ఇంధన మాయ

ABN , First Publish Date - 2021-06-21T05:25:55+05:30 IST

ఇంధన మాయ

ఇంధన మాయ

రైల్వే బ్రేక్‌డౌన్‌ విభాగంలో డీజిల్‌ పక్కదారి 

విజిలెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు ఫిర్యాదులు, రహస్య విచారణ

డివిజన్‌లో ఇద్దరు సూపర్‌వైజర్లపై ఆరోపణలు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : రైల్వేలో ఇంటి దొంగల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. బ్రేక్‌డౌన్‌ విభాగంలో డీజిల్‌ను భారీగా పక్కదారి పట్టించి సొమ్ము చే సుకున్న ఉదంతంపై విజిలెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు ఫిర్యాదులు వెళ్లటంతో డొంక కదులుతోంది. రహస్యంగా విచారణ జరిపిన అధికారులు బాధ్యులను గుర్తించినట్టుగా తెలుస్తోంది. విజయవాడ డివిజన్‌లోని సంబంధిత విభాగంతో ముడిపడి ఉన్న ఇద్దరు సూపర్‌వైజర్ల పాత్రపై విజిలెన్స్‌ దృష్టిసారించి విచారణ సాగించింది. దీంతో దీర్ఘకాలంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో ఎన్ని కోట్ల రూపాయల స్కామ్‌ జరిగిందన్నది వెలుగు చూడాల్సి ఉంది. కాగా, సికింద్రాబాద్‌ విజిలెన్స్‌ బృందం రహస్యంగా సాగించిన విచారణపై బెజవాడ డివిజన్‌ విజిలెన్స్‌ అధికారులు మౌనంగా ఉండటం సందేహాలకు తావిస్తోంది.  

ఆది నుంచీ ఆరోపణలే..

రైల్వేలో కీలకమైనది బ్రేక్‌డౌన్‌ విభాగం. రైలు ప్రమాదాలు సంభవించినపుడు ఈ విభాగం సేవలు ముఖ్యమైనవి. ఈ విభాగంలో ప్రత్యేకంగా ఆక్సిడెంట్‌ రిలీఫ్‌ వ్యాన్‌ (ఏఆర్‌వీ), మెడికల్‌ రిలీఫ్‌ వ్యాన్‌ (ఎంఆర్‌వీ) ఉంటాయి. ఇవి డీజిల్‌ ఇంజన్లతో నడుస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినా సంఘటనా స్థలానికి తేలిగ్గా చేరుకోవటానికి వీలుగా డీజిల్‌ ఇంజన్లనే ఉపయోగిస్తారు. ఈ రైళ్లకు మూడు నుంచి ఐదు భోగీలు ఉంటాయి. వీటిద్వారా ప్రమాద సమయంలో వెనువెంటనే సహాయ కార్యక్రమాలు చేపడతారు. మిగతా సమయంలో వీరికి పెద్దగా పనేమీ ఉండదు. కానీ, ఈ విభాగంలో చీకటి ఉదంతాలు రైల్వే వ్యవస్థకే మచ్చ తెస్తున్నాయి. డీజిల్‌ లోకో షెడ్‌ నుంచి ఏఆర్‌వీ, ఎంఆర్‌వీ రైళ్లకు వచ్చే డీజిల్‌ ఏమవుతుందనే దానిపై సరైన పర్యవేక్షణ లేదు. ప్రమాదాలతో సంబంధం లేకుండానే ఈ బ్రేక్‌డౌన్‌ విభాగానికి డీజిల్‌ను కేటాయిస్తున్నారు. అయితే, ఈ డీజిల్‌ వాస్తవ వినియోగానికి, లెక్కలకు తేడా ఉందని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై తాజాగా విజిలెన్స్‌ హెడ్‌ క్వార్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. 

మాక్‌డ్రిల్స్‌ పేరుతో మాయ

మాక్‌డ్రిల్స్‌ కోసం ఏఆర్‌ఎం, ఎంఆర్‌వీ రైళ్లను బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో డీజిల్‌ వినియోగం జరుగుతుంది. ఒకసారి మాక్‌డ్రిల్‌లో పాల్గొన్న తర్వాత చాలారోజులు ఖాళీగా ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తరుగు ముసుగులో ఇక్కడి సిబ్బంది వందల లీటర్లు పక ్కదారి పట్టించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే, మాక్‌డ్రిల్స్‌కు ఉపయోగించిన దానికంటే అదనంగా డీజిల్‌ లెక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రైలు ప్రమాదం జరిగినపుడు, ఏదైనా మాక్‌డ్రిల్‌కు వెళ్లినపుడు తమ వెంట ఐదు బేరల్స్‌ డీజిల్‌ను తీసుకెళ్తారు. ఎందుకంటే 140 టన్నుల బరువు కలిగిన క్రేన్‌ను నడపటానికి డీజిల్‌ అవసరం అవుతుంది. దీనికోసం తమ వెంట తప్పనిసరిగా ఐదు బేరల్స్‌ ఆయిల్‌ను తీసుకెళ్తారు. ఐదు బేరల్స్‌లో వెయ్యి లీటర్ల డీజిల్‌ను తీసుకెళ్తారు. ఇందులో కూడా భారీగానే డీజిల్‌ను పక్కదారి పట్టించారని తెలుస్తోంది. ఈ ఉదంతం కూడా విజిలెన్స్‌ దృష్టికి వెళ్లటంతో  రహస్యంగా విచారణ చేస్తున్నారు. అయితే, ఈ విచారణపై విజయవాడ విజిలెన్స్‌ విభాగం పెదవి విప్పట్లేదు. ఈ ఉదంతం అంతా ఇద్దరు సూపర్‌వైజర్ల చుట్టూ తిరుగుతోంది. దీర్ఘకాలంగా ఒకే సీటులో పాతుకుపోవటం వల్ల వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2021-06-21T05:25:55+05:30 IST