కమిషనర్‌, పాలకవర్గం మధ్య విభేదాలు

ABN , First Publish Date - 2022-08-20T03:35:54+05:30 IST

చెన్నూరు మున్సిపాలిటీలో నాలుగేళ్ళలో ఆరుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు. పాలకవర్గం, కమిషనర్ల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెగ్యులర్‌ కమిషనర్‌ అయినా, ఇన్‌చార్జి అయినా ఏడాదిలోపే వెనుదిరిగి పోతున్నారు. మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు కాగా ఇప్పటి వరకు ఆరుగురు కమిషనర్లు మారడం, ప్రస్తుత కమిషనర్‌ సెలవుపై వెళ్లడమే ఇందుకు నిదర్శనం.

కమిషనర్‌, పాలకవర్గం మధ్య విభేదాలు

సెలవులపై వెళ్లిన ప్రస్తుత కమిషనర్‌ 

చెన్నూర్‌ మున్సిపల్‌ తీరు  

చెన్నూరు, ఆగస్టు 19: చెన్నూరు మున్సిపాలిటీలో నాలుగేళ్ళలో ఆరుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు. పాలకవర్గం, కమిషనర్ల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెగ్యులర్‌ కమిషనర్‌ అయినా, ఇన్‌చార్జి అయినా ఏడాదిలోపే వెనుదిరిగి పోతున్నారు. మున్సిపాలిటీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు కాగా ఇప్పటి వరకు ఆరుగురు కమిషనర్లు మారడం, ప్రస్తుత కమిషనర్‌ సెలవుపై వెళ్లడమే ఇందుకు నిదర్శనం. మొదటి నుంచి కూడా మున్సిపల్‌ కమిషనర్‌లకు చెన్నూరు అచ్చి రావడం లేదు. అధికారులు, పాలకవర్గాల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణం కాగా కొందరు అవినీతిలో మరికొందరు రాజకీయ ఒత్తిళ్లతో బదిలీ అవుతున్న ఘటనలు ఉన్నాయి. ఏ కమిషనర్‌ వచ్చినా రెండు నెలల్లోనే సమన్వయ లోపం తలెత్తడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొంటున్నారు. మరో వైపు వాటాల పంపిణీలో ఎవరిది వారే పై చేయి అని పట్టు బిగిస్తుండడంతో కమిషనర్‌లకు స్ధాన చలనం జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

ఆది నుంచి ఇదే తంతు 

చెన్నూరు గ్రామపంచాయతీని 2018 ఆగస్టు 2న ప్రభుత్వం మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసింది. అప్పటి తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను కొత్త మున్సిపాలిటీకి ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న మూడు నెలలలోపే  అక్టోబర్‌ 30న బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన శంకర్‌ అక్టోబర్‌ 31న ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన సైతం మూడు నెలలకే 2019 జనవరి 31న బదిలీపై వెళ్లారు. ఇక 2019 ఫిబ్రవరి 1న మొదటి రెగ్యులర్‌ కమిషనర్‌గా వెంకటేష్‌ను ప్రభుత్వం నియమించింది. ఈయన 8 నెలలు పనిచేసి అక్టోబర్‌ 2న బదిలీ అయ్యారు. అక్టోబర్‌ 3న మందమర్రి మున్సిపల్‌ కమిషనర్‌ కుడికాల బాపు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టగా డిసెంబర్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయడం, 2020 జనవరిలో ఎన్నికలు, అదే నెల 27న నూతన పాలకవర్గం కొలువుదీరింది. 

పాలకవర్గం, అధికారుల మధ్య విభేదాలు

పాలక వర్గం, అధికారులకు మధ్య విభేదాలు పొడచూపాయి. పాలకవర్గం కొలువుదీరిన నాటికి కమిషనర్‌గా ఉన్న బాపు ఆరు నెలల్లోనే జూలై 10న కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు. హైద్రాబాద్‌ జీడిమెట్ల మున్సిపాలిటీ మేనేజర్‌గా విధులు నిర్వర్తించిన రమేష్‌ చెన్నూరు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఐదు నెలలు పనిచేసిన ఈయన డిసెంబర్‌ 17న బదిలీ అయ్యారు. ఆయన తర్వాత ఖాజామొహిజొద్దీన్‌ నియమితులయ్యారు. ఈయనకు పాలకవర్గం మధ్య బేధాభిప్రాయాలతో పాటు తైబజార్‌ వేలం విషయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మధ్య గొడవలు చెలరేగాయి. కౌన్సిల్‌ సమావేశంలోనే కమిషనర్‌పై చైర్‌పర్సన్‌ చేయి చేసుకున్నారు. అంతేకాకుండా రాజకీయ నేపథ్యంలో కమిషనర్‌ను బదిలీ చేయకుండా దీర్ఘకాలిక సెలవులపై పంపించారు. సెలవులపై వెళ్లిన ఆయన తిరిగి ఇక్కడకు రావడం అనుమానంగానే ఉంది. కమిషనర్‌ సెలవులో వెళ్లడంతో తహసీల్దార్‌ శ్రీనివాస్‌దేశ్‌పాండేను ప్రస్తుత ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఇక ఈయన ఏ మేరకు ఎంత కాలం ఈ పదవిలో ఉంటారో వేచి చూడాల్సిందే. 

కుంటు పడుతున్న అభివృద్ధి..

అధికారులు, పాలకవర్గాల మధ్య సమన్వయ లోపం తలెత్తడం, తరుచూ కమిషనర్లు బదిలీ కావడంతో అభివృద్ధిపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అభివృద్ధి కోసం లక్షలాది రూపాయల నిధులు విడదలవుతున్నా పనుల్లో వేగం పుంజుకోవడం లేదు. మున్సిపాలిటీపై కమిషనర్లు పట్టు సాధించేలోపే బదిలీ కావడం, తరుచూ ఇన్‌చార్జిలతో నెట్టుకొస్తుండడంతో అవినీతి, అక్రమాలకు అంతు లేకుండా పోతుందనే మాటలు వినిపిస్తున్నాయి.   

Updated Date - 2022-08-20T03:35:54+05:30 IST