Digital News కు కళ్లెం.. త్వరలోనే కొత్త చట్టం.. కసరత్తు షురూ

ABN , First Publish Date - 2022-07-15T21:47:05+05:30 IST

భారత్‌(India)లో మొట్టమొదటిసారి ‘డిజిటల్ న్యూస్ ’(Digital News) పై నియంత్రణ రాబోతుంది.

Digital News కు కళ్లెం.. త్వరలోనే కొత్త చట్టం.. కసరత్తు షురూ

న్యూఢిల్లీ : భారత్‌(India)లో మొట్టమొదటిసారి ‘డిజిటల్ న్యూస్ ’(Digital News) నియంత్రణ పరిధిలోకి రాబోతుంది. డిజిటల్ న్యూస్ సైట్లు(Digital News Sites) సహా సంబంధిత డిజిటల్ మీడియా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అతిక్రమణకు పాల్పడితే వెబ్‌సైటు  రిజిస్ట్రేషన్ రద్దు లేదా జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పిరియాడికల్స్ చట్ట సవరణ ప్రక్రియను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ మొదలుపెట్టింది.


డిజిటల్ న్యూస్ సంస్థలను పర్యవేక్షించే ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 90 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. కాగా సంబంధిత బిల్లు ఆమోదం పొందితే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిర్వహించే అన్ని రకాల డిజిటల్ మీడియా న్యూస్‌ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది.  నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలితే రిజిస్ట్రేషన్ రద్దు లేదా జరిమానా విధిస్తారు.


ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా ఒక అప్పిలేట్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. కాగా డిజిటల్ మీడియా న్యూస్‌పై భారత్‌లో ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణ లేదు. ప్రతిపాదిత చట్టం ఆచరణలోకి వస్తే డిజిటల్ మీడియాని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నియంత్రిస్తుంది. అయితే ఈ బిల్లుకి ఇంకా ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు ఇతర భాగస్వాముల ఆమోదం లభించాల్సి ఉంది. 

Updated Date - 2022-07-15T21:47:05+05:30 IST