Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఆరోగ్య సార్వభౌమత్వానికి అవరోధాలు

twitter-iconwatsapp-iconfb-icon
ఆరోగ్య సార్వభౌమత్వానికి అవరోధాలు

ఫార్మారంగం సమగ్ర పురోగతికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధిపరచాలి. అరకొర నిధుల కేటాయింపుతో సదరు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎప్పటికి జరిగేను? ఈ లోగా చైనీస్ కంపెనీలు మన ఫార్మా విపణిని స్వాయత్తం చేసుకుంటే ఆశ్చర్యమేముంది? ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఖర్చు పెట్టదలుచుకున్న రూ.6940 కోట్లను రాబోయే మూడు సంవత్సరాలలోపే ఖర్చు పెట్టితీరాలి.


ఐదుదశాబ్దాల క్రితం భారతీయ ఔషధ విపణి (‘ఫార్మ్యులేషన్స్’గా సుప్రసిద్ధం)లో బహుళజాతి కంపెనీలే మూడింట రెండు వంతుల వాటా కలిగివుండేవి. 1970లో ‘ప్రొడక్ట్ పేటెంట్స్’ని మన ప్రభుత్వం రద్దు చేసింది. బహుళజాతి కంపెనీలకు పేటెంట్లు ఉన్న ఔషధాలను ప్రత్యామ్నాయ ప్రక్రియల ద్వారా భారతీయ కంపెనీలు ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిచ్చింది. దరిమిలా భారతీయ ఔషధ తయారీ రంగం శీఘ్రగతిన పురోగమించింది. భారతీయ విపణిలోనే కాదు, దేశ దేశాల ఔషధ విపణిలో భారతీయ కంపెనీలే అగ్రగాములుగా ఆవిర్భవించాయి. ప్రపంచ ఔషధ రంగంలో మన కంపెనీల ఆధికత్యత నేటికీ చెక్కు చెదర లేదు. 


ఔషధాల ఉత్పత్తికి అవసరమైన ప్రాథమిక పదార్థాల (వీటినే సాంకేతికంగా ‘యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్ ఇన్ గ్రీడియంట్స్’ లేదా ఏపీఐలు అంటారు) వ్యాపారం భిన్న రీతిలో సాగింది. 1991లో కేవలం 1 శాతం ఏపీఐలను మాత్రమే మన కంపెనీలు దిగుమతి చేసుకునేవి. ఆర్థిక సంస్కరణల ఫలితంగా ఈ పరిస్థితి మారిపోయింది. 1990 దశకం మధ్యనాళ్లకే మన ఫార్మా కంపెనీలు తమకు అవసరమైన ఏపీఐలలో 70 శాతాన్ని దిగుమతి చేసుకోసాగాయి. వీటిలో అత్యధిక భాగం చైనా నుంచే కావడం గమనార్హం. ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితులలో మన దేశంలో ఆ మహమ్మారి బాధితుల చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో లేకపోవడం ఏపీఐలను దిగుమతి చేసుకోవడానికి అనేక ఆటంకాలు నెలకొనడమే కారణం. 


పార్మ్యులేషన్స్ మార్కెట్‌లో భారతీయ కంపెనీల ప్రాబల్యానికి సైతం తీవ్ర సవాళ్ళు ఏర్పడుతున్నాయి.. రాబోయే ఐదారు సంవత్సరాలలో మన ఫార్మ్యులేషన్స్ విపణిలోకి చైనా ప్రవేశించవచ్చని ‘పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్‌ ఇండియా’ ప్రతినిధి శక్తివేల్ సెల్వరాజ్ తెలిపారు. గతంలో ఏపీఐల విషయంలో భారతీయ కంపెనీల ఆధిక్యాన్ని తగ్గించివేసిన విధంగా ఫార్మ్యులేషన్స్ విపణిలో కూడా భారతీయ కంపెనీలపై చైనా సంస్థలు పై చేయి సాధించే అవకాశం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఫార్మా కంగంలో చైనా నుంచి ఎదురు కానున్న సవాల్‌ను భారత ప్రభుత్వం గుర్తించింది. ఔషధాల ఉత్పత్తికి సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింతగా మెరుగుపరిచేందుకు వచ్చే ఆరేళ్ళలో రూ.6940 కోట్లను ఖర్చు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేగాక 19 వైద్య సాధనాలను భారతీయ తయారీ దారుల నుంచే కొనుగోలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే చైనా నుంచి ఎదురవనున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మరిన్ని చర్యలు మరింత వేగంగా చేపట్టితీరాలి. లేనిపక్షంలో చైనీస్ ఫార్మ్యులేషన్స్ మన ఔషధ విపణిలో త్వరలోనే పూర్తి ప్రాబల్యం వహించే ప్రమాదం ఎంతైనా ఉంది. 


తొట్టతొలుత చేపట్ట వలసిన చర్య దిగుమతి సుంకాల పెంపుదల. దిగుమతులు వ్యయభరితమయితే దేశీయ ఉత్పత్తులకు ఇతోధిక ప్రోత్సాహం లభిస్తుంది. తక్కువ ధరలకు ఔషధ ఉత్పత్తులు సామాన్యులకూ అందుబాటులో ఉంటాయి. అయితే 2021–22 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌లో వైద్య పరికరాల దిగుమతిపై సుంకాలను పెంచకపోవడం పట్ల ‘అసోసియేషన్ ఆఫ్‌ ఇండియన్ మెడికల్ డివైస్’ ప్రతినిధి రాజీవ్ నాథ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్రంట్ లైన్ మెడికల్ టెక్నాలజీస్ అభివృద్ధికి భారీ మదుపులు చేయడమనేది చేపట్ట వలసిన రెండో చర్య. ఫార్మా రంగంలో భారతీయ కంపెనీల ప్రస్తుత ఆధిక్యత జెనరిక్ మందుల ఉత్పత్తిపై ఆధారపడివున్నది. ఇవి, పేటెంట్ చట్టాల పరిధిలో ఉండకపోవడమే అందుకు ప్రధాన కారణం. 


మౌలిక ఆవిష్కరణలు ప్రధానంగా బహుళజాతి సంస్థలవే. తత్కారణంగా వాటికి తమ నవ కల్పనలపై ఇరవై సంవత్సరాల పాటు పేటెంట్ రక్షణ ఉంటుంది. తద్వారా ఆ కంపెనీలకు భారీ లాభాలు సమకూరుతున్నాయి. కరోనా టీకా కొవిషీల్డ్‌ను తయారుచేసిన ఆస్ట్రా జెనెకా భారత్‌లో ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసేందుకు సీరమ్ ఇనిస్టిట్యూట్‌కు లైసెన్స్ ఇవ్వడం ద్వారా అపరిమిత ఆర్థిక లబ్ధిని పొందుతోంది. కొవిడ్ టీకాలను అభివృద్ధిపరిచేందుకు పైజర్, ఆస్ట్ర జెనెకా రెండూ భారీ ఆర్థిక సహాయాన్ని పొందాయి. మరి భారతీయ కంపెనీ భారత్ బయోటెక్‌కు ఈ విషయంలో అందిన ఆర్థిక సహాయం కేవలం రూ.65 కోట్లు మాత్రమే! కొవిడ్ నియంత్రణకు అత్యవసర ఔషధాలను అభివృద్ధిపరిచేందుకై 2021-–22 కేంద్ర బడ్జెట్ భారతీయ కంపెనీలకు ఎలాంటి ఆర్థిక తోడ్పాటు సమకూర్చలేదని ‘పాలీ మెడికేర్’ సంస్థ ప్రతినిధి హిమాంశు వైద్ పేర్కొన్నారు. 


ఆరోగ్య భద్రతకు అవశ్యకమైన సకల ఔషధాలు, సాధనాల తయారీని వేగవంతం చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ను ఇతోధికంగా అభివృద్ధిపరిచేందుకుగాను భారీ పెట్టుబడులు పెట్టడం మూడో చర్యగా ఉండి తీరాలి. రాబోయే ఆరు సంవత్సరాలలో ఇందుకు రూ.6940 కోట్లు ఖర్చు పెట్ట నున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు పెడతారనేది స్పష్టంగా తెలియదు. భావి వ్యయాల విషయం గురించి ఇంక చెప్పేదేముంది? ఫార్మారంగం సమగ్ర పురోగతికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అభివృద్ధిపరిస్తే ప్రైవేట్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను నెలకొల్పుకుంటాయి. అయితే అరకొర నిధులతో సదరు మౌలికసదుపాయాల అభివృద్ధి ఎప్పటికి జరిగేను? ఈ లోగా చైనీస్ కంపెనీలు మన ఫార్మా విపణిని స్వాయత్తం చేసుకుంటే ఆశ్చర్యమేముంది? ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఖర్చు పెట్ట దలుచుకుంది రాబోయే మూడు సంవత్సరాలలోపే ఖర్చు పెట్టితీరాలని హిమాంశు వైద్ డిమాండ్ చేశారు. 


ఫార్మా రంగ అభివృద్ధికి చేపట్ట వలసిన నాల్గవ చర్య మూల ధన పెట్టుబడులను అందుబాటులో ఉంచడం. మూల ధన పెట్టుబడులకు అవసరమైన రుణాలు తీసుకోవడానికి అయ్యే వ్యయం చైనాలో 5 శాతం కాగా భారత్‌లో 12 శాతంగా ఉంది! మరో ముఖ్యమైన విషయమేమిటంటే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తమ ఆరోగ్య సార్వభౌమత్వాన్ని మరింత పటిష్ఠంగా నిర్మించుకునేందుకు ఫార్మా కంపెనీలకు ఇతోధిక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. అమెరికాలో ఎపీఐల తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈస్ట్‌మన్ కోడక్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం రూ.5700 కోట్లు ఆర్థిక సహాయమందిస్తోంది. కోడక్ కంపెనీ ఆ మొత్తాన్ని 25 సంవత్సరాలలో తిరిగి ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇది చాలా ఉదార సహాయం. మరి మన ప్రభుత్వం ఏ ఫార్మా కంపెనీకైనా ఇటువంటి ఆర్థికసహాయం అందిస్తుందా? తెలుసుకోవల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే అమెరికా ప్రభుత్వం ఆ ఆర్థిక సహాయాన్ని రక్షణ ఉత్పత్తుల చట్టం కింద సమకూరుస్తుంది. దేశ రక్షణకు ఏపీఐలను దేశీయంగా ఉత్పత్తి చేసుకోవడం తప్పనిసరి అని అమెరికా ప్రభుత్వం విశ్వసిస్తోంది.ఆరోగ్య సార్వభౌమత్వానికి అవరోధాలు

భరత్ ఝున్‌ఝున్‌వాలా

-(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.