ర్యాలీల కోసం సువిధ యాప్‌లో రిజిస్ట్రేషన్ : ఈసీ

ABN , First Publish Date - 2022-01-09T00:54:29+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారం..

ర్యాలీల కోసం సువిధ యాప్‌లో రిజిస్ట్రేషన్ : ఈసీ

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకునేందుకు వీలుగా 'సువిధా యాప్'ను భారత ఎన్నికల కమిషన్ శనివారంనాడు ప్రారంభించింది. జనవరి 15 వరకు రోడ్డు షోలు, పాదయాత్రలు నిర్వహించేందుకు అనుమతి లేదని, పార్టీలు వర్చువల్ విధానంలో ప్రచారం చేసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించిన నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచార నిమిత్తం 'సువిధా యాప్' ద్వారా డిజిటల్ రిజిస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా పార్టీలు తాము ర్యాలీలు నిర్వహించాలనుకున్న గ్రౌండ్స్‌ను బుక్ చేసుకుని వర్చువల్ విధానంలో నిర్వహించుకోవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు. వ్యక్తిగతంగా అధికార యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోవడానికి బదులు ఈ యాప్‌ ద్వారా రిజిస్టేషన్ చేసుకోవచ్చని చెప్పారు.


కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 15 తర్వాత పరిస్థితిని సమీక్షించి బహిరంగ ర్యాలీలకు అనుమతించాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది. సువిధా యాప్ ద్వారా ర్యాలీలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఎంతమంది పబ్లిక్ ప్రొషెషన్‌లో పాల్గొనవచ్చనేది సంబంధిత రాష్ట్రాలకు చెందిన స్టేట్ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (ఎస్‌డీఎంఏ) జారీ చేసే గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉంటుంది. కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఎస్‌డీఎంఏల ఆదేశాలకు అనుగుణంగానే ఔట్ డోర్, ఇన్‌డోర్ ర్యాలీలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ మీటింగ్‌‌లకు హాజరయ్యే వారి కోసం సంబంధిత పార్టీలు మాస్క్‌లు, శానిటైజర్లు అందించాల్సి ఉంటుంది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి.

Updated Date - 2022-01-09T00:54:29+05:30 IST