భిన్నంగా ఫార్మెటివ్‌

ABN , First Publish Date - 2021-10-24T05:10:06+05:30 IST

ఫార్మెటివ్‌-1(క్వార్టయర్లీ) పరీక్షలు పబ్లిక్‌ పరీక్షలను తలదన్నేలా నిర్వహిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు జరుగుతున్న ఈ పరీక్షల ప్రశ్నపత్రం గంట ముందు మాత్రమే విడుదల చేస్తున్నారు. అది కూడా ప్రధానోపాధ్యాయుని మెయిల్‌కు వేస్తే దానిని నెట్‌ సెంటర్ల వద్ద డౌన్‌లోడ్‌ చేసి జిరాక్స్‌ సెంటర్ల వద్ద కాపీలు తీయిస్తున్నారు.

భిన్నంగా ఫార్మెటివ్‌
పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

పబ్లిక్‌ పరీక్షలను తలపిస్తున్న వైనం

గంట ముందుగా ప్రశ్న పత్రం విడుదల

విస్తుపోతున్న ఉపాధ్యాయులు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

ఫార్మెటివ్‌-1(క్వార్టయర్లీ) పరీక్షలు పబ్లిక్‌ పరీక్షలను తలదన్నేలా నిర్వహిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు జరుగుతున్న ఈ పరీక్షల ప్రశ్నపత్రం గంట ముందు మాత్రమే విడుదల చేస్తున్నారు. అది కూడా ప్రధానోపాధ్యాయుని మెయిల్‌కు వేస్తే దానిని నెట్‌ సెంటర్ల వద్ద డౌన్‌లోడ్‌ చేసి జిరాక్స్‌ సెంటర్ల వద్ద కాపీలు తీయిస్తున్నారు. పరీక్ష సమయానికి గంట ముందు మాత్రమే ప్రశ్నపత్రం విడుదల చేసి పరుగెత్తించడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఇదేం తీరని సంఘాలు విమర్శిస్తున్నాయి. పబ్లిక్‌ పరీక్షలకు కూడా లేని విధానం తెచ్చారని వాపోతున్నాయి. పదో తరగతి, ఇంటర్‌ వంటి పబ్లిక్‌ పరీక్షల విషయంలో ప్రశ్న పత్రాలు మండల కేంద్రాలకు ముందుగానే చేరుకుంటాయి. వీటిని ట్రంకు పెట్టెల్లో ఉంచి సీళ్లు వేసి పోలీస్‌స్టేషన్ల వద్ద భద్రపరుస్తారు. పరీక్షల టైం టేబుల్‌ ప్రకారం ఆయా తేదీల్లో జరిగే ప్రశ్న పత్రాలను ఉన్నతాధికారుల సమక్షంలో సీళ్లు తెరిచి ప్రశ్నపత్రాలు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఫార్మెటివ్‌-1 పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రం హెచ్‌ఎం మెయిల్‌కు గంట ముందు వస్తోంది. జిరాక్సులు తీసుకొచ్చేందుకు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. ఈనెల 25వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. కనీసం మూడు గంటల ముందు ప్రశ్నపత్రం అందిస్తే డౌన్‌లోడ్‌ చేయటం.. జిరాక్సులు తీయించడం వంటి పనులు సులువు అవుతాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాలు స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగం నుంచి విడుదలవుతున్నాయి. ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ స్లిప్‌ టెస్టులుగా పిలిచే ఈ పరీక్షల కోసం ఇంత హడావిడి చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు.



Updated Date - 2021-10-24T05:10:06+05:30 IST