‘డిజిటల్’ డిమాండ్... లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు...

ABN , First Publish Date - 2021-04-20T22:16:59+05:30 IST

క్లయింట్లు డిజిటల్ దిశగా మొగ్గుచూపుతుండడంతో... డిమాండ్ తారస్థాయికి చేరుకుంటోంది.

‘డిజిటల్’ డిమాండ్... లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు...

బెంగళూరు : క్లయింట్లు డిజిటల్ దిశగా మొగ్గుచూపుతుండడంతో... డిమాండ్ తారస్థాయికి చేరుకుంటోంది. ఇన్ఫోసిస్, టీసీఎస్,  విప్రో తదితర ఐదు దిగ్గజ సంస్థలు ఈ ఏడాది లక్షకు పైగా కొత్త నియామకాలు చేపట్టనున్నాయి. చాలామంది క్లయింట్లు... డిజిటల్ మోడ్‌కు మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... క్యాంపస్ నుండే లక్షల  మందిని తీసుకోనున్నాయి ఈ ఐటీ కంపెనీలు. భారత దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ క్యాంపస్ ద్వారా 40 వేల  మందిని నియమించుకోనుంది. ఒక్క ఇన్ఫోసిస్ సంస్థే పాతిక వేల మందిని నియమించుకోనుంది. ఎంతమందిని తీసుకుంటామనే విషయం విప్రో తెలియజేయనప్పటికీ, గతేడాదితో పోల్చుకుంటే ఎక్కువ మందిని తీసుకుంటామని వెల్లడించింది.


లక్షకు పైగా నియామకాలు...

డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో పాటు గ్రోత్ రేటు ఊపందుకుంటోన్న నేపధ్యంలో ‘నైపుణ్యం’ అవసరం తారస్థాయిలో పెరిగింది. అగ్రస్థానంలో ఉన్న ఐదు టెక్ కంపెనీలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రాలు 1.10 లక్షలకు పైగా నియామకాలు చేపడతాయని స్టాఫింగ్ ఏజెన్సీ ఎక్స్ ఫెనో సహ వ్యవస్థాపకులు పేర్కొన్నారు.


నిష్క్రమణ రేటు...

తాజా నియామకాలతో పాటు ఉద్యోగుల నిష్క్రమణ రేటు కూడా అధికంగా ఉంటుందని చెబుతుండడం గమనార్హం. మొత్తంమీద ఈ ఏడాది హైరింగ్ భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. కంపెనీలు ఐటీ వ్యయాలను పెంచడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో భారీ నియామకాలకు ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతాయని భావిస్తున్నారు. ఇక మైండ్ ట్రీ వంటి కంపెనీలు కూడా నియామకాలను చేపట్టనున్నాయి.


Updated Date - 2021-04-20T22:16:59+05:30 IST