దిల్‌దార్‌ దోశ

ABN , First Publish Date - 2021-01-23T05:40:08+05:30 IST

కారం దోశ.. ఆనియన్‌ దోశ... రవ్వ దోశ... ఎప్పుడూ ఈ రుచులేనా! పనసపండు దోశ, ఓట్స్‌ - కొబ్బరి దోశ, పాలకూర - కొత్తిమీర దోశ, బక్వీట్‌ దోశ, సోయా దోశ.. ఇలా వెరైటీ దోశలనూ ఓసారి ట్రై చేయండి.

దిల్‌దార్‌ దోశ

కారం దోశ.. ఆనియన్‌ దోశ... రవ్వ దోశ... ఎప్పుడూ ఈ రుచులేనా! 

పనసపండు దోశ, ఓట్స్‌ - కొబ్బరి దోశ, పాలకూర - కొత్తిమీర దోశ, 

బక్వీట్‌ దోశ, సోయా దోశ.. ఇలా వెరైటీ దోశలనూ ఓసారి ట్రై చేయండి. 

ఇవి రుచితో మీ దిల్‌ దోచుకుంటాయి.



ఓట్స్‌ - కొబ్బరి దోశ

కావలసినవి 

గోధుమ పిండి - అరకప్పు, బియ్యప్పిండి - అరకప్పు, ఓట్స్‌ పిండి - అరకప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం - టేస్ట్‌ కోసం ఇష్టాన్ని బట్టి, నూనె - సరిపడా, పచ్చిమిర్చి - ఒకటి, అల్లం - చిన్నముక్క, కరివేపాకు - కొద్దిగా, ఇంగువ - చిటికెడు, మిరియాల పొడి - అర టీస్పూన్‌.


తయారీ విధానం

ఒక పాత్రలో గోధుమపిండి తీసుకుని అందులో బియ్యప్పిండి, ఓట్స్‌ పిండి, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఇంగువ, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి, సరిపడా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మిశ్రమం మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి. 

స్టవ్‌ పై పెనం పెట్టి దోశ పోసుకోవాలి. నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ దోశలు రుచిగా ఉండటమే కాకుండా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. 


బక్వీట్‌ దోశ

కావలసినవి 

బక్వీట్‌ (గోధుమల్లో ఒక రకం) పిండి - రెండు కప్పులు, నల్ల మినుములు - అరకప్పు, బియ్యప్పిండి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, పచ్చిమిర్చి - నాలుగు, కొత్తిమీర - ఒక కట్ట.


తయారీ విధానం

ముందుగా నల్లమినుములను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నూనె వేయాలి. కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి చిటపట అన్న తరువాత పక్కన పెట్టుకోవాలి.

ఒక పాత్రలో బక్వీట్‌ పిండి తీసుకుని అందులో మినుముల పొడి, బియ్యప్పిండి, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలపాలి.

తరువాత వేగించిన ఆవాలు వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. మిశ్రమం మరీ చిక్కగా కాకుండా, అటు పలుచగా కాకుండా చూసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె రాసి దోశ పోసుకోవాలి. నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి.

వేడి వేడి దోశలను చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.


పనసపండు దోశ

కావలసినవి 

పనసపండు ముక్కలు - ఒక కప్పు, నూకలు - రెండు కప్పులు, పెరుగు - అరకప్పు, కొబ్బరితురుము - నాలుగు టేబుల్‌స్పూన్లు, బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత.


తయారీ విధానం

నానబెట్టిన నూకలను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పనసపండు ముక్కలను ఒక కప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి.  ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌ పైనుంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. 

మరొక పాత్రలో పావు కప్పు నీళ్లు పోసి బెల్లం వేయాలి. స్టవ్‌పై పెట్టి కొద్దినిమిషాలు చిన్న మంటపై బెల్లం కరిగించాలి.

తరువాత ఒక పాత్రలో అర కప్పు నీళ్లు తీసుకుని అందులో పెరుగు, నూకల పొడి వేసి కలుపుకోవాలి. 

ఇప్పుడు పనసపండు పేస్టు, బెల్లం పానకం, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలియబెట్టాలి. 

స్టవ్‌ పై పెనం పెట్టి కాస్త వేడి అయ్యాక దోశ పోసుకోవాలి. పలుచగా కాకుండా కాస్త మందంగా ఉండేలా చూసుకుంటే దోశలు బాగా వస్తాయి. కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చట్నీతో తింటే ఈ దోశలు రుచికరంగా ఉంటాయి.


సోయా దోశ

కావలసినవి 

ఇడ్లీ రైస్‌ - రెండు కప్పులు, సోయా బీన్స్‌ - ఒక కప్పు, మినప్పప్పు - ఒకటిన్నర కప్పు, మెంతులు - ఒక టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నెయ్యి - కొద్దిగా.


తయారీ విధానం

ముందుగా సోయా బీన్స్‌ను ఒక పాత్రలో నానబెట్టుకోవాలి. మరొక పాత్రలో మినప్పప్పు, మెంతులు, సెనగపప్పు నానబెట్టాలి. ఇంకో పాత్రలో ఇడ్లీ రైస్‌ నాన బెట్టాలి.

బాగా నానిన మినప్పప్పు, మెంతులను మిక్సీలో వేసి మెత్తగా పట్టుకొని ఒక పాత్రలోకి తీసుకోవాలి.

తరువాత బియ్యం గ్రైండ్‌ చేసుకుని పాత్రలోకి తీసుకోవాలి. అలాగే సోయాబీన్స్‌ను మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి తయారు చేసి పెట్టుకుని, ఉదయం దోశలు పోసుకుంటే బాగా వస్తాయి.

స్టవ్‌పై పెనం పెట్టి దోశలు పోసి నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి. దోశలు పలుచగా కాకుండా మందంగా పోసుకోవాలి. రెండు వైపులా కాల్చుకుని సర్వ్‌ చేసుకోవాలి. ఈ దోశ పిండి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటుంది.


పాలకూర - కొత్తిమీర దోశ

కావలసినవి

పాలకూర - ఒక కప్పు(సన్నగా తరిగినది), కొత్తిమీర - పావుకప్పు(తరిగినది), ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, గోధుమపిండి - ఒక కప్పు, ఓట్స్‌ - అరకప్పు, రవ్వ - అరకప్పు, మిరియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, నూనె - కొద్దిగా, ఉప్పు - తగినంత.


తయారీ విధానం

ముందుగా పాలకూర, కొత్తిమీరను మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా చేసుకోవాలి.

ఒక పాత్రలో గోధుమపిండి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. తరువాత అందులో పాలకూర, కొత్తిమీర పేస్టు వేయాలి. ఉల్లిపాయలు, ఓట్స్‌, పచ్చిమిర్చి, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు  కలుపుకోవచ్చు.

ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి దోశలు పోసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుంటూ కాల్చుకోవాలి.

కొబ్బరి చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-01-23T05:40:08+05:30 IST