నూతన రన్‌వేపై తొలగని ఇబ్బందులు

ABN , First Publish Date - 2020-08-08T07:57:05+05:30 IST

దాదాపు రూ.143 కోట్లతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) విజయవాడ విమానాశ్రయంలో ..

నూతన రన్‌వేపై తొలగని ఇబ్బందులు

ఆంధ్రజ్యోతి, విజయవాడ : దాదాపు రూ.143 కోట్లతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) విజయవాడ విమానాశ్రయంలో నూతన రన్‌వే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుత విజయవాడ ఎయిర్‌పోర్టు రన్‌వే 2,286 మీటర్లు ఉండగా, దీనిని 3,360 మీటర్లకు పొడిగించటానికి ఏఏఐ నిధులు మంజూరు చేసింది. ప్రస్తుత రన్‌వేను పటిష్ఠం చేయటంతో పాటు నూతన రన్‌వేను పూర్తిస్థాయిలో అభివృద్ధి  చేయటానికి రూ.143 కోట్లు అవసరమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో విమానాశ్రయ అభివృద్ధికి రైతుల నుంచి 700 ఎకరాలు సమీకరించారు. ఇలా స్వాధీనం చేసిన భూముల్లో ఏలూరు కాల్వ అవతల వైపు నేవిగేషన్‌ కోసం డీవీవోఆర్‌ను నిర్మించారు. ఇవతల పాత రన్‌వేకు అనుగుణంగా అదనంగా 1,074 మీటర్ల మేర నూతన రన్‌వే పనులు చేపట్టారు. ఏడాది కిందటే పూర్తయ్యాయి. అప్పటి నుంచి నూతన రన్‌వే అందుబాటులోకి రాలేదు.


ఈ భూములకు సంబంధించి రైతులు, ఇళ్లను ఖాళీ చేయాల్సిన వారు, రియల్‌ వెంచర్లలోని ప్లాట్లదారుల సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో పరిష్కరించలేదు. కాగా, రన్‌వే సకాలంలో అందుబాటులోకి రాకపోవటం వల్ల విజయవాడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడపటానికి తీవ్ర అడ్డుగా మారింది. కేంద్ర ప్రభుత్వ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ప్రపంచ దేశాలకు స్లాట్లు కేటాయించటంలోనూ,  భారీ విమానాలు దిగటానికి నూతన రన్‌వే అందుబాటులోకి రాకపోవడం వల్ల విదేశీ విమానయాన సంస్థల్లో ఆసక్తి లోపించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే హజ్‌ యాత్రను విజయవాడ నుంచి ప్రారంభించే విషయంలోనూ అంతులేని జాప్యం జరిగింది.


ప్రభుత్వ నిర ్లక్ష్యానికి నిదర్శనాలు 

ఏడాది కిందట పూర్తిచేసిన నూతన రన్‌వేను ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ సంబంధిత పనులు పెండింగ్‌లో ఉండటమే. భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయకపోవటం వల్ల నూతన రన్‌వేను సెక్యూరిటీ పరిధిలోకి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. బుద్ధవరం, దావాజీగూడెం పరిధిలోని ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంది. వీరికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎవరూ ఇళ్లు ఖాళీ చేయలేదు. చిన అవుటపల్లిలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పనులు ప్రారంభించి అసంపూర్ణంగా వదిలేయడంతో ఈ సమస్య ఏర్పడింది. అలాగే, రన్‌వేను నిర్మించిన ఎయిర్‌పోర్టు అథారిటీ పూర్తిస్థాయిలో ప్రహరీని నిర్మించలేకపోయింది.


ఇళ్ల దగ్గరకు వచ్చేసరికి ఎవరూ ఖాళీ చేయకపోవటం వల్ల తాత్కాలికంగా ఫెన్సింగ్‌ ఏర్పాటుచేశారు. ఇలా నాలుగు కిలోమీటర్ల మేర ఎలాంటి రక్షణ గోడ లేకుండా ఫెన్సింగ్‌ వేశారు. ఏలూరు కాల్వ అవతల ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించిన భూముల్లో నేవిగేషన్‌ కోసం డీవోవీఆర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో రియల్‌ వెంచర్ల ప్లాట్లదారుల భూములున్నాయి. వీరికి ప్లాట్‌ టు ప్లాట్‌ గన్నవరంలోనే ఇస్తామని గతంలో ప్రభుత్వ యంత్రాంగం అంగీకారం తెలిపింది. ఆ తర్వాత వీరికోసం అజ్జంపూడిలో 50 ఎకరాలు తీసుకుంటామని ప్రకటించారు.


ప్లాట్‌ టు ప్లాట్‌ ఇస్తామని మోసం చేశారని కొందరు బాధితులు ఇప్పటికీ పోరాడుతున్నారు. వీరి సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇదే ప్రాంతంలో మరికొందరి రైతుల భూములు ఉన్నాయి. మిగిలిన రైతుల మాదిరిగానే వీరికి కూడా అమరావతిలో ప్యాకేజీ కింద భూములు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ ఇవ్వకపోగా, వీరికి ప్యాకేజీ ఇవ్వాల్సిన ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నారన్న సమాచారంతో తమ భూముల్లో వ్యవసాయం చేసుకుంటామని రైతులు అంటున్నారు. సమీకరించిన భూములకు పరిహారం రానప్పుడు రైతులు కోర్టుకు వెళ్తే, వారికే అనుకూలంగా తీర్పు వస్తుంది. కాబట్టి ఎయిర్‌పోర్టు అథారిటీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. 

Updated Date - 2020-08-08T07:57:05+05:30 IST