ఇక మున్సిపాలిటీల్లో ఇళ్లకు డిజిటల్‌ నంబర్లు

ABN , First Publish Date - 2022-05-24T05:27:42+05:30 IST

: ఇంటి చిరునామా కనుగొనడానికి బల్దియా డోర్‌ నంబర్లను కేటాయిస్తుంది.

ఇక మున్సిపాలిటీల్లో  ఇళ్లకు డిజిటల్‌ నంబర్లు

 మెదక్‌, మే 23: ఇంటి చిరునామా కనుగొనడానికి బల్దియా డోర్‌ నంబర్లను కేటాయిస్తుంది. అయితే ఇక నుంచి ప్రతి ఇంటికీ ఓ డిజిటల్‌ నంబర్‌ను కేటాయించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 16న హైదరాబాద్‌లో మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులతో రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సమావేశమైన సందర్భంగా మున్సిపాలిటీల్లో డిజిటల్‌ డోర్‌ నంబర్లను ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో పట్టణాల్లో ఇళ్ల గుర్తింపు సులువు కానున్నది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం మెదక్‌ జిల్లాలో రామాయంపేట, తూప్రాన్‌, నర్సాపూర్‌ మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. సమీప గ్రామాలు కూడా మున్సిపాలిటీల్లో విలీనం కావడం వల్ల ఇంటి నంబర్ల గుర్తింపు కాస్త కష్టం అవుతోంది. మెదక్‌ పురపాలక సంఘం పరిధిలో 32 వార్డుల్లో 11,500 నివాసాలున్నాయి. కొత్తగా ఏర్పడ్డ నర్సాపూర్‌ మున్సిపాలిటీలో 15 వార్డుల్లో 4,727 గృహాలు, రామాయంపేటలో 20 వార్డుల్లో 5,120 ఇళ్లు, తూప్రాన్‌లో 16 వార్డుల్లో  6,006 ఇళ్లు ఉన్నాయి. సహజంగా నగరాలు, పట్టణాల్లో ఇంటి చిరునామాను కనుక్కోవడానికి తిప్పలు తప్పవు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇళ్లకు డిజిటల్‌ నంబర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలోనూ మున్సిపాలిటీల్లో డిజిటల్‌ డోర్‌ నంబర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ ఈ-మాస్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో ప్రారంభమైనా సాంకేతిక కారణాలతో రద్దయింది. అయితే సెంట్రల్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ) ఆధ్వర్యంలో ప్రస్తుతం డిజిటల్‌ డోర్‌ నంబర్లను అధికారులు కేటాయించనున్నారు. ఇళ్ల చిరునామాలు గతంలో అస్తవ్యస్తంగా ఉండటంతో ఒక ఫ్లాట్‌ను ఇద్దరికి విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. డిజిటల్‌ డోర్‌ నంబర్‌ను గూగుల్‌ మ్యాప్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో పాత ఇంటి నంబర్‌ స్థానంలో డిజిటల్‌ నంబర్లు కేటాయించడంతో ఆ వార్డులోని ఇళ్ల నంబర్లన్నీ ఒకే క్రమసంఖ్యలోకి వస్తాయి. ప్రాంతం పేరు, వార్డు, రోడ్డునంబర్‌, బహుళ అంతస్థు భవనం అయితే అంతస్థు వివరాలు నమోదు చేయనున్నారు. ఇక గూగుల్‌ మ్యాప్‌కు అనుసంధానించడంతో పోలిసింగ్‌, ఫైర్‌స్టేషన్‌, అంబులెన్స్‌ సేవలు తక్షణమే అందుకునే అవకాశం ఉంటుంది. భువన్‌ యాప్‌లో వివరాలన్నింటినీ అనుసంధానం చేయనున్నారు. 

Updated Date - 2022-05-24T05:27:42+05:30 IST