‘పబ్జి’తో పనైపోలేదు

ABN , First Publish Date - 2020-09-05T04:56:15+05:30 IST

జాతీయ భద్రతా కారణాలతో కేంద్ర ప్రభుత్వం పబ్జి సహా 118 ఇతర అప్లికేషన్లని నిషేధించింది.

‘పబ్జి’తో పనైపోలేదు

వ్యసనాలకు   ఫుల్‌స్టాప్‌ ప్రధానం

‘‘హమ్మయ్య.. ‘పబ్జి’ పీడా పోయింది..’’ 

దేశవ్యాప్తంగా ఎంతో మంది తల్లిదండ్రుల స్పందన ఇది! 


జాతీయ భద్రతా కారణాలతో కేంద్ర ప్రభుత్వం పబ్జి సహా 118 ఇతర అప్లికేషన్లని నిషేధించింది. దరిమిలా యావత్తు దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. కొన్నేళ్లుగా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయని, తమకు వారికి మధ్య అగాథం పెరుగుతోందని, పబ్జిని నిషేధించాలని మొత్తుకుంటున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. డేటా విదేశాలకు తరలిపోతోంది, భద్రత కరువవుతోంది అన్న కారణాలతో ఎట్టకేలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ‘పబ్జి’ ఒక్క దానితో సమస్య తీరిపోతుందా, అసలు పిల్లలకు ఎలాంటి గేమ్స్‌ మెరుగైనవి అన్నది చూద్దాం.


పబ్జిని నిషేధించినంత మాత్రాన ఊపిరి పీల్చుకునే పరిస్థితి కాదు. ‘ఫ్రీఫైర్‌’ లాంటి హింసాత్మక గేమ్‌ప్లే కలిగిన గేమ్స్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది యువత వాటికి అలవాటుపడ్డారు కూడా! సహజంగానే  సదరు కంపెనీలు యువతకి నచ్చే హీరోయిజం లక్షణాలతో కూడిన వాతావరణం, పాత్రలతో గేమ్‌ స్వరూపాన్ని రూపొందిస్తూ ఉంటాయి.


సామాజిక ప్రయోజనాలు, నైతిక విలువలు వంటివి ఏవీ ఆ కంపెనీలకు పట్టవు. తాము రూపొందించిన ఆట ఎంత ఆదాయాన్ని సమకూరుస్తుంది, ఎంత ప్రాచుర్యం చెందింది అన్న లెక్కలు మాత్రమే వేసుకుంటూ ఉంటారు. ప్లాట్‌ఫాం నియమాలు అనుసరించాలి కాబట్టి, గూగుల్‌ ప్లేస్టోర్‌ వంటివాటిలో తమ గేములను హోస్ట్‌ చేసేటప్పుడు ఏ వయసు వారు ఆడటానికి వీలు పడుతుంది అన్నది ఒక రేటింగ్‌ ఇచ్చి ఊరుకుంటారు. అయితే దురదృష్టవశాత్తు దాదాపుగా అన్ని వయసుల వాళ్లు ఇలాంటి హింసాత్మక ప్రవృతిని ప్రేరేపించే ఆటలను ఇన్‌స్టాల్‌ చేసుకుని ఆడేస్తుంటారు.


సరిగ్గా ఈ కారణంతోనే ఇలాంటి గేమ్స్‌ ఆడే చాలామంది పిల్లలు, తమ తల్లిదండ్రులతో పరుషంగా మాట్లాడుతుంటారు. తల్లిదండ్రులను బెదిరించడం, కొన్నిసార్లు ఆత్మహత్యలకు వెనుకాడకపోవడం కూడా చూస్తున్నాం. మనిషి మెదడులోని కీలకమైన భాగాలు గ్రే మేటర్‌, వైట్‌ మేటర్‌ వంటివి అభివృద్ధి చెందే దశలో ఇలాంటి హింసాత్మక ఆటలు వారి వ్యక్తిత్వంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.




ఎలాంటి గేమ్స్‌ మంచివి?

చిన్నపిల్లలు మొదలుకుని అన్ని వయసుల వాళ్లు కాలక్షేపం కోసం గేమ్స్‌ ఆడటం ఈమధ్య సర్వసాధారణమైంది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ తరవాత ఇలా గేమ్స్‌ మీద గడిపే సమయం సగటున మూడు నుంచి ఏడు గంటలకు మనదేశంలో పెరిగింది. ఈ నేపథ్యంలో పబ్జి వంటి గేమ్స్‌కు దూరంగా ఉంచాలి. అదే సమయంలో  మెదడుకి పదును పెట్టే గేమ్‌లను పిల్లలకు అలవాటు చేయవచ్చు. పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా ఇలాంటి వాటి ద్వారా మెదడు పనితీరు మెరుగుపరచుకోవచ్చు.


ఉదాహరణకు గూగుల్‌ ప్లే స్టోర్‌లో బ్రెయిన్‌ గేమ్స్‌ అని వెదికితే చాలా వస్తుంటాయి. జ్ఞాపకశక్తి, కాగ్నిటివ్‌ స్కిల్స్‌, నిర్ణయాత్మక శక్తి, మెదడు చురుకుదనాన్ని ఇవి పెంచుతాయి. రోజు మొత్తంలో ఒక అరగంటకు మించకుండా సమయాన్ని  వీటిని ఆడవచ్చు. తద్వారా మెదడులో తగినంత న్యూరల్‌ యాక్టివిటీ ఏర్పడుతుంది. దాంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ‘‘లుమాసిటీ’’ అనేది అలాంటి గేమ్స్‌లో ఒకటి!


వీటితో పాటు స్ర్టాటజీ, పజిల్‌ గేమ్స్‌ లాంటివి కూడా మెదడుకి చాలా ఉపయోగకరం. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి గేమ్స్‌ అలవాటు చేయాలి. వాటిలో తగినంత స్కోర్‌ సాధిస్తే బహుమతులు ఇస్తామని ఆశపెట్టాలి.  అలాంటి గేమ్స్‌పై పిల్లలకు ఆసక్తి కనబరిచేలా వారి ఆలోచనలను చిన్నగా మళ్ళించాలి. 




అడిక్షన్‌ స్థాయి గుర్తించడం

సరదాగా కాసేపు గేమ్స్‌ ఆడుకోవడం ఫర్లేదు. అదే పనిగా గంటల తరబడి ఫోన్‌ చేతిలో పట్టుకొని వాటికి అతుక్కుపోవటం మాత్రం ఒక బలమైన వ్యసనానికి నిదర్శనం. రెండేళ్ల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ గేమింగ్‌ని వ్యసనంగా అభివర్ణించింది. 

 రోజు అరగంట లేదా గంట సేపు మంచి గేమ్స్‌ ఆడితే ‘గూగుల్‌ ఫ్యామిలీ లింక్‌’ వంటి పేరెంటల్‌ కంట్రోల్‌ అప్లికేషన్ల సహాయంతో పరిమితులు విధించవచ్చు. పిల్లలు ఏ గేమ్స్‌ ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు, వాటి ‘ఏజ్‌ రేటింగ్‌’, గేమ్‌ థీమ్‌ వంటి వాటిని తల్లిదండ్రులు  ఎప్పటిక్పుడు తెలుసుకోవాలి. అలాగే అవి పిల్లల వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవాలి. 

 మెదడులో డొపమిన్‌ అనే న్యూరోకెమికల్‌ కోసం ఏర్పడే ఆరాటం కారణంగా మళ్లీమళ్లీ మనసు అటు వైపే లాగుతుంది. ధూమపానం, మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన వారికి ఇలా గేమ్‌లకు అలవాటు పడినవాళ్ళ మానసిక పరిస్థితితో తేడా ఉండదు.


మెల్లమెల్లగా శారీరక వ్యాయామం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో నేరుగా గానీ వర్చ్యువల్‌గా గానీ కబుర్లు చెప్పుకోవడం లేదంటే యుడెమీ, లింక్డిన్‌ లెర్నింగ్‌ వంటి వాటిలో నచ్చిన కోర్సులలో చేరి కొత్త విషయాలు నేర్చుకునే వైపు మనసు మళ్లించడం వంటి పనుల ద్వారా గేమింగ్‌ అనే వ్యసనం నుంచి కొద్దికాలంలోనే విజయవంతంగా బయటపడవచ్చు. ఏదో సరదాగా గేమ్స్‌ ఆడుతున్నాం అనుకుంటారు తప్ప తాము గేమింగ్‌ వ్యసనంలో కూరుకుపోయామన్న స్పృహ చాలామందికి ఉండదు.


‘ఎందుకు అదే పనిగా గేమ్స్‌ ఆడతారు, మీరు అడిక్ట్‌ అవుతున్నారు’ అని మీ కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితుల్లో ఎవరినైనా  హెచ్చరిస్తే.. వారి నుంచి అతి సహజంగా వచ్చే సమాధానం, ‘ఏదో సరదాకి కాసేపే, నేనా అడిక్ట్‌ అవడమా’ అని నవ్వేస్తారు. ఇది అన్ని చోట్లా జరిగే తంతే. ఒక వ్యసనపరుడు తాను అందులో కూరుకుపోయాను అన్న స్పృహని కోల్పోవడమే దాని అసలు లక్షణం. కచ్చితంగా ఇలాంటి గేమ్స్‌ని విడిచి ఉండలేకపోతున్నామన్న విషయం అర్థమైన క్షణం నుంచి ఎంతోకొంత వాటికి దూరంగా అలవాటు పడాలి.           


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar


Updated Date - 2020-09-05T04:56:15+05:30 IST