BJP, TRS మధ్య ముదురుతోన్న డిజిటల్ బోర్డు వివాదం

ABN , First Publish Date - 2022-06-27T17:47:39+05:30 IST

బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) పార్టీల మధ్య డిజిటల్ బోర్డు(Digital Board) వివాదం ముదురుతోంది.

BJP, TRS మధ్య ముదురుతోన్న డిజిటల్ బోర్డు వివాదం

Hyderabad : బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) పార్టీల మధ్య డిజిటల్ బోర్డు(Digital Board) వివాదం ముదురుతోంది. ‘సాలు దొర.. సెలవు దొర’ పేరుతో బీజేపీ కార్యాలయం వద్ద కేసీఆర్(KCR) పాలనకు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టుగా ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై టీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో నేడు బీజేపీ కార్యాలయం వద్దకు పోలీసులు చేరుకున్నారు. ‘సాలు దొర.. సెలవు దొర’ డిజిటల్ బోర్డును తొలగించాలని బీజేపీ కార్యాలయ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే బీజేపీ కార్యాలయ సిబ్బంది ససేమిరా అంటోంది. తమ‌ కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసుకుంటే టీఆర్ఎస్‌కు భయం ఎందుకని బండి‌ సంజయ్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కమలనాథులు తగ్గేదేలేందంటున్నారు.


కాగా.. అవకాశం దొరికిందంటే చాలు కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించే బీజేపీ.. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ‘కల్వకుంట్ల కౌంట్‌ డౌన్’ అంటూ ‘సాలుదొర.. సెలవు దొర’ పేరిట ఒక డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా.. ఏకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందించింది. కేసీఆర్ పాలనకు సెలవు పలకడానికి ఇక్కడ రిజిస్టర్ అవ్వండి అంటూ.. పేరు, ఫోన్ నంబర్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం తదితర వివరాలను సేకరిస్తోంది. ఈ సైట్లో వివరాలను సమర్పించిన వారి రియల్ టైం సంఖ్యను చూపిస్తోంది. అలాగే తాజా సమాచారం పేరిట కేసీఆర్ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం కూడా ఈ వెబ్‌సైట్లో బీజేపీ స్క్రోలింగ్ రూపంలో ప్రసారం చేయడం గమనార్హం. అంతేకాకుండా.. ‘సెలవు దొర’ పేరిట ట్విట్టర్ అకౌంట్‌ను కూడా బీజేపీ తెరిచేసింది.

Updated Date - 2022-06-27T17:47:39+05:30 IST