‘యాప్‌’సోపాలు!

ABN , First Publish Date - 2022-08-17T04:38:15+05:30 IST

ఇలా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోయారు. నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకొని కొత్త యాప్‌తో ఆపసోపాలు పడ్డారు. గతంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి

‘యాప్‌’సోపాలు!
సత్యవరం పాఠశాల ఆవరణలో సెల్‌ఫోన్లతో కుస్తీలు పడుతున్న ఉపాధ్యాయులు

హాజరు నమోదుకు తప్పని ఇబ్బందులు

ఉదయం 8 నుంచే సెల్‌ఫోన్లతో కుస్తీలు

సాంకేతిక సమస్యతో డౌన్‌లోడ్‌ కాని సిమ్స్‌ ఏపీ యాప్‌

తొలిరోజు చుక్కలు చూసిన ఉపాధ్యాయులు

ప్రభుత్వ తీరుపై విమర్శలు

ఆందోళనబాటలో ఉపాధ్యాయ సంఘాలు


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/నరసన్నపేట/ఇచ్ఛాపురం)

- నరసన్నపేట మండలం సత్యవరం ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఉపాధ్యాయులు సెల్పీలతో ఇలా కుస్తీ పడుతున్నారు. పాఠశాల విద్యాశాఖ ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) విధానాన్ని మంగళవారం నుంచి అమలుచేసిన సంగతి తెలిసిందే. సిమ్స్‌ ఏపీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరువేయడానికి ఉపాధ్యాయులు ఆపసోపాలు పడుతున్నారు. సర్వరు, సాంకేతిక సమస్యలతో తొలిరోజు నరకయాతన పడ్డారు. 


- నరసన్నపేట బోర్డు స్కూల్‌లో ఉపాధ్యాయులు ఉదయం 8.30 గంటలకే పాఠశాలకు హాజరయ్యారు. వచ్చిరాగానే ఇలా సెల్‌ఫోన్లతో కుస్తీలు పడ్డారు. సెల్‌ఫోన్‌లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ కోసం పడరాని పాట్లు పడ్డారు. తొమ్మిది గంటలు దాటితే ఎక్కడ గైర్హాజరని చూపుతుందోనని ఆందోళన పడ్డారు. చివరకు ఎలాగోలా హాజరు పడడంతో ఊపిరిపీల్చుకున్నారు.  

-  ఇచ్ఛాపురం మునిసిపాల్టీ పంజా వీధి ప్రాథమిక పాఠశాలలో దుస్థితి ఇది. ఇక్కడ హెచ్‌ఎం ధనలక్ష్మితో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు విధులకు హాజరైన వీరు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే క్రమంలో ఆపసోపాలు పడ్డారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో అరగంట పాటు సెల్‌ఫోన్లతో కుస్తీలు పట్టారు.

- ఇచ్ఛాపురం మండలం ఈదుపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో 11 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వివరాలు నమోదు చేసే క్రమంలో కోడ్‌ ఓపెన్‌ కాలేదు. కొద్దిసేపటి తరువాత ఓపెన్‌ అయినా అప్పటికే సమయం మించి పోయింది. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే హాజరు వేసుకోలిగారు. మిగతా వారికి రిక్తహస్తమే ఎదురైంది. 

ఇలా జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోయారు. నిమిషం ఆలస్యమైనా సెలవుగా పరిగణిస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ఆందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటలకే పాఠశాలకు చేరుకొని కొత్త యాప్‌తో ఆపసోపాలు పడ్డారు. గతంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి బయోమెట్రిక్‌, ఐరిస్‌ హాజరు విధానం ఉండేది. కొవిడ్‌ నుంచి నిలిచిపోయింది. ఇప్పుడు దాని స్థానంలో పాఠశాల విద్యాశాఖ ఫేషియల్‌ రికగ్నిషన్‌ (ముఖ హాజరు) విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ‘సిమ్స్‌-ఏపీ’ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ప్రతి ఉపాధ్యాయుడు, పాఠశాలల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది తమ సొంత ఫోన్లలో దీనిని డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. అంతకంటే ముందు ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్‌లో ఆ పాఠశాలలోని బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు నమోదు చేయాలి. ప్రతి ఉపాధ్యాయుడు, ఉద్యోగికి ఎన్ని సెలవులు ఉన్నాయో కూడా అందులో పేర్కొనాలి. అనంతరం ఉపాధ్యాయులు, ఉద్యోగులను పాఠశాలలోనే మూడు యాంగిల్స్‌లో ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆ తర్వాత వారు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్‌ అయి ఫొటో తీసుకుని అప్‌లోడ్‌ చేస్తే హాజరు పడుతుంది. అయితే ఇది కచ్చితంగా 9 గంటలలోపే చేయాలి. 9 గంటలకు నిమిషం దాటినా హాజరును యాప్‌ అంగీకరించదు. 

కష్టసాధ్యం..

యాప్‌ అమలు కష్టసాధ్యమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటివరకూ 12 రకాల యాప్‌ల నమోదు చేస్తున్నామని.. కొత్తగా ఈ యాప్‌ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ సరికొత్త యాప్‌ ఎలా వినియోగించుకోవాలో చాలామందికి తెలియదని చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్లు లేనివారి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు జిల్లాలో మారుమూల గ్రామీణ ప్రాంతాలున్నాయి. నెట్‌వర్కు సమస్య తీవ్రంగా ఉంది. అటువంటి సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే హాజరు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం పావు గంటల వరకూ  గ్రేస్‌ పీరియడ్‌ లేకుండా. నిర్థిష్టంగా 9 గంటలను డెడ్‌లైన్‌ పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్కడ విచిత్ర పరిస్థితులు

 విలీన పాఠశాలల్లో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు 342కు  పైగా  ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఎస్‌జీటీలను అటు తక్కువ ఉన్న పాఠశాలలతో పాటు విలీనమైన స్కూళ్లలో సర్దుబాటు చేశారు. 400 మంది వరకూ ఉపాధ్యాయులు ఇలా సర్దుబాటు అయ్యారు. వీరి ట్రెజరీ ఐడీలో ఒక విధంగా ఉంటే పనిచేస్తున్నది మాత్రం వేరే పాఠశాలగా ఉంది. ట్రెజరీ ఐడీలో ఏ పాఠశాల అని ఉందో అక్కడ నుంచే యాప్‌ నమోదు చేసుకోవాలి. దీంతో పూర్వపు పాఠశాలలకు ఉపాధ్యాయులు పరుగులు తీస్తున్నారు.

వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు

ప్రభుత్వ తాజా నిర్ణయంపై ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. ఇది ముమ్మాటికీ కక్షసాధింపేనని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. పోరాటం చేయడానికి నిర్ణయించుకున్నాయి.యాప్‌నకు దూరంగా ఉండాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చాయి. అందుకే జిల్లాలో ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. ఇన్‌స్టాల్‌ చేసుకున్నా తరువాత ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు  దానిని రిమోవ్‌ చేశారు. వ్యక్తిగత గోప్యతను హరించే యాప్‌ వద్దని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక డివైజ్‌లను పంపిణీ చేయాలంటున్నారు. 


నిర్ణయం సరికాదు

ఉపాధ్యాయుడి సొంత స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా హాజరువేయాలని చూడడం సరికాదు. ఆన్‌లైన్‌ ద్వారా హాజరు వేయాలనుకుంటే ఇందుకు ప్రత్యేక డివైజ్‌ను ప్రభుత్వమే పంపిణీ చేయాలి. ఎటువంటి సన్నద్ధత, అవగాహన లేకుండా సిమ్స్‌ ఏపీ యాప్‌ను అందుబాటులోకి తేవడం, ఉన్నపలంగా అమలుచేయాలని చూడడం భావ్యం కాదు. ఇప్పటికే యాప్‌ల భారంతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. విద్యాబోధన కంటే బోధనేతర పనులతోనే ఇబ్బందిపడుతున్నారు. అందుకే ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. 

-మజ్జి మదన్‌మోహన్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు


సాంకేతిక సమస్యలు

ఆన్‌లైన్‌ హాజరు విధానానికి మేము వ్యతిరేకం కాదు. కానీ సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపకుండా బలవంతంగా రుద్దడం సరికాదు. ఉదయం విద్యార్థులతో ప్రార్థన కూడా చేయలేకపోతున్నారు. సెల్‌ఫోన్లతో పాఠశాల ప్రాంగణంలో కుస్తీలు పట్టాల్సి వస్తోంది. బోధన కంటే బోధనేతర పనులతోనే సరిపోతోంది. 

బుద్దల కేశవరావు, ఏపీటీఎఫ్‌ నాయకుడు

  

పని ఒత్తిడి

అటు బోధన, ఇటు పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారుతోంది. పని ఒత్తిడితో మానసిక క్షోభకు గురవుతున్నాం. హాజరు విధానాన్ని పటిష్టం చేయడంలో తప్పులేదు. కానీ దీని కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలి. సొంత ఫోన్లలో యాప్‌ రూపంలో నమోదు ప్రక్రియ అనేది తలకు మించిన భారమే. ప్రభుత్వం పునరాలోచించుకోవాలి.  

 బమ్మిడి శ్రీరామమూర్తి, యూటీఎఫ్‌ నాయకుడు 




Updated Date - 2022-08-17T04:38:15+05:30 IST