ఇల్లంతా స్వర్ణాలు..

ABN , First Publish Date - 2021-06-24T08:28:39+05:30 IST

దిల్‌రాజ్‌ కౌర్‌..ఒకప్పుడు దేశ ఉత్తమ పారాషూటర్‌. పదులకొద్దీ స్వర్ణ పతకాలు సాధించిన ఆమె..

ఇల్లంతా స్వర్ణాలు..

జీవనానికి స్నాక్స్‌ అమ్మకాలు!

పారాషూటర్‌ దీనావస్థ


డెహ్రాడూన్‌: దిల్‌రాజ్‌ కౌర్‌..ఒకప్పుడు దేశ ఉత్తమ పారాషూటర్‌. పదులకొద్దీ స్వర్ణ పతకాలు సాధించిన ఆమె.. ప్రస్తుతం జీవనం వెళ్లదీసేందుకు డెహ్రడూన్‌లోని ఓ పార్కువద్ద చిప్స్‌, స్నాక్స్‌ అమ్ముకుంటోంది. 2004లో పారాషూటింగ్‌లో అడుగుపెట్టిన కౌర్‌ అప్పట్లో అంతర్జాతీయస్థాయికి ఎదిగిన తొలి షూటర్‌గా ఖ్యాతి గడించింది. కెరీర్‌లో 28 స్వర్ణ, 8 రజత, 3 కాంస్య పతకాలు గెలిచింది. జాతీయస్థాయిలో అద్భుత పిస్టల్‌ షూటర్‌గా పేరు తెచ్చుకున్న కౌర్‌ అంతర్జాతీయ ఈవెంట్లలోనూ తలపడింది. కానీ ఆమెకు ప్రభుత్వోద్యోగం లభించలేదు. జీవించేందుకు వేరే మార్గంలేక స్నాక్స్‌ అమ్మాల్సిన దుస్థితి ఏర్పడింది. ‘సుదీర్ఘ అనారోగ్యంతో తండ్రి మరణించాడు. ఇటీవల నా సోదరుడు కూడా మృతి చెందాడు. వారి చికిత్సకు పెద్ద మొత్తం ఖర్చయింది.


అందుకు బ్యాంకు రుణం తీసుకున్నాం. తల్లి పింఛనుతో లోన్‌ కడుతున్నాం’ అని 34 ఏళ్ల కౌర్‌ తెలిపింది. ప్రతినెలా 20వ తేదీ తర్వాత చేతిలో చిల్లిగవ్వలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని వెల్లడించింది. ‘నా అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కోరా. కానీ ఎలాంటి స్పందనా రాలేదు’ అని ఆమె వాపోయింది. ‘దేశానికి పతకాలు సాధించినప్పుడు మా ఇంట్లో వెలుగులు నిండివుండొచ్చు. దేశానికి నేను పతకాలు అందించినా నా అవసరానికి మాత్రం ఎవరూ స్పందించడంలేదు’ అని దిల్‌రాజ్‌ ఆవేదన చెందింది. 

Updated Date - 2021-06-24T08:28:39+05:30 IST