రష్యా-ఉక్రెయిన్ యుద్ధం : భిన్నాభిప్రాయాలతో పోట్లాడుకుంటున్న రష్యన్లు

ABN , First Publish Date - 2022-03-09T22:44:55+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాలో కుటుంబ సభ్యుల

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం : భిన్నాభిప్రాయాలతో పోట్లాడుకుంటున్న రష్యన్లు

మాస్కో : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాలో కుటుంబ సభ్యుల మధ్య తార స్థాయిలో జగడాలు జరుగుతున్నాయి. తల్లీబిడ్డలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, గట్టిగా పోట్లాడుకుంటున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకించేవారిని దేశ ద్రోహులంటూ సొంత కుటుంబీకులే విమర్శిస్తున్నారు. దీనికి మంచి ఉదాహరణ రష్యన్ యాక్టర్ జీన్-మైఖేల్ షెర్బక్ కుటుంబమే. 


షెర్బక్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో ఆయన తల్లి ఆయనను దేశ ద్రోహి, విశ్వాసఘాతకుడు అని విమర్శించారు. మాస్కో నుంచి వేరే ప్రాంతానికి ఓ వారం పాటు వెళ్తున్నానని ఆయన తన తల్లికి చెప్పి, కొంత సొమ్మును పంపించారు. ఈ సొమ్మును ఆమె తిరస్కరించారు. మాతృ దేశానికి విశ్వాసఘాతకులతో తాను మాట్లాడనని ఆమె తెగేసి చెప్పారు. ఈ వివరాలను ఆయన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. 


యెకటెరిన్‌బర్గ్ నగరవాసి డారియా కూడా తన తల్లితో యుద్ధం విషయంలో తీవ్ర విభేదాలు వచ్చినట్లు తెలిపారు. తన తల్లితో యుద్ధం గురించి మాట్లాడబోనని, ఒకవేళ ఆ విషయం ఎప్పుడైనా వస్తే, తామిద్దరమూ ఒకరి కళ్ళలోకి మరొకరం చూసుకోబోమని చెప్పారు. తన తల్లి ప్రస్తుతం మానసికంగా భావోద్వేగంతో ఉన్నారని చెప్పారు. 


పోలండ్‌లో ఉంటున్న అలెక్స్ తల్లిదండ్రులు రష్యాలో నివసిస్తున్నారు. అలెక్స్ యుద్ధం గురించి అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. దీనిని ఆయన తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విధంగా పోస్ట్‌లను పెడితే, ఇబ్బందులు ఎదురవుతాయని, వెంటనే వాటిని తొలగించాలని ఆయనకు చెప్పారు. ప్రతి రోజూ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అయితే ఆయన, ఆయన తల్లి మధ్య తీవ్ర వాగ్వాదాలు, అరుపులు, కేకలు సాధారణమైపోయాయి. దీంతో ఆయన పోస్టులు పెట్టడం మానేశారు.


ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని 58 శాతం మంది రష్యన్లు సమర్థిస్తున్నారని, 23 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని అమెరికన్ మీడియా చెప్తోంది. అయితే రష్యా ప్రభుత్వ సంస్థ చెప్తున్నదాని ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో దేశాధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ అప్రూవల్ రేటింగ్ 6 శాతం పెరిగి, 70 శాతానికి చేరిందని చెప్తోంది. క్రెమ్లిన్‌కు పరిశోధన నివేదికలను అందజేసే FOM ఈ రేటింగ్ 7 శాతం పెరిగి, 71 శాతానికి చేరిందని చెప్తోంది. 


Updated Date - 2022-03-09T22:44:55+05:30 IST