కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడు వేస్తారో తెలియక ఇబ్బందులు

ABN , First Publish Date - 2021-06-20T04:54:28+05:30 IST

శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రిలో ఏ రోజు వ్యాక్సిన్‌ చేస్తారో?, ఏ రోజు వేయరో? తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఎప్పుడు వేస్తారో తెలియక ఇబ్బందులు
వ్యాక్సిన్‌ లేదని తెలిసి ఆస్పత్రి నుంచి వెనుదిరుగుతున్న జనం

గంటల కొద్దీ జనం పడిగాపులు

మల్కాపురం, జూన్‌ 19 : శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రిలో ఏ రోజు వ్యాక్సిన్‌ చేస్తారో?, ఏ రోజు వేయరో? తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని ఏడు వార్డుల నుంచి అనేక మంది వ్యాక్సిన్‌ కోసం ఉదయం ఏడు గంటలకే ఈ ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఉదయం పది గంటల సమయంలో సిబ్బంది బయటకు వచ్చి వ్యాక్సిన్‌ రాలేదని, వ్యాక్సినేషన్‌ చేయడం లేదని చెబుతున్నారు. ఉదయం నుంచి వేచి ఉన్న జనం నిరాశతో వెనుదిరుగుతున్నారు. శనివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వ్యాక్సిన్‌ వేయడం లేదని ముందుగా ఆస్పత్రి వద్ద బోర్డు ఏర్పాటు చేస్తే ఇంత సేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు కదా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవు పెట్టి మరీ వ్యాక్సిన్‌ కోసం వచ్చామని పలువురు వాపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి వ్యాక్సిన్‌ ఎప్పుడు వేసేది ముందుగా ఆస్పత్రి వద్ద బోర్డు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

పక్కదారి పడుతున్న వ్యాక్సిన్‌

శ్రీహరిపురం జీవీఎంసీ ఆస్పత్రిలో సిబ్బంది డబ్బులు తీసుకుని కొందరికి వ్యాక్సిన్‌ వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.600 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా కొందరి పేర్లను నమోదు చేసుకుని వారి నుంచి డబ్బులు తీసుకుని వ్యాక్సిన్‌ వేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తులకు వ్యాక్సిన్‌ వేసి సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది.

Updated Date - 2021-06-20T04:54:28+05:30 IST