అద్దె బస్సులు లేక అవస్థలు

ABN , First Publish Date - 2021-07-20T04:59:19+05:30 IST

చెల్లింపులు లేకపోవడంతో ఆర్డీసీ అద్దె బస్సులు నిలిచిపోయాయి.

అద్దె బస్సులు లేక అవస్థలు
గద్వాల బస్సు డిపో ఆవరణలో నిలిచి ఉన్న అద్దె బస్సులు

-  సకాలంలో బస్సులు రాక ఇబ్బందులు

-  జీతాలు లేక డ్రైవర్ల ఇక్కట్లు

గద్వాల అర్బన్‌, జూలై 19 : చెల్లింపులు లేకపోవడంతో ఆర్డీసీ అద్దె బస్సులు నిలిచిపోయాయి. దీంతో గద్వాల డిపోలో ఉన్న 48 అద్దె బస్సులు బస్టాండుకే పరిమితం అయ్యాయి. రాయచూరు, వనపర్తి, ఆత్మకూరు, అయిజ మార్గాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులు ఎక్కువ శాతం అద్దెవే కావడంతో ఆ మార్గాల్లో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఆగస్టు మొదటి వారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమస్య మరింత తీవ్రం అవుతుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సులు నిలిచి పోవడం ప్రయాణికులకే కాకుండా బస్సుల యజమానులకు, వాటిలో పనిచేసే డ్రైవర్లు, హెల్పర్లకు అవస్థలు తెచ్చి పెట్టింది. 


రెండు నెలల అద్దె బకాయి

ఆర్టీసీ గద్వాల డిపోలో మొత్తం 104 బస్సుల్లో 48 అద్దెవే ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి అద్దె బస్సులకు చెల్లింపులు చేయకపోవడంతో గత్యంతరం లేక యజమానులు వాటిని నిలిపివేశారు. ఒక్కో బస్సుకు సగటున నెలకు రూ.లక్ష వరకు అద్దె రావాల్సి ఉండగా, రెండు నెలల నుంచి చెల్లింపులు లేక యజమానులకు వాటి నిర్వహణ కష్టంగా మారింది. రాష్ట్రస్థాయి యజమానుల అసోసియేషన్‌ చేసిన కృషి ఫలితంగా జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన పెండింగ్‌ అద్దెను నాలుగు వాయిదాల్లో చెల్లించారు. అంతలోనే లాక్‌డౌన్‌ కారణంగా బస్సులను పూర్తిగా నిలిపేశారు. అన్‌లాక్‌ అనంతరం అద్దె బస్సులో సగం మాత్రమే వినియోగించారు. బకాయిలను చెల్లిస్తే తిరిగి బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు యజమానులు చెప్తున్నారు. 


జీతాలు లేక ఇబ్బందులు 

సంస్థ నుంచి అద్దె చెల్లించకపోవడంతో యజమానులు జీతాలు ఇవ్వలేక పోతున్నారు. దీంతో కుటుంబాల నిర్వహణ భారంగా మారింది. ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించి ఆర్టీసీ సంస్థకు ఆర్థిక సాయం అందించి అద్దె బస్సులకు బకాయిలు చెల్లించాలి

- విజయ్‌, డ్రైవర్ల యూనియన్‌ అధ్యక్షుడు


వడ్డీల భారంతో నలిగిపోతున్నాం

    బస్సుల కొనుగోలు కోసం చేసిన అప్పులకు చెల్లించాల్సిన నెలసరి వాయిదాలను పెండింగ్‌ వేయడంతో రుణదాతలు పెనాల్టీ విధిస్తున్నారు. మేము ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో బ్యాంకుల నుంచి మాట పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరో నెల గడిస్తే బస్సులను రుణదాతలు జప్తు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

- ఎల్లగౌడ్‌, అద్దె బస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు 


యాజమాన్యానికి నివేదించాం

    డిపో పరిధిలోని ప్రధాన రూట్లలో తిరిగే అద్దె బస్సులు లేకపోవడంతో ఆదాయం కూడా తగ్గిపోయింది. గతంలో రోజుకు రూ.14 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అది రూ.8లక్షల నుంచి రూ.9 లక్షలకే పరిమితమైంది. దీంతో పాటు డిపోలో నలభై మందికి పైగా కండక్టర్లను స్పేర్‌లో ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం కోసం సంస్థ యాజమాన్యం ప్రయత్నిస్తోందని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం.

- రామ్మోహన్‌, డిపో మేనేజర్‌ 

Updated Date - 2021-07-20T04:59:19+05:30 IST