్లో ఒక్కో ఆకు ఏడెనిమిది అడుగుల వ్యాసం వరకు పెరుగుతుందట! సరోవర్‌ పోర్టికో రిసార్ట్‌లో నాలుగు అడుగుల వెడల్పున్న ఆమెజానికా ఆకులున్నాయి. ఇక... బస చేసిన గది పోర్టికో లేదా బాల్కనీలో కూర్చుని చూస్తూ సేద తీరేలా మరో సరస్సును ఏర్పాటు చేశారు. ఇందులో పరుచుకున్న కలువ, తామర పూలు కనువిందు చేస్తాయి. వాటిని అలా చూస్తూ ఉండొచ్చంతే! కొబ్బరిచెట్లతోపాటు రకరకాల మొక్కల మధ్య ఏర్పాటు చేసిన వాకింగ్‌ ట్రాక్‌లో నడుస్తుంటే... అచ్చం ఒక ఆకుపచ్చ లోకంలో విహరిస్తున్నట్లుంటుంది. రిసార్ట్‌లోకి అడుగు పెట్టాక మోటారు వాహనాలు కనపడటం సంగతి పక్కనపెడితే... హారన్‌లు కూడా వినిపించవు. ‘అదృష్టవశాత్తూ’ సెల్‌ఫోన్‌ మరిచిపోయి వస్తే... అదంతా ప్రశాంతతకు నిలయమైన మరో ప్రపంచమే! ఆధునిక వసతులతోపాటు... మన పాత సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేసేందుకు రిసార్ట్‌ నిర్వాహకులు చక్కటి ప్రయత్నం చేశారు. వాలు కుర్చీ, వసారాలు, మండువా లోగిళ్లతోపాటు ‘చందమామ’ కథల్లో చదివిన భోషాణాలనూ ఇక్కడ చూడవచ్చు. బాల్కనీల్లో ఏర్పాటు చేసిన కుర్చీలు రెండు చేతులతో కదల్చలేనంత బరువున్నాయి. అవి... ఈత కలపతో తయారు చేసినవని తెలుసుకుని ఆశ్చర్యపోతాం. రిసార్టుకు సిసలైన నిర్వచనంలా... ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండేలా ‘సరోవర్‌’ను తీర్చిదిద్దారు. ఇక్కడ రెండు రోజుల విశ్రాంతి... రెండు నెలలకు సరిపడా మానసిక శక్తిని ఇస్తుందనడంలో అతిశయోక్తిలేదు. దిండిలో కేరళను మరిపించే ‘హౌస్‌బోట్‌’లు కూడా ఉన్నాయి కానీ... కరోనా కదా! ప్రస్తుతం అవి బంద్‌!

ఏమేం చూడాలి!

అంత దూరం వెళ్లాక... రిసార్ట్‌కు మాత్రమే పరిమితమైతే ఎలా? దిండి చుట్టూ చూడ్డానికి చాలా విశేషాలున్నాయి. అందులో ముఖ్యమైనది అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం! మొన్నామధ్య ఇక్కడి రథమే అగ్నికి ఆహుతయ్యింది. ఇప్పుడు కొత్త రథం నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇక్కడికి సమీపంలోనే... గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇంకా... ఆధ్యాత్మిక ఆసక్తిని బట్టి పాలకొల్లులో పంచారామాల్లో ఒకటైన క్షీరరామలింగేశ్వరుడిని, అయినవిల్లిలో పురాతనమైన వినాయకుడిని దర్శించుకోవచ్చు. ఇంకా... కడలిలో కపోతేశ్వరస్వామి ఆలయం, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, ర్యాలీలో జగన్మోహినీ కేశవ స్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. ఆసక్తి, అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ ఆలయాలను సందర్శించవచ్చు. ఆహ్లాదం, ఆధ్యాత్మికం సరే! మరి... ‘లోకల్‌ ఫ్లేవర్‌’ సంగతేమిటని అడిగేవారూ ఉంటారు! వారికోసమూ చాలానే ఉన్నాయి. అంబాజీపేట పొట్టిక్కలు (ఇండ్లీలాంటివి), ఆత్రేయపురం పూతరేకులు, రాజోలులో కారంపొడి-చకోడీ, రాజోలులో గోధుమ హల్వా, నాగుళ్లంకలో సిట్రాసోడా... ఇలా ఊరికో ప్రత్యేకత! ‘సీ ఫుడ్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఫుడీస్‌’కు పండగే పండగ! ఇంకెందుకాలస్యం... ఆహ్లాదం, ఆనందం, ఆధ్యాత్మికం, ఆహారం కోసం చేసేయండి ‘దిండి యాత్ర’!

- ఉమా సురేశ్‌