దిగులుపిట్ట పలవరింత

ABN , First Publish Date - 2020-03-09T07:35:13+05:30 IST

నడిజామురాతిరి దాటినంక మేల్కపడ్తది. ఎంతకూ పొద్దు పొడ్వది. ఇదీ అని చెప్పలేనితనం. మానుతున్న గాయాలన్నీ ముందేసుకుని కూసుంటం. ఒగమానంగ ఒడ్వని తీపులు దీత్తాంటది పానం. ఏం జెప్పుదు?

దిగులుపిట్ట పలవరింత

నడిజామురాతిరి దాటినంక మేల్కపడ్తది. ఎంతకూ పొద్దు పొడ్వది. ఇదీ అని చెప్పలేనితనం. మానుతున్న గాయాలన్నీ ముందేసుకుని కూసుంటం. ఒగమానంగ ఒడ్వని తీపులు దీత్తాంటది పానం. ఏం జెప్పుదు?


బుక్కనిండ వడ్లగింజలు. ఒక్కొక్కటే బొండిగ దిగుతానట్టు, గడియగడియకు సచ్చిపుడుతానట్టు గుండెకాయ గొంతికెల కడ్డంపడ్తది. పెయ్యంతా బాలెంత నొప్పులు. అర్వసాకిరి జేశి కాళ్లు కడుపుల దాసుకుని పన్న అవ్వ తరీక శెప్పవశంగాని బాధ. దేశమెటుబోతె నీకెందుకురా అయ్యా! మల్సుకపండెతందుకు ఇప్పటికైతె గింత జాగున్నదని దిగులుపిట్ట పొడుత్తనే వుంటది.


ఇచ్చుకపోయిన నిద్ర కరుత్తాంటది. నెత్తురోడే జాగలల్ల ఏడ్పందుకున్న పసికందుల మొఖాలు కంటిగల్మ ముందు పానసరంబట్టినట్టుంటే ఎవనికి బుట్టిన నిద్ర బాపు! వాడేమో చిచ్చుపెట్టందే నిద్రపోడు. మనకేమో మంట లారేదన్క కన్నంటుకోదు. నడ్మ గాలివాలుకు కొట్టుక పోయే అమాయకపు తాలుజనం.


జహాపనా.. సునో మేరా ఆవాజ్‌! జాదూ.. బంద్‌ కరో సబ్‌! యే దేశ్‌ సబ్‌ కా హే! కంటిరెప్పలు కాల్సుకునే ఎడ్డిర్కం జూశి ప్రపంచమంతా ముక్కుమీద ఏలేసుకుంటాంది. బువ్వపెట్టే తెలివిలేకనే కొట్లాట పెట్టినవు కదా! గెల్శినోనికే బుక్క దొర్కుతదంటే నీ తెరువెవడు రాడనే కదా! 


బిడ్డా.. ఏదైతే అదైంది. మళ్లీ బాంచెగాళ్లమైతే కావొద్దు. ఈ మట్టిల్నే పుట్టినం. ఈన్నే పెరిగినం. ఎవడు ఎట్టెట్ట పొమ్మంటడో సూద్దం. ఈ షెత్త గీ మట్టిలో కాలి బూడిదవ్వాల్సిందే! 


మట్టికి కులమతాల అంటు ముట్టులేం లేవు. పాయిరంగ తనలో కలుపుకుంటది. ముర్కజూత్తె మట్టిదంతా పురిటి వాసనే!

బండారి రాజ్‌ కుమార్‌

99599 14956


Updated Date - 2020-03-09T07:35:13+05:30 IST