ఇంటర్నెట్ డెస్క్: తలచుకుంటే జీవితంలో సాధించలేనిది ఏదీ ఉండదని అమెరికాకు చెందిన జియాన్ క్లార్క్ మరోసారి నిరూపించాడు. కాళ్లు లేకపోయిన తన సత్తా ఎంటో ప్రపంచానికి చాటిచెప్పి, వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా మరోరికార్డును నెలకొల్పేందుకు సిద్ధం అవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన 23ఏళ్ల జియాన్ క్లార్క్.. తల్లి గర్భంలో ఉండగానే కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్ బారినపడ్డాడు. దీంతో కాళ్లు లేకుండానే జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆటలపై ఆసక్తి పెంచుకున్న జియాన్ క్లార్క్.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. తన వైకల్యాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. కాళ్లు లేవని బాధపడుతూ కూర్చోకుండా.. కఠోరంగా శ్రమించారు. 2021 ఫిబ్రవరిలో కేవలం 4.78సెకండ్లలోనే చేతులపై 20మీటర్ల నడక పూర్తి చేసి, రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ఈ విషయాన్ని తన అధికారిక ఇన్స్ట్రాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించిన జియాన్ క్లార్క్.. మరో వరల్డ్ రికార్డు కోసం ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు వెల్లడించారు.