అయ్యా.. కనికరించండి!

ABN , First Publish Date - 2021-04-22T04:35:46+05:30 IST

వైద్యం చేయించుకుని వస్తున్న ఓ మహిళ హఠాత్తుగా ఆటోలోనే తుదిశ్వాస విడిచింది. ఆ సమయంలో మానవత్వం చూపించాల్సిన డ్రైవర్‌ రోడ్డుపైనే శవాన్ని వదిలేసి వెళ్లిపోయాడు.

అయ్యా..  కనికరించండి!
మనుబోలులో జాతీయరహదారిపై శవం పక్కన రోధిస్తున్న మహిళ

గుండెనొప్పితో ఆటోలో మృతి చెందిన మహిళ

హైవేపైనే వదిలి వెళ్లిపోయిన డ్రైవర్‌

దిక్కుతోచనిస్థితిలో సహకరించాలని మరో మహిళ వేడుకోలు

స్పందించిన 108 సిబ్బంది, కానిస్టేబుల్‌ 


మనుబోలు, ఏప్రిల్‌ 21 : వైద్యం చేయించుకుని వస్తున్న ఓ మహిళ హఠాత్తుగా ఆటోలోనే తుదిశ్వాస విడిచింది. ఆ సమయంలో మానవత్వం చూపించాల్సిన డ్రైవర్‌ రోడ్డుపైనే శవాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో దిక్కుతోచక మృతదేహం పక్కనే ఉన్న మరోమహిళ కనబడ్డవారినల్లా ‘‘కనికరించండయ్యా..’’ అంటూ ప్రాధేయపడింది. బాధితురాలి కథనం మేరకు.. గూడూరు మండలం వెందోడు గ్రామానికి చెందిన ఉప్పు సంపూర్ణమ్మ (50) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటోంది. ఈ క్రమంలో వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో డయాలసిస్‌ చేయించుకునేందుకు బస్సులో వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో గూడూరు వెళ్లేందుకు వెంకటాచలంలో ఆటో ఎక్కారు. మనుబోలు దగ్గర వచ్చే సరికి సంపూర్ణమ్మకు గుండెనొప్పి రాగా సెకన్ల వ్యవధిలోనే ఆటోలోనే ప్రాణాలు విడిచింది. ఇది తెలిసిన ఆటో డ్రైవర్‌ మానవత్వం కూడా లేకుండా సంపూర్ణమ్మను రోడ్డుపై దించేసి వెళ్ళిపోయాడు. సంపూర్ణమ్మకు తోడుగా వచ్చిన అక్క కూతురు పద్మ దిక్కుతోచని స్థితిలో రోదిస్తూ కనికరించండయ్యా అంటూ వచ్చి పోయే వారిని బతిమలాడసాగింది. దీంతో అటుగా వెళుతున్న చిల్లకూరు 108 ఈఎన్‌టీ కృష్ణ, కానిస్టేబుల్‌ రమేష్‌, బ్యాంకు ఉద్యోగి ప్రేమ్‌ కుమార్‌లు స్పందించి రోడ్డుపై ఉన్న సంపూర్ణమ్మ మృతదేహాన్ని ఎమ్పీడీవో కార్యాలయ ఆవరణలో బండపైకి చేర్చారు. పద్మను ఓదార్చి గూడూరు రూరల్‌ పోలీసుల ద్వారా బంధువులకు సమాచారం అందించారు. 

Updated Date - 2021-04-22T04:35:46+05:30 IST