సర్పంచులకు డిజిటల్‌ కీ

ABN , First Publish Date - 2022-08-12T05:29:42+05:30 IST

ఇకపై గ్రామాల్లో కూడా డిజిటల్‌ విధానం అందుబాటులోకి రానుంది. దీంతో పంచాయతీల్లో నిధుల దుర్వినియోగానికి చెక్‌పడి పాలనలో పారదర్శకత పెరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా డిజిటల్‌ కీ విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో పాత చెక్కుల పద్ధతికి కాలం చెల్లిపోయి ఆన్‌లైన్‌ విధానం మాత్రమే ఉండనుంది. ఇందుకు తగ్గట్టుగా గ్రామ పంచాయతీలను డిజిటలైజేషన్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సర్పంచులకు డిజిటల్‌ కీ
సర్పంచ్‌లకు డిజిటల్‌కీని అందజేస్తున్న డీఎల్‌పీవో

- గ్రామాల్లో నిధుల దుర్వినియోగానికి చెక్‌

- నూతన విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం

- సర్పంచ్‌లకు డిజిటల్‌కీల అందజేత

సదాశివనగర్‌, ఆగస్టు 11: ఇకపై గ్రామాల్లో కూడా డిజిటల్‌ విధానం అందుబాటులోకి రానుంది. దీంతో పంచాయతీల్లో నిధుల దుర్వినియోగానికి చెక్‌పడి పాలనలో పారదర్శకత పెరగనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా డిజిటల్‌ కీ విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో పాత చెక్కుల పద్ధతికి కాలం చెల్లిపోయి ఆన్‌లైన్‌ విధానం మాత్రమే ఉండనుంది. ఇందుకు తగ్గట్టుగా గ్రామ పంచాయతీలను డిజిటలైజేషన్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆన్‌లైన్‌ విధానం దిశగా అన్ని గ్రామ పంచాయతీలు అడుగులు వేస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు జాయింట్‌ చెక్‌ పవర్‌ ఇచ్చింది. కొన్నేళ్లుగా పంచాయతీ నిధుల విడుదల రాత చెక్కుల రూపంలో ఉండేది. ఫలితంగా కొన్నిచోట్ల పంచాయతీ తీర్మానం లేకుండానే నిధుల దుర్వినియోగం జరిగేది. దీంతో సర్పంచ్‌లు సస్పెన్షన్‌కు గురికావడం, విచారణ ఎదుర్కోవడం వంటివి జరిగేవి. ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేసి నిధుల ఖర్చులో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. వీరికి సంయుక్త సంతకాలతో కూడిన డిజిటల్‌ కీని తీసుకువచ్చి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లను రూపొందించారు.

పాత చెక్కుల విధానానికి చెల్లు

ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో నిధుల ఖర్చు కోసం రాత చెక్కు విధానం అమలులో ఉండేది. గ్రామ అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి సంతకం చేసి చెక్‌ను ట్రెజరీ కార్యాలయానికి నేరుగా తీసుకెళ్లేవారు. అన్ని సరిగా ఉండి ఆమోదం పొందితే నిధులు విడుదల చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈ విధానంలో తప్పుడు రికార్డులు సృష్టించి పనులు చేయకున్నా చేసినట్లుగా చూపడం, సంతకాలు ఫోర్జరీ చేసి నిధుల డ్రా చేసేందుకు అవకాశం ఉండేది. డిజిటల్‌ కీతో ఇలాంటివి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సంతకాల సేకరణ పూర్తి

డిజిటల్‌ కీ కోసం ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ల సంతకాల సేకరణ మండల పంచాయతీ అఽధికారి స్థాయిలో పూర్తయి ఇక్కడి నుంచి ప్రత్యేక లెటర్‌ ద్వారా ఎస్‌టీవోకు చేరవేయనున్నారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి మీ సేవ లేదా ఇతరత్రా ఆన్‌లైన్‌ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన ఆ పంచాయతీ సాఫ్ట్‌వేర్‌ను కార్యదర్శులు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అయితే ప్రతిరోజూ మూడు మండలాల చొప్పున ఇప్పటి దాకా అన్ని గ్రామ పంచాయతీలకు డిజిటల్‌ కీల పంపిణీ పూర్తయింది. డిజిటల్‌ విధానంపై సైతం సర్పంచ్‌లకు, ఉప సర్పంచ్‌లకు సైతం అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


బిల్లుల ఆమోదంలో వేగం

- బద్దం శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌, సదాశివనగర్‌

డిజిటల్‌ కీ విధానంతో బిల్లు ఆమోదానికి సంబంధించిన పనులు వేగ వంతంగా పూర్తవుతాయి. దీంతో పంచాయతీకి కేటాయించిన నిధుల దుర్వినియోగానికి చెక్‌ పడనుంది. ప్రభుత్వ నిర్ణయం ఎంతో సంతోషంగా ఉంది. ఇకపై సర్పంచ్‌లపై అవినీతి, ఆరోపణలకు తావులేకుండా ఉంటుంది.


ఆన్‌లైన్‌లో సేవలు

- సాయిబాబా, డీఎల్‌పీవో

డిజిటల్‌కీ విధానంతో పాత పద్ధతిలో చెక్‌ విధానానికి చెక్‌ పడటమే కాకుండా పంచాయతీ ద్వారా అందించే ఆన్‌లైన్‌ సేవల్లో పారదర్శకత పెరగనుంది. ఇంటి నిర్మాణ అనుమతులు, ట్రేడ్‌ లైసెన్స్‌, ఆస్తి మార్పిడి, జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు ఇక నుంచి ఆన్‌లైన్‌లో రానున్నాయి.


Updated Date - 2022-08-12T05:29:42+05:30 IST