Abn logo
Sep 25 2021 @ 00:29AM

వైసీపీ తొండాట!

దుగ్గిరాల మండలపరిషత్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుక కూర్చున్న వైసీపీ ఎంపీటీసీ సభ్యులు

దుగ్గిరాల ఎంపీపీ పీఠాన్ని లాక్కునేందుకు కుతంత్రాలు

టీడీపీ అభ్యర్థికి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డంకులు

తాజాగా బీ-ఫారం ఇవ్వనందుకు అర్హతలేదని మరో పేచీ

మా అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నారంటూ ఎమ్మెల్యే ఆర్కే కొత్త రాగం

అధికారులూ అడ్డగోలుగా వత్తాసు

తొలిరోజు కోరం లేక ఎంపీపీ ఎన్నిక వాయిదా


తెనాలి(ఆంధ్రజ్యోతి), దుగ్గిరాల, సెప్టెంబరు 24: దుగ్గిరాల ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునే విషయంలో అధికార వైసీపీ తొండాటకు దిగుతోంది. ఎలాగైనా ఈ స్థానాన్ని అడ్డగోలుగా చేజిక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతుంది. దీనికి తోడు కొందరు అధికారులు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించడం విమర్శలకు దారి తీస్తోంది. దుగ్గిరాల మండల పరిషత్‌ ఎన్నికల్లో 18 ఎంపీటీసీ స్థానాల్లో తొమ్మింటిని తెలుగుదేశం, ఎనిమిది స్థానాలను వైసీపీ, ఒక స్థానాన్ని జనసేన గెలుచుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఎంపీపీ, కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రక్రియ కోరం లేక వాయిదా పడింది. 


వైసీపీ ప్రయత్నాలు విఫలం

ఇక్కడ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకోవాలంటే తెలుగుదేశానికి ఒక అభ్యర్థి మద్దతు, వైసీపీకి ఇద్దరి మద్దతు అవసరం కావడంతో జనసేన నుంచి గెలిచిన ఎంపీటీసీ కీలకంగా మారారు. అధికార వైసీపీ ఈ పీఠాన్ని కూడా దక్కించుకునేందుకు జనసేన ఎంపీటీసీ అభ్యర్థితో పాటు 9 మంది తెలుగుదేశం ఎంపీటీసీలో ఒకరిద్దరిని కూడా లాగేందుకు ప్రయత్నాలు చేసి విఫలమైంది. దీంతో తెలుగుదేశం బీసీ అభ్యర్థిగా ఉన్న చిలుమూరు-1 ఎంపీటీసీ షేక్‌ జబీన్‌కు కుల ధ్రువీకరణ పత్రం విషయంలో మడత పేచీ పెట్టారు. పలుసార్లు ఈమె తహసీల్దార్‌ మల్లేశ్వరిని కలిసి తన కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలంటూ కోరారు. తమ కుటుంబ సభ్యుల్లో బీసీ ధృవీకరణ పత్రం ఉన్న వాటిని ఆధారంగా చూపినా బీసీ జాబితాలోకి రారంటూ షేక్‌ జబీన్‌ ఓసీనే అవుతుందంటూ పేచీలు పెట్టారు. ఈ తతంగమంతా శుక్రవారం వరకు కొనసాగడంతో తెలుగుదేశం సభ్యులందరూ సమావేశానికి హాజరు కాలేదు. 


కోరం లేదన్న కారణంగా..

వాస్తవానికి టీడీపీకి సంబంధించిన 9 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరైతే పూర్తి కోరం ఉన్నట్లే. అయితే ఉదయమే వైసీపీకి సంబంధించిన ఎనిమిది ఎంపీటీసీ సభ్యులు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. సమావేశం జరగడానికి మరో సభ్యుడు కీలకం కావడంతో మధ్యాహ్నం నుంచి జనసేన సభ్యుడి మద్దతు మాకే ఉందంటూ అతను సమావేశానికి హాజరు అవుతున్నాడంటూ కొద్దిసేపు పుకార్లు షికార్లు చేయించారు. చివరకు అతను కూడా హాజరు కాకపోవడంతో కోరం లేదన్న కారణంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రీసైడింగ్‌ ఆఫీసర్‌ రాం ప్రసన్న ప్రకటించారు. కో-ఆప్షన్‌ సభ్యునిగా వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారని, అన్ని సక్రమంగా ఉండటంతో దానిని ఆమోదించినట్లు పేర్కొన్నారు. కోరం లేనందున్న సమావేశాన్ని శనివారం మధ్యాహ్ననికి వాయిదా వేస్తున్నామని, మధ్యాహ్నానికి సభ్యులు హాజరయ్యాక కోరం సరిపోతే ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని వివరించారు. 


బీ ఫారం కీలకం అంటూ.. 

ఇదిలా ఉంటే వైసీపీ మరో అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. శుక్రవారం ఎంపీపీ అభ్యర్థి బీ-ఫారాన్ని ఒక్క వైసీపీనే అందించిందని, మిగిలిన పార్టీ సభ్యులేవరూ బీ-ఫారం దాఖలు చేయనందున తర్వాతైనా ఒక వైసీపీ అభ్యర్థి మాత్రమే ఎంపీపీ రేసులో ఉంటారని ప్రచారం మొదలు పెట్టారు. ఇదే విషయాన్ని ప్రీసైడింగ్‌ ఆఫీసర్‌ రాంప్రసన్న కూడా ప్రస్తావించడం విశేషం. మరో పక్క టీడీపీ ఎంపీటీసీ సభ్యులు మాత్రం ఎంపీపీ ఎన్నిక విషయంలో బీ-ఫారం కీలకం కాదని, తప్పనిసరి అసలే కాదని, అయితే తమకు మద్దతు ఇస్తున్న సభ్యులను తమ వైపు తిప్పుకొనేందుకు వైసీపీ కొత్త ప్రచారాన్ని మొదలు పెట్టిందని ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఎంపీపీ ఎన్నికకు బీ-ఫారం కానీ, నామినేషన్‌ వేసే పద్ధతి లేదని, సమావేశానికి హాజరైన సభ్యుల మెజారిటీ అభిప్రాయమే కీలకమవుతుందని స్పష్టం చేస్తున్నారు. 


ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. 

 మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సరికొత్త ఆరోపణలకు దిగుతున్నారు. టీడీపీలో బీసీ అభ్యర్థులు లేకపోవడం వల్లే సమావేశానికి హాజరు కావడం లేదని తర్వాతైనా దుగ్గిరాల ఎంపీపీ పీఠం తమకే దక్కుతుందని చెబుతూనే తమ పార్టీ ఎంపీటీసీలను కూడా ప్రలోభ పెట్టేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారని ఆ ఎనిమిది మంది ఎంపీటీసీ అభ్యర్థుల్లోని బీసీ ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకొనేందుకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఎర చూపుతున్నారంటూ బహిరంగంగానే ఆరోపించారు. టీడీపీ సభ్యులు మాత్రం తమకు ఆ అవసరాలు లేవని, పూర్తి మద్దతు, సంపూర్ణ మెజారిటీ తమకే ఉందని, వైసీపీ సభ్యులను కొనుగోలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మాకు దాపురించలేదని చెప్పారు. తమ సభ్యుల్లో కొనుగోలు చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఎవరూ ప్రలోభాలకు లొంగకపోవడంతో వైసీపీ అధికారాన్ని ఉపయోగించి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారని, తాజాగా బీ-ఫారం డ్రామా ఆడుతున్నారని, ఇది సిగ్గుమాలిన చర్య అవుతుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు విమర్శించారు.  శుక్రవారం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక కీలకం కావడంతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే దుగ్గిరాల-తెనాలి, దుగ్గిరాల-విజయవాడ ప్రధాన రహదారులను బారికేడ్లతో మూసివేసి తనిఖీల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. దీంతో నాయకులు కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది.