రవాణా సంస్థపై రోజుకు రూ 2.17 కోట్ల అదనపు భారం

ABN , First Publish Date - 2022-03-23T19:05:31+05:30 IST

డీజిల్‌ రీటైల్‌ ధర పెరగడంతో కొవిడ్‌ తర్వాత అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఈ భారం ప్రత్యక్షంగా ప్రజలపై కూడా

రవాణా సంస్థపై రోజుకు రూ 2.17 కోట్ల అదనపు భారం

బెంగళూరు: డీజిల్‌ రీటైల్‌ ధర పెరగడంతో కొవిడ్‌ తర్వాత అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై మరింత ఆర్థిక భారం పడనుంది. ఈ భారం ప్రత్యక్షంగా ప్రజలపై కూడా పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు సోమవారం మీడియాతో మాట్లాడుతూ డీజిల్‌ ధరల పెరుగుదల కారణంగా రవాణా సంస్థపై ప్రతిరోజూ సుమారు రూ. 2.17 కోట్ల మేర అదనపు భారం పడనుందని చెప్పారు. ప్రస్తుతం ప్రతిరోజూ కేఎస్ ఆర్టీసీ  5.30 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుండగా, బీఎంటీసీ 2.06 లక్షల లీటర్లు, నార్త్‌ వెస్ట్‌ కేఎస్ఆర్టీసీ 2.82 లక్షల లీటర్లు, కల్యాణ కర్ణాటక ఆర్టీసీ 2.50 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. కేఎస్ ఆర్టీసీకి ప్రతిరోజూ వచ్చే ఆదాయం సుమారు రూ.7 కోట్లు కాగా అందులో రూ. 5 కోట్ల వరకు డీజిల్‌కే ఖర్చవుతోంది. తాజాగా డీజిల్‌ ధరలు పెరగడంతో అదనంగా ప్రతిరోజూ మరో రూ.86.60 లక్షల వరకు భారం పడనుంది. ఇక బీఎంటీసీ ఆదాయం ప్రతిరోజూ రూ.3.10 కోట్లు కాగా అందులో డీజిల్‌కే రోజూ రూ. 2.10 కోట్లను ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. తాజాగా బీఎంటీసీపై డీజిల్‌ రూపంలో అదనంగా రోజూ రూ.35 లక్షల వరకు భారం పడనుంది. ఇక నార్త్‌ఈస్ట్‌ ఆర్టీసీపై ప్రతిరోజూ రూ. 48.97 లక్షలు, కల్యాణ కర్ణాటక ఆర్టీసీపై రోజూ రూ. 43.41 లక్షలు ఆదనపు భారం పడనుంది. ఈ భారాన్ని తట్టుకుని నిలబడగలగాలంటే ఆర్టీసీ, బీఎంటీసీ టికెట్‌ చార్జీల పెంపు ఒక్కటే మార్గమని అధికారులు అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన చేయాలని మొత్తం నాలుగు ప్రభుత్వ రవాణా సంస్థలు కూడా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Updated Date - 2022-03-23T19:05:31+05:30 IST