పడక కోసం పాట్లు

ABN , First Publish Date - 2021-05-08T05:00:40+05:30 IST

...నగరంలో ఉన్నతాధికారులు చేస్తే తప్ప ఇంకెవరు ఫోన్‌ చేసినా ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులకు నియమితులైన నోడల్‌ అధికారులు స్పందించడం లేదు.

పడక కోసం పాట్లు

ఫోన్లు ఎత్తని నోడల్‌ అధికారులు 

ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అదే సమస్య

ఖాళీ పడకల సమాచారం ఎక్కడ?...నివేదికలు ఏవీ?

అమలు కాని కలెక్టర్‌ ఆదేశాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


‘మేడమ్‌, నేను 47వ వార్డు కార్పొరేటర్‌ కంటిపాము కామేశ్వరిని. నగరంలోని ఆస్పత్రుల నోడల్‌ అధికారులు సరిగ్గా పనిచేయడం లేదు. ఫోన్‌ చేస్తే కనీసం తీయడం లేదు. ఇది కరెక్ట్‌ కాదు.’

- జీవీఎంసీ మేయర్‌ను, కమిషనర్‌ని ఉద్దేశించి వాట్సాప్‌ గ్రూపులో శుక్రవారం ఆమె పెట్టిన మెసేజ్‌ ఇది.


...నగరంలో ఉన్నతాధికారులు చేస్తే తప్ప ఇంకెవరు ఫోన్‌ చేసినా ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులకు నియమితులైన నోడల్‌ అధికారులు స్పందించడం లేదు. కరోనా సమయంలో ఆయా ఆస్పత్రుల్లో పడకలు, వసతులు, వైద్యం తదితర అంశాలన్నింటినీ సమన్వయం చేసుకునేందుకు వివిధ శాఖల అధికారులను నోడల్‌ అధికారులుగా నియమించారు. వారి పేర్లు, హోదాలు, ఆస్పత్రులు, వారి మొబైల్‌ నంబర్లను మీడియాకు ఇచ్చారు. ఏ ఆస్పత్రి సమస్య అయితే ఆ నోడల్‌ అధికారికి ఫోన్‌ చేయాలని పేర్కొన్నారు. అయితే గత ఐదారు రోజులుగా ఏ నోడల్‌ అధికారి ఫోన్లకు స్పందించడం లేదు. అన్ని ఆస్పత్రుల్లో పడకలు నిండిపోయాయి. దాంతో కొత్తగా రోగులకు బెడ్లు ఇవ్వలేకపోతున్నారు. ఒకటి, రెండు ఖాళీ అయితే అవి రాజకీయ సిఫారసు తెచ్చుకున్న వారికే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నోడల్‌ అధికారులు ఫోన్లకు స్పందించడం మానేశారు.  


పడకల వివరాలు ఏవీ?


ఆస్పత్రులకు రోగులు వెళుతుంటే..పడకలు ఖాళీ లేవని చెప్పి పంపేస్తున్నారు. డబ్బులు కడతామన్నా పడకలు ఇవ్వడం లేదు. ఆన్‌లైన్‌లో మాత్రం పడకలు ఖాళీగా వున్నాయని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌..ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి, ప్రతి రోజూ ఉదయాన్నే అన్ని ఆస్పత్రులు తనిఖీ చేసి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని పడకలు వున్నాయో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ ప్రకారం 104 కంట్రోల్‌ రూమ్‌ నుంచి పడకలు కేటాయించవచ్చునని భావించారు. ఈ ఆదేశాలు ఇచ్చి నాలుగు రోజులైంది. ఒక్క రోజు కూడా ఈ బృందాలు తనిఖీలకు వెళ్లలేదు. నివేదికలు ఇవ్వలేదు. దాంతో సామాన్యులకు ఆస్పత్రుల్లో పడకలు అందడం లేదు. ఫోన్‌ చేసిన మూడు గంటల్లో పడక కేటాయించాలని సీఎం జగన్‌ చెబుతున్నారు. ఇక్కడ మూడు రోజులు అడిగి అడిగి ప్రాణం పోతున్నదే తప్ప పడక ఇవ్వడం లేదు. 


కొత్తగా 1,978 కరోనా కేసులు


విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా 1,978 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 93,620కు చేరింది. ఇందులో 76,395 మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే 1,202 మంది రికవరీ అయ్యారు. కాగా చికిత్స పొందుతూ మరో పది మంది మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో  కొవిడ్‌ మరణాలు 676కు చేరాయి. 


నేడు పలు కేంద్రాల్లో కొవాగ్జిన్‌ సెడండ్‌ డోసు


విశాఖపట్నం, మే 7: నగరంలోని పలు కేంద్రాల్లో శనివారం కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు వేయనున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్య శాశాధికారి తెలిపారు. గాజువాక పీహెచ్‌సీ, పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం, మధురవాడ పీహెచ్‌సీ, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం, చినవాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రం, స్వర్ణభారతి పట్టణ ఆరోగ్య కేంద్రం, అరిలోవ ఆరోగ్య కేంద్రం, శ్రీహరిపురం ఆరోగ్య కేంద్రం, కేజీహెచ్‌లలో కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్టు వెల్లడించారు. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండో డోసు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T05:00:40+05:30 IST