Abn logo
Sep 26 2021 @ 00:52AM

డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

షీలానగర్‌-డాక్‌యార్డు రహదారిలో బోల్తాపడిన డీజిల్‌ ట్యాంకర్‌

అక్కిరెడ్డిపాలెం, సెప్టెంబరు 25: షీలానగర్‌-డాక్‌యార్డు రహదారిలో శనివారం మధ్యాహ్నం హెచ్‌పీసీఎల్‌కు చెందిన డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడగా, కొంతమేర డీజిల్‌ నేలపాలైంది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి..హెచ్‌పీసీఎల్‌ టెర్మినల్‌ నుంచి 24 వేల లీటర్ల డీజిల్‌ను లోడ్‌ చేసుకుని విజయనగరం వెళ్లేందుకు డ్రైవర్‌ శ్రీనివాస్‌ షీలానగర్‌-డాక్‌యార్దు రహదారిలో వస్తుండగా,  టోల్‌ గేటు సమీపంలోకి వచ్చేసరికి ట్యాంకర్‌ అదుపుతప్పింది. దీంతో రహదారి పక్కన వున్న చెట్లను ఢీకొని గోతిలో బోల్తా పడింది. డ్రైవర్‌ శ్రీనివాస్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రహదారిపై రసాయనాలు ఉండడంతో ట్యాంకర్‌ స్కిడ్‌ అయినట్టు భావిస్తున్నారు. 

కాగా, ట్యాంకర్‌లో డీజిల్‌ ఉన్నట్టు తెలుసుకున్న గాజువాక పోలీసులు, హెచ్‌పీసీఎల్‌ అదికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలికి సమీపంలోనే గెయిల్‌కు చెందిన గ్యాస్‌ పైప్‌లైన్‌ వుండడంతో ఆ సంస్థ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. పెదగంట్యాడ అగ్నిమాపక శకటంతోపాటు హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ సంస్థలకు చెందిన శకటాలు ప్రమాద స్థలికి వచ్చాయి. డీజిల్‌ కారణంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా అగ్నిమాపక అధికారి వెంకటరావు ఆధ్వర్యంలో సిబ్బంది  ముందస్తు చర్యలు చేపట్టారు. బోల్తాపడిన ట్యాంకర్‌లోని డీజిల్‌ను మరో ట్యాంకర్‌లోకి మార్చేందుకు సిబ్బంది తొలుత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో మూడు భారీ క్రేన్‌లు తీసుకువచ్చి  వాటి సహాయంతో ట్యాంకర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. ట్యాంకర్‌లో  మిగిలిన డీజిల్‌ను వేరొక ట్యాంకర్‌లోకి తరలించడంతో అదికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో   సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గాజువాక ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించారు.

జాగ్రత్తలు పాటించకుండా రసాయనాల రవాణా

డాక్‌యార్డు నుంచి షీలానగర్‌ వరకు గల ఈ రహదారిలో  జిప్సమ్‌ వంటి రసాయనాలతో పాటు గోధుమలు, మొక్కజొన్నలు వంటి  ఆహార పదార్థాలు నిల్వ చేసే గొడౌన్‌లు అనేకం వున్నాయి. విదేశాల నుంచి షిప్‌ల ద్వారా దిగుమతైన ఈ సరకు పోర్టు నుంచి లారీలు, ట్రక్కుల ద్వారా గొడౌన్‌లకు చేరుస్తుంటారు. రవాణా సమయంలో లారీల సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో అవి రహదారిపై పడుతున్నాయి. ఇవి ఏమాత్రం తడిసినా, వాటిమీదుగా వెళ్లే వాహనాలు స్కిడ్‌ అవుతున్నాయి.