అనిల్ లిస్టెడ్ కంపెనీల్లో విచిత్ర పరిస్థితి...

ABN , First Publish Date - 2021-12-02T23:45:43+05:30 IST

అనిల్ అంబానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి... ప్రమోటర్లు దూరంగా జరుగుతుంటే... హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం షేర్ల కోసం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

అనిల్ లిస్టెడ్ కంపెనీల్లో విచిత్ర పరిస్థితి...

ముంబై : అనిల్ అంబానీ గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి... ప్రమోటర్లు దూరంగా జరుగుతుంటే... హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం షేర్ల కోసం ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. షేర్లను తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న కంపెనీ ప్రమోటర్లు(అనిల్ అంబానీ కుటుంబం‌), ఆ అప్పులను తీర్చలేక డిఫాల్ట్‌ కావడంతో, లెండర్స్‌ ఆ షేర్లను అమ్మేస్తున్నాయి. హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటిని కొంటున్నారు. కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. ఈ క్రమంలో... ప్రమోటర్ల వాటా క్రమంగా తగ్గుతుంటే, హెచ్‌ఎన్‌ఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా పెరుగుతోంది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(ఆర్‌ఐఎన్‌ఫ్రా) లో ప్రమోటర్ వాటా 2018 మార్చిలోని 48.4 శాతం నుంచి ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి ఐదు శాతానికి పడిపోయింది. అనుబంధ సంస్థ రిలయన్స్ పవర్‌లో ఆర్‌ఐఎన్‌ఫ్రా స్టేక్‌, అదే సమయంలో 75 శాతం నుంచి 25 శాతానికి జారిపోయింది. షేర్ల ప్రాధాన్యతా కేటాయింపుల ద్వారా కే, 550 కోట్లను ఆర్‌ఐఎన్‌ఫ్రాలోకి తీసుకొచ్చేందుకు అనిల్ అంబానీ కుటుంబం అంగీకరించింది. ఈ క్రమంలో... కంపెనీలో వారి వాటా 25 శాతానికి పెరుగుతుంది.

వారెంట్లు కన్వర్ట్‌ అయిన తర్వాత, రిలయన్స్ పవర్‌లో ఆర్‌ఐఎన్‌ఫ్రా వాటా 38 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుతం, రిటైల్ ఇన్వెస్టర్లు, హెచ్‌ఎన్‌ఐల వద్ద 72 శాతం వాటా ఉన్నట్లు డేటా వెల్లడిస్తోంది. రిలయన్స్ క్యాపిటల్‌లో ప్రమోటర్ వాటా 2018 మార్చి నాటి 52 శాతం నుంచి 2021-22 ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి 1.5 శాతానికి పడిపోయింది. పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల దగ్గర 85 శాతం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలి చర్య కారణంగా వారంతా నష్టపోయారు. కాగా... దివాలా ఎదుర్కొంటున్న మరో రెండు కంపెనీలు రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్ కాం), రిలయన్స్ నావల్‌(ఆర్ నావల్) ఆర్థిక పరిస్థితిలాగే, వీటిలో ప్రమోటర్ వాటా కూడా క్షీణిస్తోంది. 

Updated Date - 2021-12-02T23:45:43+05:30 IST