గీత దాటితే వేటే

ABN , First Publish Date - 2022-05-18T06:32:23+05:30 IST

గీత దాటితే వేటు తప్పదని పోలీసు అధికారులు, సిబ్బందికి రాయలసీమ రేంజ్‌ డీఐజీ రవిప్రకాశ హెచ్చరికలు జారీ చేశారు.

గీత దాటితే వేటే

ఫిర్యాదుదారుల పట్ల 

మర్యాదగా వ్యవహరించండి 

కస్టోడియల్‌కు ఆస్కారం లేదు 

డీఐజీ హెచ్చరికలు 


హిందూపురం టౌన, మే 17: గీత దాటితే వేటు తప్పదని పోలీసు అధికారులు, సిబ్బందికి రాయలసీమ రేంజ్‌ డీఐజీ రవిప్రకాశ హెచ్చరికలు జారీ చేశారు. కొందరు పోలీసు అధికారుల తీరు వివాదాస్పదమౌతుండడంపై ‘గతి తప్పుతున్న లాఠీ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై డీఐజీ స్పందించారు. రాత్రి ఆయన.. హిందూపురం వనటౌన, అప్‌గ్రేడ్‌ పోలీసు స్టేషన్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులపట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. వారి సమస్యను వినయపూర్వకంగా స్వీకరించాలన్నారు. కస్టోడియల్‌కు ఆస్కారమే లేదన్నారు. బ్రిటీష్‌ పోలీసు వ్యవస్థ ఇప్పుడు లేదనీ, ఫ్రెండ్లీ పోలీ్‌సగా ముందుకెళ్తేనే నేరాలను అదుపు చేసే ఆస్కారం ఉంటుందన్నారు. పోలీసులు.. ప్రజలకు రక్షణ కల్పించాలనీ, వారి ఆస్తులకు కూడా భద్రం ఉండేలా చూడాలన్నారు. సివిల్‌ కేసుల్లో తలదూర్చరాదన్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారించి, నివారించాలన్నారు. స్టేషనకు వచ్చే బాధితుల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు బాగుండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడకుండా గట్టిగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. మహిళా ఘటనల్లో చిన్నపాటి జాప్యం ఉన్నా సహించేదిలేదన్నారు. వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి 24 గంటల్లోపు నిందితులను అరెస్టు చేయాలన్నారు. అనవసరంగా పోలీసు స్టేషనకు పిలిపించడం, గంటల తరబడి స్టేషనలో ఉంచుకోరాదన్నారు. పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం సన్నగిల్లేలా చేయరాదన్నారు. డీఐజీ స్థాయి అధికారులే స్టేషనకు వచ్చి చెబుతున్నారంటే దీనిపై పోలీసు అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా పనిచేయాలన్నారు. లేదంటే వేటు తప్పదన్నారు. డీఐజీ వెంట డీఎస్పీ రమ్య, సీఐలు ఇస్మాయిల్‌, జీటీ నాయుడు, హమీద్‌ఖాన, సూర్యనారాయణ ఉన్నారు.


Updated Date - 2022-05-18T06:32:23+05:30 IST