కరోనా ఆడుకుంటోంది!

ABN , First Publish Date - 2020-06-04T09:12:45+05:30 IST

యూరప్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లు, క్రికెట్‌ బోర్డులు.. అది, ఇది అనే తేడా లేకుండా అన్ని క్రీడలపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆర్థికంగా స్థితిమంతులైన ...

కరోనా ఆడుకుంటోంది!

క్రీడాకారులకు డైట్‌ కరువు

కోచ్‌ల జీతాల్లో కోతలు

యూరప్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లు, క్రికెట్‌ బోర్డులు.. అది, ఇది అనే తేడా లేకుండా అన్ని క్రీడలపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఆర్థికంగా స్థితిమంతులైన ఆటగాళ్ల సంగతి పక్కనబెడితే.. దేశంలోని పేద క్రీడాకారులు కరోనా ధాటికి కకావికలమవుతున్నారు. వరల్డ్‌ యూనివర్సిటీ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిఽథ్యం వహించిన అథ్లెట్‌ ప్రజక్త గోడ్‌బోలె తినడానికి తిండిలేని దయనీయ స్థితిలో ఉన్న విషయాన్ని ఈ మధ్యనే చదివాం. తెలుగు రాష్ర్టాల్లోనూ అలాంటి అథ్లెట్లు, కోచ్‌లూ ఎందరో ఉన్నారు. రోజుకూలీతో, పండ్లు, కూరగాయల విక్రయాలతో పొట్ట నింపుకొనే నిరుపేద కుటుంబాల్లో పుట్టిన క్రీడా కుసుమాలు ప్రస్తుత పరిణామాలతో తమ కెరీర్‌ ఏమవుతుందనే ఆందోళనతో వాడిపోతున్నాయి.  


(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

కొవిడ్‌ మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయ్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా), శాప్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌), శాట్స్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ) ఆధీనంలో నడిచే అన్ని స్పోర్ట్స్‌ అకాడమీలు, రీజినల్‌ సెంటర్లు, క్రీడా పాఠశాలలు మూతపడ్డాయి. క్రీడల పునరుద్ధరణ అంటూ ఇటీవలే సర్కారు ప్రకటించినా.. అవి ఇంకా తెరచుకోనేలేదు. ఫలితంగా ఈ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న దాదాపు మూడు వేల మంది నిరుపేద క్రీడాకారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వీరిలో ఖమ్మం, ఆదిలాబాద్‌, శ్రీకాకుళం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల వారే అధికం. ప్రాక్టీస్‌ విషయం పక్కనపెడితే పౌష్టికాహారం (సరైన డైట్‌) లేక వీరు బక్కచిక్కుతున్నారు. అద్భుత ప్రతిభతో తమ బిడ్డలు సాధించిన విజయాలు, అందుకున్న పతకాలు చూసి గర్వించిన క్రీడాకారుల తల్లిదండ్రులు ప్రస్తుత దుర్భర పరిస్థితులను చూసి మనోవేదన చెందుతున్నారు. పరిస్థితులు ఎన్నటికి చక్కబడతాయో, క్రీడా పోటీలు ఎప్పుడు మొదలవుతాయో, టోర్నీలు జరిగినా తమ పిల్లలు గతంలో మాదిరి రాణిస్తారో లేదోనని ఆందోళనపడుతున్నారు. శిక్షణా కేంద్రాలు డైట్‌ చార్జీలు ఇచ్చి క్రీడాకారులను ఆదుకుంటే బాగుండన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


దయనీయం.. కాంట్రాక్టు కోచ్‌ల జీవితం 

జాతీయ, అంతర్జాతీయ అథ్లెట్లను తీర్చిదిద్దిన కోచ్‌లు వారు. ఆ కోచ్‌లు తయారు చేసిన క్రీడాకారులు పతకాలు సాధిస్తే ప్రభుత్వాలు ఆ ప్లేయర్లకు లక్షల రూపాయల నజరానాలు ప్రకటిస్తాయి. కానీ, కోచ్‌లను మాత్రం పట్టించుకోరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989 వరకు ఎన్‌ఐఎ్‌స (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌) సర్టిఫైడ్‌ కోచ్‌లకు మూడేళ్ల సర్వీస్‌ ఉంటే వారి పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించేవారు. పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ విధానంతో ఉమ్మడి రాష్ట్రంలో 1993లో సుమారు 45 మందిని, 1999లో 30 మందిని కోచ్‌లుగా నియమించారు. కానీ వారి సర్వీసును క్రమబద్ధీకరించలేదు. దాంతో ఇప్పటికీ వారు చాలీచాలని జీతాలతో బతుకుబండి లాగిస్తున్నారు. ఢిల్లీ, హరియాణా, యూపీ, మహారాష్ట్రలో సర్వీస్‌ రెగ్యులరైజ్‌ అయిన కోచ్‌లు రూ. లక్షకు పైగా వేతనం తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కోచ్‌ల సర్వీ్‌స క్రమబద్ధీకరణ ఊసే లేకపోవడంతో కాంట్రాక్టు కోచ్‌లుగా అరకొర వేతనాలతోనే సరిపెట్టుకుంటున్నారు. 2008 నుంచి ఇంక్రిమెంట్లు లేవు. పదవీ విరమణ చేసిన కోచ్‌ల స్థానంలో కొత్తవారిని నియమించడం లేదు. ఫలితంగా క్రీడాకారులు, కోచ్‌ల నిష్పత్తిలో వ్యత్యాసం పెరిగి శిక్షకులపై పని ఒత్తిడి పెరిగింది. అయినా అంకితభావంతో పనిచేస్తుండగా.. కరోనా పేరిట వారి జీతాల్లో పదిశాతం కోత విధించారు.


సరైన తిండి లేదు..

రెండేళ్ల కిందట సాయ్‌ హాస్టల్‌లో చేరా. అక్కడ మంచి డైట్‌ అందిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇంటికొచ్చేశా. కూలీకెళ్లే అమ్మానాన్నలకు పనులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. సరైన తిండిలేదు. సాధన చేయడానికి శక్తి ఉండడం లేదు. 

              - అథ్లెట్‌ మద్దిలి సుప్రియ (నెల్లూరు) 

                 ఖేలో ఇండియా పతక విజేత


ప్రమాదంలో ‘కోచింగ్‌’!

కోచింగ్‌ మీద ఆసక్తి, అనురక్తితో దీన్ని కెరీర్‌గా ఎంచుకున్నాం. మేము క్రీడాకారులుగా ఉన్నప్పుడు వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అయితే కోచింగ్‌పై మక్కువతో నాతోపాటు పలువురు ఆ ఉద్యోగాలను వదులుకున్నారు. రెగ్యులరైజ్‌ చేస్తారని ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. రెగ్యులర్‌ కోచ్‌లకున్న అన్ని రాయితీలు వర్తిస్తాయని  2008లో అప్పటి శాప్‌ అధికారులు చెప్పారు. కానీ ఆ హామీ ఆచరణలోకి రాలేదు. లాక్‌డౌన్‌తో మా పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రభుత్వం మా సేవలను గుర్తించి క్రమబద్ధీకరించాలని అభ్యర్థిస్తున్నాం.    - నందకిశోర్‌ గోకుల్‌

 (తెలంగాణ కాంట్రాక్టు కోచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శి)


ఎవరైనా ఆదుకోవాలి

లాక్‌డౌన్‌తో మా (హకీంపేట) స్పోర్ట్స్‌ స్కూల్‌ మూతపడింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఇంటికొచ్చాక సరైన డైట్‌ తీసుకోలేపోతున్నా. దాతలు ఆదుకోవాలి.

- రాచమల్ల అశ్విని (నాగర్‌ కర్నూల్‌) జాతీయ సెయిలింగ్‌ క్రీడాకారిణి

Updated Date - 2020-06-04T09:12:45+05:30 IST